- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు అమలు చేసి ఇతర పథకాలెన్ని నిర్వీర్యం చేశారో తెలుసా?
ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అన్నదాతల ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సోషల్ మీడియా వరకు అందరూ రైతుల మీద సానుభూతి చూపేవారే! వారి ఆదాయం పెరిగేందుకు మాత్రం ఎవ్వరూ కృషి చేసిన దాఖలాలు లేవు. అలవికాని హామీలిచ్చి ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు అసలు వ్యవసాయానికి ఎలాంటి సాయం చేయాలి? ఏయే అంశాలకు రాయితీలివ్వాలి? ఏయే రుణాలను మాఫీ చేయాలి? రైతులను ఎలా ఆదుకోవాలి? అనే అంశాలపై సరైన అవగాహనే ఉండడం లేదు. ఇదే రైతులకు శాపంగా మారుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం మీద సరిగా దృష్టి సారించకపోతే, సాగుబడి సంక్షోభంలో కూరుకుపోయి రానున్న కాలంలో భారీ ముప్పును ఎదుర్కోక తప్పదు.
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తామన్న పాలకుల హామీ నెరవేరడం లేదు. రానురాను అన్నదాతలకు వ్యవసాయం భారంగా మారుతున్నది. భవిష్యత్‌లో సేద్యం ప్రమాదంలో పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్క రైతుబంధు పథకంతో యావత్ వ్యవసాయ రంగమే మారిపోతుందన్న భావనలో ఉన్న ప్రభుత్వం త్వరితగతిన కళ్లు తెరవకపోతే నష్టాలు తప్పేలా లేవు. యేటా సర్కారు బడ్జెట్‌లో పొందుపరుస్తున్న కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతోంది. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అటకెక్కడంతో సాగుబడి సంక్షోభంలోకి నెట్టివేయబడుతోంది.
ఊసే లేని పథకాలు
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుతామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ క్రీడలో అన్నదాతలు బలికావాల్సి వస్తోంది. ఫలితంగా సేద్యంపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయం కోసం ప్రవేశపెట్టిన పంటల బీమా, వడ్డీ రాయితీ, రుణమాఫీ, విత్తన సబ్సిడీ, యాంత్రీకరణ, ధరల స్థిరీకరణ లాంటి పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయి. రైతుబంధు పథకాన్ని మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని పట్టించుకోకపోవడం రైతులకు భారంగా మారుతోంది. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న రైతులు సబ్సిడీ లేకపోవడంతో విత్తనాలకే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విత్తన భాండాగారంగా చెప్పుకునే తెలంగాణలో పత్తి, మిర్చి తదితర పంటల విత్తనాలను ప్రైవేటులోనే కొనాల్సి వస్తోంది. ఇదే సమయంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చిన తెలంగాణ రాష్ట్రం మూడేళ్లవుతున్నా ఇంతవరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురాలేదు. యేటా ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నా ప్రభుత్వం మాత్రం కిమ్మనడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీలను అందించకపోవడంతో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ భూములు ఇప్పటికే సారం కోల్పోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, సీజన్‌కు అనుగుణంగా భూసార పరీక్షలు జరపడంలేదు. గతంలో భూ పరీక్షలు జరిపి, సాయిల్ హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ రాష్ట్రంలో ఎక్కడా భూ పరీక్షలు చేసిన దాఖలాలు లేవు.
Also read: రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు
యాంత్రీకరణకు ఇంధన భారం
సేద్యానికి యంత్రం తోడైతే రైతుల ఆదాయం పెరుగుతుందని, శ్రమ కూడా తగ్గుతుందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం 2015–16 తరువాత నుంచి యాంత్రీకరణ పథకంపై ఎలాంటి చర్యలనూ తీసుకోలేదు. తత్ఫలితంగా రాష్ట్రంలో పాత పద్ధతులలోనే రైతులు సేద్యం చేసుకుంటున్నారు. యంత్రాల వినియోగం పెరుగుతున్న తరుణంలోనే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరగడంతో రైతులకు సాగు మరింత గుదిబండగా మారుతోంది. యాంత్రీకరణకు ఇంధన భారం పెరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడం బాధాకరం.
నిజానికి రాష్ట్రానికి పంటల ప్రణాళిక అవసరం. అశాస్త్రీయ ప్రణాళిక సమస్యను సృష్టించడమే కాకుండా రైతులకు శ్రమకు తగిన ఫలితాన్ని అందించదు. ప్రస్తుతం తెలంగాణలో సీజన్‌వారీగా పంటల ప్రణాళికలు రూపొందించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రజల అవసరాలు, పంటలు ఏమిటనే అంశాలపై ఇప్పటికీ రాష్ట్రం సమగ్ర వివరాలను పొందుపరచలేదు. వరి, పత్తి పంటలనే ఇబ్బడి ముబ్బడిగా సాగు చేస్తుండడంతో భూములు దెబ్బతిని, వినియోగానికి అవసరమైన పంటలు పండడం లేదు. దీంతో ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి మాత్రమే పండితే చాలన్న భావన నుంచి సర్కారు బయటకు రావాలి.
Also read: ఆత్మహత్యలకు గల కారణాలేంటి?
పెరగని రైతు ఆదాయం
ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అన్నదాతల ఆదాయం మాత్రం పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సోషల్ మీడియా వరకు అందరూ రైతుల మీద సానుభూతి చూపేవారే! వారి ఆదాయం పెరిగేందుకు మాత్రం ఎవ్వరూ కృషి చేసిన దాఖలాలు లేవు. అలవికాని హామీలిచ్చి ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు అసలు వ్యవసాయానికి ఎలాంటి సాయం చేయాలి? ఏయే అంశాలకు రాయితీలివ్వాలి? ఏయే రుణాలను మాఫీ చేయాలి? రైతులను ఎలా ఆదుకోవాలి? అనే అంశాలపై సరైన అవగాహనే ఉండడం లేదు. ఇదే రైతులకు శాపంగా మారుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం మీద సరిగా దృష్టి సారించకపోతే, సాగుబడి సంక్షోభంలో కూరుకుపోయి రానున్న కాలంలో భారీ ముప్పును ఎదుర్కోక తప్పదు.
దండా రామకృష్ణ
93925 50841