తగ్గిన మోడీ ప్రాభవం..పుంజుకున్న కూటమి

by Ravi |   ( Updated:2024-06-05 01:15:11.0  )
తగ్గిన మోడీ ప్రాభవం..పుంజుకున్న కూటమి
X

18వ లోక్‌సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూసింది. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్తవాసియా అనే ఉత్కంఠ నిన్నటితో తెరపడింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. భారతదేశ ప్రజలు చైతన్యస్ఫూర్తినీ తమ ప్రజా తీర్పు ద్వారా రుజువుచేసారు.

అబ్ కి బార్ చార్ సవ్ పార్ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్‌డీఏ కూటమికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో బీజేపీపై నమ్మకం తగ్గేలా చేసాయి. కులం, మతం పేరుతో ప్రజలను చీల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కలలు కన్న కమలనాథుల కలలు కల్లలు అయ్యాయి. చార్ సవ్ పార్ లక్ష్యానికి దూరమైంది. అయోధ్య రాముడిని ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా కూడా ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేదు.

ప్రజల చరిత్రాత్మక తీర్పుతో..

ప్రతిపక్ష ఇండియా కూటమి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రజా ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో కొంతవరకు సఫలం అయిందని చెప్పవచ్చు. మోడీ 3.0 మళ్లి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్లి బీజేపీ ఓటు బ్యాంకుకి గండి కొట్టింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ దూద్ కా దులా కాదని గ్రహించిన ప్రజలు దేశ భవిష్యత్తు కోసం చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగినట్టుగా మనం భావించవచ్చు. ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపర నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జిట్ పోల్‌లో వచ్చిన ఫలితాలే ఎగ్జాక్ట్ పోల్‌లో వస్తాయని భావించిన భారతీయ స్టాక్ మార్కెట్లు ఆశించిన రీతిలో ఫలితాలు రాకపోవడంతో కుప్పకూలాయి. లక్షల కోట్ల సంపద ఒక్కరోజులో ఆవిరైపోయింది. సామాన్య మదుపరులు చాలా నష్టపోయారు. మోడీ 3.0కి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఆర్థిక సంస్కరణలు, ప్రాధాన్యాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్టాక్ మార్కెట్లు భావించాయి.

అనుకూల మీడియా ప్రచారం చేసినా..

ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ముఖ్యంగా యూట్యూబర్లు దృవ్ రాతి, రావిష్ కుమార్ వంటి వారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ రాతి వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరి ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. వీరి ద్వారా దాదాపుగా 20%-25% ఓటర్లు ప్రభావితం అయ్యారని ఒక అంచనా. మరోవైపు ప్రపంచంలోనే అత్యధికంగా సోషల్ మీడియా వినియోగం ఉన్న బీజేపీ పార్టీ తనకు అనుకూల మీడియా ద్వారా అత్యధికంగా ప్రచారం చేసింది. కానీ బీజేపీ అనుబంధ సోషల్ మీడియా వీక్షకులు ధ్రువ్ రాతి వంటి వారితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నారు. ఉత్తర భారత దేశంలో బీజేపీ ప్రాభవం తగ్గుతూ ఉంటే.. దానికి భిన్నంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కూటమికి ప్రజలు పట్టంకట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసం జరిగింది. ఆరు నెలల కింద జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకు తగ్గింది. ఈ ఫలితాలను పరిశీలిస్తే.. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై కాస్తా వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలు వారి పాలనపై 50% మాత్రమే సంతృప్తితో ఉన్నారని మనకు అవగతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీపై ఏర్పడిన వ్యతిరేకత, మోడీ మానియా, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌లు బీజేపీ వైపు టర్న్ అవుట్ అయినట్టుగా ఎన్నికల ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది.

నియంతృత్వ పోకడలు సహించరు..

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన ఓటు బ్యాంకుని గణనీయంగా పెంచుకోగలిగింది. ఈ ఆరు నెలల కాలంలో బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సఫలమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు విస్తృత స్థాయిలో ప్రజల్లో చర్చించడం ద్వారా బీఆర్ఎస్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లెలా చేసింది. దాని ఫలితమే బీఆర్ఎస్‌కి ఓట్ షేరింగ్ పడిపోవడానికి కారణమైంది. పాలకులు ప్రజా అభీష్టం మేరకు పని చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, నియంతృత్వ పోకడలను ప్రజలు సహించరని.. మొన్నటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నేటి పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసాయి. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా నైనా రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలుగా పాలకులు పనిచేయాలని రాజకీయంగా లబ్ధికి కులమతాలను వాడుకోకూడదని వారికి అర్థం కావాలి. అధికార, అర్ధబలాలే కాకుండా ప్రజాబలం ఉంటేనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మనగడ సాధ్యమవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మికుల కర్షకుల సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Advertisement

Next Story