ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదా?

by Ravi |
ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదా?
X

టీవల తెలంగాణలోని ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్‌ని తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజకీయ లబ్దికోసం కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారు. దీంతో మరోసారి ముస్లిం రిజర్వేషన్ అంశం తెరమీదకు వచ్చింది. దేశంలోని హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. అందుకే కర్ణాటకలో ఇప్పటివరకు ముస్లింలకు అమలుచేస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసింది. ఈ సారి కన్నడనాట పరిస్థితులు మారి కాంగ్రెస్‌లోకి అనుకూలంగా మారడంతో ఎప్పుడూ లింగాయత్ సామాజికవర్గం మీదనే ఆధారపడే కమలనాథులు కులాలకతీతంగా హిందూ ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

వారి సమస్యలకు కారణమిదే!

మనదేశంలో ముస్లిం సమాజం దారుణ పరిస్థితుల్లో ఉండి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడింది. చాలావరకు రోడ్ల మీద పండ్లు, పల్లీలు అమ్ముకునే వాళ్లు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్లు, మోటార్ మెకానిక్కులు...ఇలా రెక్కల కష్టం మీద బతికేవాళ్లలో ఎక్కువమంది ముస్లింలే కనిపిస్తారు. అంతేకాదు ఎంతోమంది డ్రైవర్లుగానూ, తోటమాలీలుగా పనిచేసేవాళ్ళలో ఎక్కువమంది ముస్లింలే ఉంటారు. అంతేకానీ అధికారులుగా ఎవరూ కనపడరు. ఎవరైనా ముస్లిం ఐఏఎస్ అధికారి ఉంటే అపురూపమే. ఈ నేపథ్యంలో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2005లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న సచార్ కమిటీ వారి వెనకబాటుతనంపై సాధికారికంగా అధ్యయనం చేసి 2006లో కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ముస్లింలు 14 శాతం ఉన్నారు. అధికార యంత్రాంగంలో ముస్లింల శాతం కేవలం 2.5 శాతం మాత్రమేనని తేల్చింది. ఈ కమిటీ నివేదిక అనేకరంగాల్లో భారతీయ ముస్లింల వెనకబాటుతనాన్ని జాతీయ దృష్టికి తీసుకొచ్చింది. చదువు లేకపోవడమే ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని ఈ కమిటీ తేల్చి దీనికోసం బాలికా విద్యపై ఫోకస్ చేయాలని సూచించింది. అలాగే ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సచార్ కమిటీ సూచించింది. ఈ కమిటీ ముస్లిం సమాజం బాగు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది.

అన్ని వర్గాలకు ప్రతినిధులు కాదా?

జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సూచించిన ఈ సిఫార్సుల్లో అమలుకు నోచుకున్నవి అరకొర సిఫార్సులే. మిగతావన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆర్థికంగా ముస్లింలను ఆదుకోవడానికి గ్యారంటీ లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. దీనిని బ్యాంకర్లు తోసిపుచ్చారు. అలాగే జాతీయస్థాయి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కొంతకాలంగా కేంద్రం నిధులు ఇవ్వడం ఆపివేసింది. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ముస్లిం మైనారిటీల వ్యతిరేక విధానాలు ఊపందుకున్నాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ తాము ముస్లింల ఓట్లు అడగబోమని బీజేపీ నాయకులు ఓపెన్‌గా చెప్పారు. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముస్లింలు, భారతీయ సమాజంలో భాగం కారా? ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరైనా ఒక పార్టీకో లేదా ఒక సామాజికవర్గానికో పరిమితం కాదు కదా? ఆయా నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో ప్రతినిధులు. సమాజంలోని మిగతా వర్గాలతో పాటు ముస్లింల ప్రయోజనాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉంది. ఈ బాధ్యత తమమీద లేదని బీజేపీ అగ్రనేతలు బాహాటంగా చెప్పగలరా? ఒకవైపు ముస్లింలలో అత్యంత వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుంటారు. మరోవైపు అసలు ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా బహిరంగంగా ప్రకటిస్తుంటారు. బీజేపీ పార్టీ ముస్లిం సమాజానికి సంబంధించి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కారణాలేమైనా ప్రస్తుతం భారతీయ ముస్లిం సమాజం సమస్యల చౌరస్తాలో నిలబడి ఉందన్నది వాస్తవం.

ఎస్‌. అబ్దుల్ ఖాలిక్

63001 74320

Next Story

Most Viewed