- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనుమరుగవుతున్న విద్యార్థి నాయకత్వం
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాల ఆవశ్యకత చాలా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వ్యవస్థల్లో సమూల మార్పులు వచ్చినా పాత సమస్యలు ఏదోలా వెంటాడుతుంటాయి. కొత్త సమస్యలు పుడుతున్నాయి. ఈ సమస్యలను విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తే మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తే పరిస్థితిని నేడు చూస్తున్నాము. పుస్తకాలు పట్టుకొని చదువు కోసం కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉద్యమ బాట పడితే, సమస్యలపై పోరాటబాట పడితే, చదువులు చెప్పాల్సిన గురువులే విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి అణిచివేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థుల బాధలు వినడానికి, వారి ముందు ఉండి తెగించి కేసులు, జీవితాన్ని లెక్కచేయకుండా మన సమస్యలు ఉద్యమం ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి తెలిసేలా చేద్దాం కలిసి రండి అని నడిపే వ్యక్తిత్వం ఒక విద్యార్థి నాయకులకు మాత్రమే ఉంటుంది.
ప్రశ్నించే గుణం కోల్పోయి..
ఒకప్పుడు విద్యార్థి నాయకుల నుండి రాజకీయ నాయకులుగా మారేవారు. కానీ నేటి సమాజంలో విద్యార్థి నాయకులంటే అణిచివేసే దుస్థితి. ఎంతోమంది మేధావులు దీనిని ఖండిస్తున్నారు. ఎందుకంటే నేటి విద్యావస్థలో ఉన్న సమస్యలను పోరాడి పరిష్కరించగలిగేది ఒక విద్యార్థి నాయకులు మాత్రమే. దీనినే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ‘కొన్ని దశాబ్దాలుగా విద్యార్థి లోకం నుంచి ఒక చెప్పుకోదగ్గ పెద్ద నాయకుడు ఎవరు ఉద్భవించలేదని’ ప్రస్తావించారు. ఒక మాజీ సీజేఐ ఇలా ప్రస్థావించారంటే లోపాలు ఉన్నట్టే కదా! ఇందులో గురువుల తప్పు సైతం ఉంది. ఒక విద్యార్థి తన సమస్యను ముందు పెట్టినప్పుడు సర్దుకుపోవాలని నచ్చ చెప్తున్నారు.. కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పడం లేదు. పైగా ఉన్నతాధికారులకు కొమ్ముకాస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం కలకలం సృష్టించే అంశం కాదా?
విద్యార్థులను వ్యవస్థల్లో లోపాలకు అలవాటు పడేలా చేయడం వలన పట్టభద్రులు అయ్యాక వారు పనిచేసే వ్యవస్థల్లో కూడా సర్దుకుపోతున్నారు. దాని కారణంగా ప్రశ్నించే గుణం పోయి బానిస బ్రతుకు అలవడుతుంది. విద్యా వ్యవస్థలో మార్పులు అంటే కొత్త సిలబస్ కొత్త కోర్సులు కాదు... విద్యార్థుల్లో సమూల మార్పులు రావాలి. వారిలోని చైతన్యం వారు భవిష్యత్తులో పని చేసే వ్యవస్థలో కొత్త అధ్యాయాలు సృష్టించాలి. నేటి విద్యార్థుల్లో సామాజిక స్పృహ, నైతిక విలువలు, ప్రపంచ జ్ఞానం, దేశ సమస్యలు, దేశ రాజకీయాలు ఇలాంటి సహజమైన విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇవి కొరవడడంతో వ్యవస్థల్లోని లోపాలన్నిటిని ప్రశ్నించి, పోరాడి సాధించే పూర్తి సామర్థ్యం విద్యార్థి కోల్పోతున్నాడు. వీటి ఆవశ్యకత మళ్లీ వాటి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది.
విద్యార్థులను చేతగానివారిగా మారుస్తూ..
అయితే ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు విద్యాలయాల్లో ప్రవేశం లేదు అని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది తప్పకుండా ప్రశ్నించే గొంతులను ఉక్కుపాదంతో అణచివేసే చర్య. దీన్ని అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ఈ ఉత్తర్వుల వల్ల ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విద్యాలయాల్లో సమస్యలను ప్రశ్నించే గొంతులు లేక విద్యార్థులు విలవిలలాడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే విద్యార్థి సంఘాలను బహిష్కరిస్తే దాని ప్రతిఫలం విద్యార్థులు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలల్లో రోజురోజుకు ఆత్మహత్యలు, ఫీజు దోపిడీలు, హృదయ విదారక సంఘటనలు కలవరపరుస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల కోసం, ప్రభుత్వ స్వలాభం కోసం విద్యార్థి సంఘాలకు అనుమతినివ్వకపోవడం సరైన చర్య కాదు.
ప్రస్తుతం సమాజాన్ని, యువతను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నిలిచి నిత్యం విద్యార్థులతో కలిసి పోరాడే గలిగే సత్తా విద్యార్థి సంఘాలకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ, బోధించే గురువులు కానీ తమ స్వలాభాల కోసం విద్యార్థులను చేతకాని వాళ్ళ లాగా మార్చకూడదు అని మేధావుల హితవు. గత చరిత్ర చూసుకుంటే విద్యార్థి ఉద్యమాల వల్ల సమాజంలో, విద్యా వ్యవస్థలో ఎన్నో సమూల మార్పులు జరిగాయి. కాబట్టి వీటిని మళ్లీ ఒకసారి స్మరణకు తెచ్చుకుని విద్యార్థులను బానిసత్వ ఆలోచన నుండి బయటకు తెచ్చి స్వతంత్రులుగా మార్చే నైతిక బాధ్యత మనమందరం తీసుకోవాలి. విద్యార్థి శక్తి జాతీయ శక్తి. మార్పు రావాలి అంటే విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు పునర్ వైభవ స్థితికి రావాలి. విద్యార్థుల నుండి పుట్టే వారే విద్యార్థి నాయకులు. వాళ్లే రేపటి దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు కావాలి.
సాయి యశ్వంత్
95020 52909