రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు

by Ravi |   ( Updated:2022-09-09 18:31:00.0  )
రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు
X

టీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలోనే నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. అందులో తమ ప్రమేయమేమీ లేనట్లుగానే మాట్లాడారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వీరందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక రైతు ఆత్మహత్యలు ఎక్కువైనట్లు మాట్లాడుతున్నారు. వారందరికీ ఎన్నికల సమయంలోనే ఇవి గుర్తుకు వస్తాయి. వారి హయాంలోనూ ఆత్మహత్యలు జరిగాయనే విషయం మరచిపోవడం విడ్డూరం. రైతు 'అప్పులలో పుట్టి అప్పులతోనే చనిపోతున్నాడు. ప్రపంచంలో దొరికే అన్ని రకాల పంటలు భారతదేశంలో పండుతాయి.

శక్తినంతా ధారపోసి పంటలు పండించే మానవ సంపద ఉన్న దేశం మనది. ప్రభుత్వాల మూలంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. నేడు దేశంలో ప్రతి అరగంటకు ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రోజూ సుమారు రెండు వేల మంది వ్యవసాయ రంగాన్ని వదిలి వేరే రంగాలకు వలస పోతున్నారు. ఈ సంక్షోభం భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరం. దేశంలో నేటీకి 63 శాతం అంటే సుమారు 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయ విధానం సరిగా లేకపోవడం వారికి శాపమైంది. దేశంలో 1995 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పాలనలో 2,96,466 మంది రైతులు, బీజేపీ పాలనలో 2014 నుంచి 2021 వరకు 89,184 మంది, తెలంగాణలో 1995 నుంచి 2013 వరకు 25,987 మంది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక 2014 నుంచి 2021 వరకు 6,473 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి దేశంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? కేంద్రం వీటన్నింటినీ రాష్ట్రాల ఖాతాలోకి నెట్టి తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నది.

పంట మద్దతు ధర పెంచితే

రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట మద్దతు ధర లేకపోవడం. ఎకరం వరి సాగు ఖర్చు రూ.35,600. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.1,940 రూపాయలు. మొక్కజొన్నకు రూ.1,872, పత్తికి రూ.7,400 మాత్రమే. కేంద్రం ఇచ్చే ఎరువులు, ఫెర్టిలైజర్స్, డీజీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు ఆవిరయ్యాయి.

తెలంగాణలో 24 గంటల కరెంటు, పంట బీమా, రైతుబంధు వంటివి ప్రవేశపెట్టడంతో రైతులు ఎక్కువ పంట పండించారు. కేంద్రం ఆంక్షలు పెట్టడంతో పంటను అమ్ముకోలేక కల్లాలలోనే ప్రాణాలు వదిలారు. వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చెయ్యాలి. బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఎరువులు,ఫెర్టిలైజర్స్ వంటి వాటికి సబ్సిడీలు పెంచాలి. స్వామినాథన్ కమిటీ సూచించినట్టు పంట ఖర్చు మీద 50 శాతం అదనంగా మద్దతు ధర ఇవ్వాలి. పంట బీమా అమలు చేయాలి. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. చర్చలలో వ్యవసాయానికి ఎక్కువ రోజులు కేటాయించాలి. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి. అప్పుడే వ్యవసాయ రంగం మనుగడ కొనసాగుతుంది. లేకుంటే రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి.

పులి రాజు

సామాజిక కార్యకర్త

99083 83567

Advertisement

Next Story

Most Viewed