- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ ఛైర్మన్‌పై ఆ విమర్శలు అర్థరహితం
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికులని, అన్యమతస్థులని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఇటీవల వివిధ మాధ్యమాలలో వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి జీవిత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విమర్శలన్నీ అవగాహనా రాహిత్యంతో రాజకీయ కోణంలో చేస్తున్న విమర్శలుగా తేటతెల్లం అవుతుంది. యుక్తవయస్సులో ముఖ్యంగా విద్యార్థి దశలో భూమన మంచి పోరాట పటిమ కనబరచేవారు. ఆ సమయంలో కరుణాకర్ రెడ్డి విద్యార్ధుల, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్ళడం గమనార్హం. సుమారు అయిదు దశాబ్దాల క్రితం యుక్త వయస్సులో చేస్తున్న ప్రజా పోరాటాల సమయంలో భూమనకు వై.యస్.రాజా రెడ్డితో పరిచయం ఏర్పడింది. రాజారెడ్డితో పరిచయం ఏర్పడిన కొద్ది కాలానికే వై.యస్ కుటుంబానికి కరుణాకర్ రెడ్డి ఆత్మీయుడిగా మారారు. పర్యవసానంగా దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డికి సన్నిహితునిగా మారిన కరుణాకర్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్స్ పార్టీలో ప్రారంభించారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి 2004 లో మొదటి పర్యాయం ముఖ్యమంత్రి అయిన వెంటనే భూమన కరుణాకర్ రెడ్డిని 2004 నుంచి 2006 వరకు తుడా ఛైర్మన్ గా నియమించడం గమనార్హం. తుడా ఛైర్మన్ హోదాలో కరుణాకర్ రెడ్డికి అప్పటి టీటీడీ ట్రస్ట్ బోర్డు లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా స్థానం కల్పించారు. దీని ప్రకారం కరుణాకర్ రెడ్డికి టీటీడీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ఆయన సంస్కరణలు…
తుడా ఛైర్మన్‌గా పదవీ కాలం పూర్తైన వెంటనే 2006 నుంచి 2008 వరకు అప్పటి ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి, టీటీడి ఛైర్మన్‌గా కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఆ సమయంలో కరుణాకర్ రెడ్డి చేసిన సంస్కరణలు, నిర్వహించిన కార్యక్రమాలు టీటీడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. టీటీడీ ద్వారా కళ్యాణమస్తు కార్యక్రమం ఏర్పాటు చేసి 30 వేల మందికి పైగా సామూహిక వివాహాలు జరిపించిన ఘనత కరుణాకర్ రెడ్డికి దక్కింది. దళిత గోవిందం కార్యక్రమం ద్వారా దళిత వాడలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు జరిపి భూమన సంచలనం సృష్టించారు. మెట్ల మార్గంలో నడచి వచ్చే భక్తులకు టోకెన్లు మంజూరు చేసి వారికి ఉచిత శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది కరుణాకర్ రెడ్డి హయాంలోనే. అదేవిధంగా తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు విడిచి తిరగాలనే నియమం పెట్టారు. పదకవితా పితామహులు అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు కరుణాకర్ రెడ్డి హయాంలో ఘనంగా నిర్వహింపబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు , ఇరవై నాలుగు గంటలు కోట్లాది మంది భక్తులు వీక్షించే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ని 2008లో అప్పటి దేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌చే ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మ వ్యాప్తికి, హిందూ ఆధ్యాత్మిక సంబంధమైన ప్రసారాల కోసం, తిరుమలకు స్వయంగా రాలేని భక్తులకోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన భక్తవత్సలుని దర్శన భాగ్యం ప్రత్యామ్నాయ మార్గాలలో కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆలోచనల నుంచి ఈ భక్తి చానల్ ఉద్భవించింది. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొదటి పర్యాయమే ఇటువంటి భక్తుల మనసు దోచిన అనేక సంస్కరణలు చేసిన,ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డిపై నాస్తికులు, అన్యమతస్థులు అని వివిధ రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు ఎంతవరకు సబబు? ఆ విమర్శలు అన్నీ అర్ధరహితం అని ఈ పరిణామాలన్నీ తేటతెల్లం చేస్తున్నాయి.
వారి సంప్రదాయం ప్రకారం వివాహం
నాటి వై.యస్. రాజారెడ్డి నుంచి నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు ఉన్న మొత్తం వై.యస్ కుటుంబానికి, భూమనకు గత అయిదు దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాల క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె నీహారెడ్డికి, వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోదరులైన వై.యస్.రవీంద్రారెడ్డి కుమారులు వై.యస్. సుమధర్ రెడ్డికి 2011లో వివాహం జరిగింది. వై.యస్.రవీంద్రారెడ్డి కుటుంబం క్రిస్టియన్ మత విశ్వాసాలకు అనుగుణంగా నడచుకుంటున్నందున ఆ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహాన్ని ప్రామాణికంగా తీసుకుని కరుణాకర్ రెడ్డి అన్యమతస్థులనే విధంగా వివిధ రాజకీయపార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత కరుణాకర్ రెడ్డి కుమారుడైన భూమన అభినయ్ రెడ్డి వివాహం 2015లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ కు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు అధినేత రామోజీరావు, జస్టిస్ యన్.వి.రమణ, చిరంజీవి, దాసరి నారాయణరావు, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి అతిరధ మహారధులతో పాటూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కరుణాకర్ రెడ్డి అన్యమతస్థులని విమర్శలు చేసే వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఈ వివాహాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. సామాజిక స్పృహతో, మానవతా దృక్పథంతో చూడవలసిన భూమన కుమార్తె వివాహ పరిణామంపై విమర్శలు రావడం దురదృష్టకరం. కరుణాకర్ రెడ్డి ఇప్పటి వరకు భగవంతుణ్ణి ద్వేషించిన సందర్భాలు లేవు, అదేవిధంగా క్రిస్టియన్ మతం స్వీకరించిన ఆనవాళ్లు లేవు. కనుక కరుణాకర్ రెడ్డి నాస్తికులు, అన్యమతస్థులు అని ఇదేవిధంగా నిరాధారమైన, అవాస్తవ విమర్శలు చేసేవారు ప్రజాక్షేత్రంలో విశ్వసనీయత కోల్పోతారనే విషయం గుర్తించుకోవాలి.
కైలసాని శివప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్
94402 03999