క్షీణిస్తున్న బంధాలు..

by Ravi |   ( Updated:2024-10-23 00:31:13.0  )
క్షీణిస్తున్న బంధాలు..
X

ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షల మంది భారతీయ సంతతి వారే ఉన్నారు. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీ య మూలాల వారే! దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్టమైన వ్యాపార బంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణిలో వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్య యుద్ధ వాతావరణాన్ని ఊహించ లేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజల కూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం.

ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

జస్టిన్ ట్రూడో ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ భారత ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరినే అవలంబిస్తున్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ నేతలకు కొమ్ముకాస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచే సిక్కు సంతతి ప్రజలు కెనడాకు వలస వెళ్లడం మొదలైంది. 1970 దశకంలో అక్కడి వలస చట్టాలను సరళతరం చేయడంతో సిక్కుల వలసలు మరింత పెరిగాయి. అదే సమయంలో ఖలిస్థాన్ ఉద్యమంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అనేకమంది ఉగ్రవాద నేతలు కెనడాకు వలస వెళ్ళిపోయారు. నిజ్జర్, పర్మార్ వంటి వారు ఆ కోవకే చెందినవారే. ప్రస్తుతం కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు ఉన్నారంటే సిక్కులకు ట్రూడో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. కెనడాలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రూడో నాయకత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్య లకు దిగిన ట్రూడో, భారత్‌పై వేధింపు చర్యలకు పాల్పడుతూ, సిక్కు ఓట్లు కొల్లగొట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

మిత్ర సంబంధాలు కొనసాగాలి

భారత్-కెనడా సత్ సంబంధాలు దెబ్బ తినడానికి కారణం జెస్టిన్ ట్రూడో ప్రవర్తనే కారణం. ఎన్నికల్లో గెలవడానికి భారత్ పై నిందలు వేయటం ఎంతమా త్రం సబబు కాదు. ఒకవేళ ఆయన ఆరోపణల్లో కొంచెమైనా నిజం ఉందని అనుకున్నా.. మిత్రదేశంతో గుట్టుగా సంప్రదించి, వ్యవహారం చక్కబెట్టుకోవాలి. అంతే కానీ ఇలా వీధికెక్కి ప్రకటనలతో గో ల చేయటం ఎంత మాత్రం తగదు.ఇక్కడే ట్రూడో స్వార్థ ప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక,అవాంఛిత ఆరోపణలకు దిగుతూ,ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్ధమవుతోంది. భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జనరల్ ఎలక్షన్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ, ప్రస్తుతం ఆయన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తాన్ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట మరో శతృదేశంగా కెనడా మారనుందా!?

- డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Advertisement

Next Story

Most Viewed