ఖరిదైన వైద్యం వలన ఏటా ఎంతమంది పేదలుగా మారుతున్నారో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-07 18:30:51.0  )
ఖరిదైన వైద్యం వలన ఏటా ఎంతమంది పేదలుగా మారుతున్నారో తెలుసా?
X

దేశంలో వైద్య రంగానికి మౌలిక వసతులు కల్పించాలి. ఆధునిక యంత్ర పరికరాలు సమకూర్చాలి. పెట్టుబడులు పెంచాలి. నిపుణులను, సిబ్బందిని, సహాయకులను అవసరమైన మేరకు నియమించాలి. జీడీపీలో మూడు శాతం ప్రజారోగ్యానికి ఖర్చు చేసినప్పుడు ప్రజలపై భారం సగానికి తగ్గిపోతుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ, అవేవీ అమలు కావడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య కేటాయింపులు జీడీపీలో 1.8 శాతానికే పరిమితమవడం విచారకరం. దేశంలో మూడో వంతు జనాభాకు బీమా సౌకర్యాలు లేవు. యూకే, అమెరికా, స్వీడన్, జపాన్, జర్మనీ దేశాలు జీడీపీలో 10 శాతం, అంతకు మించి ప్రజారోగ్యానికి కేటాయిస్తున్నాయి. ఆయా దేశాల విధానాల నుంచి మనం స్ఫూర్తి పొందాలి.

రోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంతోనే ఆనందం. 'సంతోషానికి మించిన సంపద లేదు. సేవకు మించిన భాగ్యం లేదు' ఇది నినాదంగానే ఉండకూడదు. ప్రభుత్వాల విధానం కావాలి. మన పాలకులు సాధించలేరా! లోపం ఎక్కడుంది? ప్రజలకు విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలని నిర్దేశించుకున్నాం. అంతర్జాతీయంగా వైద్య రంగం ముందడుగు వేస్తున్నది. అనేక దేశాలు ప్రజల ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో మాత్రం వైద్యం ప్రజలకు పెను భారంగా మారింది.

2004 నుంచి 2009 వరకు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ,ప్రైవేటు పద్దుల కింద నమోదైన వ్యయం జీడీపీలో 4.2 నుంచి 3.2 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర నివేదిక తెలిపింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం తో పోలిస్తే ప్రజానీకం సొంతంగా భరిస్తున్న వ్యయం మరీ అధికంగా ఉంటోంది. దవాఖానాల భరించలేని బిల్లుల కారణంగా మన దేశంలో యేటా ఆరు కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రజల ఆర్థిక స్తోమత తో సంబంధం లేకుండా దేశ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని అనేక కమిటీలు సూచించాయి. చికిత్స వ్యయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వైద్యం రాష్ట్రాల పరిధిలోని అంశం అంటూ కేంద్ర ప్రభుత్వం అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంటోంది.

అమలు కాని సూచనలు

'దేశంలో వైద్య రంగానికి మౌలిక వసతులు కల్పించాలి. ఆధునిక యంత్ర పరికరాలు సమకూర్చాలి. పెట్టుబడులు పెంచాలి. నిపుణులను, సిబ్బందిని, సహాయకులను అవసరమైన మేరకు నియమించాలి. జీడీపీలో మూడు శాతం ప్రజారోగ్యానికి ఖర్చు చేసినపుడు ప్రజలపై భారం సగానికి తగ్గిపోతుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ, అవేవీ అమలు కావడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య కేటాయింపులు జీడీపీలో 1.8 శాతానికే పరిమితమవడం విచారకరం. దేశంలో మూడో వంతు జనాభాకు బీమా సౌకర్యాలు లేవు. యూకే, అమెరికా, స్వీడన్, జపాన్, జర్మనీ దేశాలు జీడీపీలో 10 శాతం, అంతకు మించి ప్రజారోగ్యానికి కేటాయిస్తున్నాయి.

ఆయా దేశాల విధానాల నుంచి మనం స్ఫూర్తి పొందాలి. మహా నగరాలు, నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు అధునాతన ప్రభుత్వ (కార్పొరేట్) వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న పాలకుల విధానాలు అభినందనీయమే. కానీ, ఇది వైద్య సౌకర్యాల కేంద్రీకృతానికి దారితీస్తుంది. గ్రామీణ వైద్య అభివృద్ధిలో భాగంగా మండల స్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, తాలూకా స్థాయి వైద్యశాలలను బలోపేతం చేయగలిగితే గ్రామీణ ప్రజలకు మంచి వైద్యాన్ని అందించినవారవుతారు.

అవినీతిని రూపుమాపాలి

మన రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు అవినీతికి, అక్రమాలకు అడ్డగా మారాయని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రైవేట్ దవాఖానాలకు అనుమతులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది నియామకాలు, బదిలీలు, ఒప్పంద వైద్యులకు వేతనాలు చెల్లింపులు ఇలా ఏ పని జరగాలన్నా డీఎం‌హెచ్ఓ కార్యాలయానికి అవినీతి ముడుపులు అందాల్సిందేననే ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులు అందితే ప్రైవేట్ దవాఖానాలకు తనిఖీలు జరపకుండానే అనుమతిలిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.

అగ్ని ప్రమాదాలు జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా నడిపినా, నకిలీ వైద్యులు ఉన్నా, పారిశుద్ధ్యం పాటించకపోయినా కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఐదు రోజులలో 18 జిల్లాల 311 దవాఖానాలను అధికారులు తనిఖీ చేశారు. అందులో 21 ఆస్పత్రులను మూసేశారు. కొన్నింటికి జరిమానాలు వేశారు. ఇంకా 15 జిల్లాలలో తనిఖీలు చేయాల్సి ఉంది.

అటకెక్కిన ఈహెచ్ఎస్

ఉద్యోగులు, పాత్రికేయులు, పింఛనుదారుల ఆరోగ్య పథకం (ఈ హెచ్ ఎస్) నిలిచిపోయింది. ఉద్యోగులు, అధికారులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వ పాలన సజావుగా సాగుతుంది. సంఘాలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఉద్యోగులను, పింఛనుదారులను, పాత్రికేయులను నెట్‌వర్క్ దవాఖానాలు గడప కూడా తొక్కనివ్వడం లేదు. మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరికి నెలల సమయం పడుతోంది. నిధుల ప్రీజింగ్‌తో మంజూరైన బిల్లులు కూడా నగదుగా మారడం లేదు.

ఇప్పటికే సుమారు రూ.300 కోట్లకు పైగా బాకాయలు రావాల్సి ఉందని దవాఖానాల యాజమాన్యాలు చెబుతున్నాయి. కొందరు నిధులను దుర్వినియోగం చేసినందున బిల్లులు నిలిపేశామని ప్రభుత్వం చెబుతున్నది. ఉద్యోగి, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ కింద జమ చేసి ఆధునాతన వైద్యం అందించవచ్చు. సఖ్యత కుదరక ఇది అమలులోకి రావడం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వెంటనే దీనిని అమలు చేయాలి. ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి. ప్రజారోగ్యానికి నిధులు, మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవాలి. కార్పొరేట్ వైద్యశాలల దోపిడిని అరికట్టాలి. చికిత్స వ్యయాన్ని కనిష్ట స్థాయికి తేవాలి.


మేకిరి దామోదర్

సోషల్ ఎనలిస్ట్, వరంగల్

95736 66650

Advertisement

Next Story

Most Viewed