అగ్రకుల పార్టీలు బీసీలకు అవసరమా?

by Ravi |   ( Updated:2023-10-17 00:15:08.0  )
అగ్రకుల పార్టీలు బీసీలకు అవసరమా?
X

దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహిళా బిల్లును చేపట్టక కేంద్రానికి తప్పలేదు. ఈ బిల్లుకు ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం మహిళా బిల్లును ఆమోదించక తప్పలేదు. అయితే ఈ సమావేశాల్లోనే ఎప్పటినుంచో బీసీల ప్రధాన డిమాండ్ అయిన ఓబీసీ బిల్లును ఆమోదిస్తారని అనుకున్నారు. కానీ ఈ సారి నిరాశే మిగిలింది.

ప్రస్తుతం దేశంలో కులాల్లోనూ.. అగ్రకులాలు వేరయా! అనుకోవాల్సిన పరిస్థితి ఉండటం దారుణాతి దారుణం. నిధులు, నియామకాలు, రిజర్వేషన్లు, రాజ్యాంగ పదవులు సమానంగా కల్పిస్తామన్న వాగ్దానాలపై ఆశలు ఏడు దశాబ్దాలుగా మోసం చేస్తున్నాయి. వెనుకబడిన వర్గానికి చెందినవాడు ప్రధాని కావడాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అంటూ ముసలి కన్నీరు పెడుతున్న నరేంద్ర మోదీ.. ఒకపక్కన ఎన్నికల ముందు రిజర్వేషన్ వాగ్దానం చేసి ఇప్పుడు మాత్రం కుదరదని అగ్ర కులస్తులు మాటలే వల్లెవేస్తుండటం బాధాకరం. పైగా రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకే ఉండాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తే పట్టించుకోకపోవడంపై బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతున్నది.

ప్రతిపక్షాల విమర్శల ధాటికి తట్టుకోలేక మోదీ.. బీసీ మంత్రాన్ని జపిస్తున్నారు. మరి బీసీ కులం నుంచి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన, పార్లమెంటులో బీసీ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టి పాస్ చేయించలేదు. ఉభయ సభల్లో కావలసిన మెజారిటీ సభ్యులు బీజేపీకి ఉన్నా కూడా ఈ బిల్లు విషయంలో ఎందుకు శ్రబ్ద తీసుకోలేదని దేశంలోని 80 కోట్ల మంది బీసీలు అడిగితే ఏం సమాధానం చెబుతారు.

అన్ని పార్టీలూ తోడు దొంగలే

ప్రతి ఎన్నికల సమయంలో సామాజిక మంత్రాన్ని అన్ని పార్టీలు జపిస్తుంటాయి. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. సుమతీ' అన్న విధానాన్ని మన రాజకీయ పార్టీలు పాటిస్తున్నాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ బిల్లు పాసైతే చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగి, వారి హక్కుల కోసం వారు చట్టసభల్లో గొంతెత్తి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చట్టసభల్లో బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నా, వారంతా ఏదో ఒకపార్టీ గుప్పిట్లో బందీలుగా ఉంటున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి బీసీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో తమ గళం వినిపించాలంటే ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఈ రిజర్వేషన్లను కల్పిస్తేనే రాజ్యాధికారం సాకారమవుతుంది. ఇది ఏదో ఒకనాడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయం ముందే తెలుసుకున్న ఆధిపత్య కులాల పార్టీలు దీనిని ఎందుకు ఆమోదిస్తారు. అందుకే పార్టీలు ఈ బిల్లు విషయంలో అంటీ అంటి ముట్టనట్టుగా ఉన్నాయనేది నగ్నసత్యం. కానీ బీసీల ఓట్లకోసం ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నామంటున్నాయి.

సంపదను సృష్టించేది బహుజనులు. వీరిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి సమాన హక్కులు దొరకడం లేదు. నిజానికి రిజర్వేషన్ల శాతం పెంచే అధికారం రాష్ట్రాలకే ఉండాలని కోరుకోవడం మెచ్చుకోదగ్గదే. ఇది దేశవ్యాప్త ఉద్యమానికి ఇది దోహదపడేది. కానీ పాలకులకు అటువంటి ఆలోచన రాలేదు కదా, పార్టీలో ఆ ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న బీసీ నేతలైనా తమ అధినేతకు బీసీని సీఎం చేస్తే బాగుంటుందని సూచించాలనే ధ్యాస రాకపోవడం నిజంగా బీసీల దౌర్భాగ్యం, రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని పార్లమెంటును స్తంభింపచేసిన ఎంపీలు బీసీ బిల్లు కోసం ఎందుకు పట్టుబట్టలేదు? పట్టుబట్టి బిల్లును ఆమోదింపదింపజేసుంటే బీసీలు మీకు రుణపడి ఉండేవారు కదా. మీ పార్టీకి అండగా నిలిచేవారు. కానీ అలా జరగలేదు.

