- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్చలు లేని సమావేశాలా?
ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులో విషయాలపై చర్చలు జరగకపోతే ఇంకెక్కడ జరుగుతాయి. మాది నిజాయితీ ప్రభుత్వమని మా నిర్ణయాలన్నీ సరైనవని వారికి వారు కితాబు ఇచ్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల జరిగిన కొన్ని వరుస సంఘటనలు కేంద్ర ప్రభుత్వం నియంతృ వైఖరికి సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి వాటికి కొన్ని ఉదాహరణలు..
స్వాతంత్ర్యం తర్వాత దేశ పాలనకు మన నాయకులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నారు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఉంటారు. వీరు పాలనా వ్యవహారాలలో పాలు పంచుకుంటారు. వీరిలో కొందరు ప్రభుత్వ పక్షంలో ఉంటే మరికొంత మంది ప్రతిపక్షంలో ఉంటూ వారి వారి విధి ధర్మాలు నిర్వహిస్తుంటారు.
పరిష్కారం కోసం..
ప్రభుత్వ పక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పరిచి దేశ పాలనకు అవసరమైన చట్టాలు, దేశ ప్రజల అవసరాలకు తగిన వివిధ పథకాలు రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపడితే ప్రతిపక్షం ఆ చట్టంలోని, ఆ పథకాలలోని సహేతుకతను జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తూ సభలలో చర్చలను లేవదీస్తూ ఉంటుంది. ఈ చర్చల ఫలితంగా ప్రతిపక్షాల సూచనతో ఈ చట్టాలు ఇంకా బలోపేతం అవుతాయి. వీటిలో ఏవైనా లోపాలు ఉంటే తొలగించబడతాయి. అలాగే ఈ విషయం ప్రజలకు తెలుస్తుంది. అంతిమంగా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుంది. రాజ్యాంగ నిర్మాతలు శాసనసభలలో సమర్థవంతమైన చట్టాల రూపకల్పనకు, విధాన నిర్ణయాలలో పారదర్శకత నిరూపణకు అనేక పార్లమెంటు విధానాల ద్వారా చర్చలను సూచించారు. ఇవి తక్షణ ప్రజా ప్రాముఖ్యత కలిగిన ఒక నిర్దిష్ట అంశాన్ని చర్చించడానికి సంబంధించిన వాయిదా తీర్మానం మొదలుకొని సావధాన తీర్మానం, స్వల్ప వ్యవధి చర్చ, ధన్యవాదాలు తీర్మానంపై చర్చ, క్వశ్చన్ అవర్ ద్వారా చర్చ, అనే విధానాలు ఉంటాయి. ఈ విధానాల వల్ల ఒక సమస్యకు అర్థవంతమైన పరిష్కారం చూపబడుతుంది. కానీ ఇటీవల పాలకపక్ష ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం మనుగడకు అవసరమైన చర్చలకు పార్లమెంటులో తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్షాల పట్ల నియంతృత్వ ధోరణి కనబరుస్తున్నాయి. అసలు ప్రతిపక్షాలకు విధాన నిర్ణయాలలో భాగస్వామ్యమే లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. దేశభద్రత ప్రజా ప్రాముఖ్యత అత్యవసర విషయాలపై చర్చించడానికి కూడా అనుమతించడం లేదు.
వీటిపై చర్చ వద్దా?
న్యూయార్క్‌కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికలో గౌతమ్ ఆదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని సభలో చర్చించాలని ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. దీనికి పాలకపక్షం ఒప్పుకోలేదు. దీనితో ప్రతిపక్షాల నిరసనలతో విలువైన పార్లమెంటు సమయం గాలికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం చర్చకు అనుమతిస్తే అదాని స్టాక్ మార్కెట్ వ్యవహారం బయటపడేది. ప్రజల, ప్రతిపక్షాల అపోహాలు దూరమయ్యేయి కానీ ప్రభుత్వం దీనికి ఒప్పుకోలేదు. అలాగే మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని కోరింది. చివరికి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరింది. ఇవి ఏవి సాధ్యం కాకపోవడంతో చివరకు ప్రధానిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో ప్రధాని దిగివచ్చి పార్లమెంటుకు సమాధానం చెప్పవలసి వచ్చింది. అలాగే ఇటీవల పార్లమెంటుపై జరిగిన దాడి గురించి హోంమంత్రి పార్లమెంటు సభలలో ప్రకటన చేయాలని, విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఒప్పుకోకపోగా దాదాపు 151 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుండి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. ఇంత మంది సభ్యులను ఒకేసారి సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అనైతికం. పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధం. సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రతిపక్షాల చర్చలకు ఒప్పుకోకపోవడం ప్రభుత్వ నియంతృత్వానికి చిహ్నం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లవు. సమస్యలపై, సంఘటనలపై చర్చలు లేని సమావేశాలతో ఏం లాభం??
మధుకర్ మునేశ్వర్
99630 43490