- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవీయ ఉద్యమాల 'దండోరా'
దండోరా... 30 ఏళ్ల కింద మాదిగల హక్కుల కోసం ఏర్పడిన సంఘం. ఉమ్మడి రిజర్వేషన్లతో అధిక జనాభా గల మాదిగలు నష్టపోతున్నారని ప్రకాశం జిల్లా ఈదుమూడిలో 14 మందితో పురుడుపోసుకున్న ఈ సంఘం. నేడు భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేంతలా ఓ మహాశక్తిగా తయారైంది. తరతరాలుగా ఓడిపోతున్న జాతిని గెలిపించడానికి జరుగుతున్న మాదిగ దండోరా పోరాటానికి మూడు దశాబ్దాలు కావస్తుంది. అయినా ఎప్పటికీ నిత్య చైతన్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమం కొత్త పంథాను అందుకుంటూ ఎదుగుతుందే తప్పా... ఎక్కడా తగ్గడం లేదు.
ఓ న్యాయమైన డిమాండ్ కోసం మూడు దశాబ్దాలుగా అలుపు లేకుండా కృషి చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో మాదిగలను విస్మరిస్తే... ఆ రాజకీయ పార్టీలకు పరాభవం తప్పని పరిస్థితులు నెలకొనేలా ఓ స్పష్టమైన సిద్ధాంతంతో మాదిగ దండోరా ఉద్యమం సాగుతోంది. ఎస్సీల్లో ఉన్న ఉపకులాలను వర్గీకరించి అందులో మెజారిటీగా ఉన్న మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం సాగుతున్నది.
ఈ ఉద్యమం మూలంగానే..
మాదిగ దండోరా ఉద్యమం మాదిగ కులాల కేంద్రంగా ప్రారంభమైనప్పటికీ..అనేక మానవీయ ఉద్యమాలకు అండగా నిలిచింది. దీని స్ఫూర్తితో వివిధ సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. దండోరా ఉద్యమం తెచ్చిన చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక ప్రశ్నలు, పోరాట రూపాలతో ప్రభుత్వాలను దిగివచ్చేలా చేసింది. ఉదాహరణకు వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం చేయాలనే దృక్పథంతో మంద కృష్ణ మాదిగ దండోరా ఆధ్వర్యంలో చేసిన ఉద్యమ ఫలితమే నేటి ఆరోగ్య శ్రీ పథకం అమలు కావడం. వికలాంగుల కోసం కొట్లాడి.. వారికి పింఛన్ పెంపు చేయాలనే డిమాండ్‌తో జరిగిన ఉద్యమ నినాదంతో ఆనాడు వికలాంగులకు 500ల పింఛన్ పెంచి నేడు అది తెలంగాణలో 4 వేలకు చేరగా... మొన్నటి ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం వికలాంగులకు 7 వేలకు పింఛన్ పెంచి అందజేస్తుంది. ఇలా ఒక్కటి రెండు కాదు ఎక్కడ అన్యాయం జరిగినా మొదటగా నినదించే గొంతుకగా దండోరా కృషి చేస్తుంది. అనేక కుల, సామాజిక సంఘాలకు దండోరా ఉద్యమమే ప్రేరణగా చెప్పవచ్చు.
మాదిగల నినాదాన్ని ఎత్తుకోకపోతే..
బీసీలలో ఎవరి వాటా ఎలా అనుభవిస్తున్నారో అలాగే ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలనే డిమాండుతో మూడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది. 2000ల సంవత్సరం నుంచి 2004 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం హయంలో ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రంలో అమలులో ఉంది. ఫలితంగా మాదిగలు అనేక సంఖ్యలో వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలిగారు. 2004 తర్వాత కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన యుపీఏ ప్రభుత్వం వర్గీకరణపై మాట మారుస్తూ కాలయాపన చేస్తూ వచ్చాయి. మాదిగల ఆకాంక్షే అంతిమ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ బలమైన చైతన్యంతో ఉద్యమిస్తున్న ఫలితంగా ప్రతీ రాజకీయ పార్టీ ఇప్పుడు మాదిగల నినాదాన్ని ఎత్తుకోకపోతే మనుగడ సాధ్యం కాని పరిస్థితి. మందకృష్ణ మాదిగ ప్రచారం సైతం ఏపీ రాజకీయాలలో కలిసివచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించగానే పింఛన్లు పెంచి అందజేశారు. అలాగే ఓ మాదిగ మహిళ వనితను హోంమంత్రిగా గౌరవించేలా చేయడంలో మందకృష్ణ మాదిగ కృషి ఉందనే చెప్పొచ్చు.
ఏ రాజకీయ అండ లేకున్నా..
తెలంగాణలోనూ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్ల ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ సర్కార్ పదేళ్లు అయినా చేయకపోవడంతో అనేక సభలు, సమావేశాలతో హెచ్చరించడం జరిగింది. కాగా గత కొన్ని నెలల క్రితం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మాదిగల సమావేశంలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ జన ప్రభంజనాన్ని చూసి .. మోడీనే ఒక్కింత ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే... మాదిగల ఆకాంక్షకు సాక్ష్యంలా ఆ సభ మారింది. మందకృష్ణను ఓ పెద్ద నాయకునిగా మోడీ వర్ణించాడంటే ఆ సామాజిక ఉద్యమం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ రాజకీయ అండదండలు లేకుండా కేవలం తరతరాలుగా అణచివేతకు గురవుతున్న తమకు సమాజంలో సామాజిక సమానత్వం దక్కాలనే బలమైన ఆకాంక్షే.. నేడు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల చేత మాదిగ నినాదాన్ని సమర్థించేలా చేస్తోంది.
ఎవరి జనాభాకు తగ్గట్టు..
రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మాదిగల పక్షాన బలమైన గొంతుకగా మారి రాజకీయ వాటాకోసం కృషి చేయడంతోనే మాదిగలకు ఆయా రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎక్కడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా... సామాజిక ఉద్యమాలకు దండోరా అండగా నిలుస్తుంది. ఓ వైపు జాతి ప్రయోజనాల కోసం ఉద్యమిస్తూనే సామాజిక, ఆర్థిక అసమానతల ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తుంది. సామాజిక సమానత్వానికి దూరంగా ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాల వారికి ఎవరి జనాభాకు తగ్గట్టు వారికి రిజర్వేషన్లు కల్పించి మాదిగల సుదీర్ఘమైన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి సమిష్టిగా కదలాల్సిన అవసరం ఉంది.
(నేడు మాదిగ దండోరా ఆవిర్భావ సభ)
సంపత్ గడ్డం
78933 03516