కులాల పేరిట విడిపోయి అనైక్యంగా ఉన్న బీసీలు మమ్మల్నేమి చేయలేరులే అని పాలకులు భావిస్తుండవచ్చు. కానీ ఆంధ్రా పాలకుల నుంచి ఎదురైన అవమానాలతోనే తెలంగాణ ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన తీరుగానే బీసీలు అవమానాల నుండే అగ్గిపిడుగులుగా మారుతారు. బీసీల విషయంలో కాంగ్రెస్ కూడా ద్రోహపూరిత విధానాలనే అవలంభించింది. ఆ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా బీసీలకు చేసింది సున్నా. పోనీ ప్రతిపక్షంలో ఉన్నా ఏమైనా బీసీల కోసం ఏమైనా చేస్తుందా అంటే అదీ లేదు. కాంగ్రెస్ పార్టీ గనక బీసీ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడి ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఆ పార్టీకి అనుకూలంగా మారేవారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. ఇక బీజేపీ పార్టీ ఇది పక్కా మనుదావ పార్టీ, వీరి లెక్క ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎప్పటికీ బానిసలుగానే చూస్తుందే తప్ప తమతో సమానంగా ఆదరించదు.అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు సైతం ఆధిపత్య కులాలు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులాలు, ఈ ఆధిపత్య కులాల చేతుల్లోనే సంపదంతా దాగి ఉంది. భూములు, సినిమా,ఫ్యాక్టరీలు. మీడియాతో పాటు అన్ని రకాల వ్యాపారాలు ఈ కొద్ది మంది చేతుల్లోనే సంపద కేంద్రీకరించబడి ఉంది.

అంత సీనుందా? అని అనుకోవద్దు!

అయితే బీసీలలో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగలేదా? అనే సందేహం రావచ్చు. ఈ దేశంలో 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారు నూటికి 90 మంది అభివృద్ధి సాధించారు. మరి దేశంలో 85 శాతంగా ఉన్న బహుజనులు ఎంత అభివృద్ధి సాధించారు. దీనిని బట్టి ఎవరు అభివృద్ధి చెందారో అర్థం చేసుకోవచ్చు. బీసీలను తొలినాటి నుంచే తొక్కేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత దేశంలోని ఇతర పార్టీలకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచింది. కాబట్టి కాంగ్రెస్ పెద్ద గజ దొంగ అయితే ఇతర పార్టీలు చిన్న దొంగలుగా మిగిలి పోయాయి. ప్రస్తుతం రానున్నది ఎన్నికల కాలం. బీసీల గురించి అటు అసెంబ్లీలో కానీ, ఇటు పార్లమెంటులో కానీ ఏ బిల్లులు ఆమోదించాలన్నా రానున్న వర్షాకాల సమావేశాలే దిక్కు ఇక ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బీసీ బిల్లు, బీసీలకు సబ్ ప్లాన్ వంటివన్నీ అటకెక్కిపోతాయి. కాబట్టి పాలకులు, పార్టీలు బీసీల పట్ల తమకున్న ప్రేమను నిరూపించుకోవాలి. లేదంటే ఆయా రాజకీయ పార్టీలన్నీ బీసీ వ్యతిరేక పార్టీలుగానే మిగిలిపోతాయి. అవసరమైతే బీసీలే రాజకీయ పార్టీని స్థాపించుకుని ఓట్లు మావే, సీట్లు మావే అని నిరూపించుకుంటారు. ఈ మాటలు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. బీసీలకు అంత దమ్ముందా అని ఎవరైనా భావిస్తే తెలంగాణ ఉద్యమ సాధనలో తొలి, మలి అమరులు శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్యలే స్పూర్తిగా నిలుస్తారు. బీసీలతోపాటు దళిత బిడ్డల బలి దానాలతోనే రాదనుకున్న తెలంగాణ కల సాకారమైంది. బీసీల రాజ్యం అంత కన్నా సునాయాసంగా అంటే ఆత్మబలిదానాలు, ఆందోళనలు, రాస్తారోకోల అవసరం లేకుండానే సాధ్యమవుతుంది. ఇకనైనా వచ్చే ఎన్నికలలో ఓటు ద్వారా అగ్రకుల పార్టీలను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌న్నారం నాగ‌రాజు

రాష్ట్ర అధ్య‌క్షుడు

తెలంగాణ లోక్‌స‌త్తా పార్టీ

95508 44433

Advertisement

Next Story

Most Viewed