- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదకద్రవ్యాల మత్తులో యువత
మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతోంది. విద్యార్థుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తు పదార్థాలు సరదా కోసం అలవాటు చేసుకొని వాటికి బానిసలై అతిచిన్న వయసులోనే వృద్ధులుగా కనిపించేవారు కొందరుంటే, ఇంకొంత మంది జీవచ్ఛవాల్లా కాలం గడుపుతున్నారు.
ముప్పై సంవత్సరాల క్రితం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లడం అరుదుగా ఉండేది. కానీ నేడు మత్తుపదార్థాలు సేవించే వారిలో ఎక్కువగా 15-50 సంవత్సరాల్లోపు వారు ఉండటం విచారకరం. డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలను కోల్పోతుంటారు, సన్నిహితులకు దూరంగా గడుపుతారు, కోపంగా ఉంటూ తరచూ ఉద్రేకానికి గురవుతూ వారిలో వారే మాట్లాడుకుంటారని అభిప్రాయం. డ్రగ్స్‌లో వివిధ రకాలు ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చేవి, నోటితో తీసుకునేవి, ఇంజెక్షన్‌ల రూపంలో తీసుకునేవి, పొగపీల్చేవి.
అప్పుడే ఎక్కువ అలవాటవుతూ..
మొదట్లో కొందరు మాత్రమే ఈ మత్తుకు అలవాటుపడి వ్యసనంగా మార్చుకొని అక్కడితో ఆగకుండా పక్కవారిని ఈ మత్తు పదార్థాలు అలవాటు పడేలా చేసి క్రమంగా వారిని బానిసలుగా చేస్తారు. ఇలా బానిసలైన వారే ఎక్కువగా డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటారు. గంజాయికి అలవాటుపడిన యువకులు మిగతావారితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే యువకులు దీనివైపు మొగ్గు చూపుతారు. అలాంటివారి ప్రవర్తన ఇంట్లోనూ వేరే విధంగా ఉంటుంది. ఒంటరిగా ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడం లాంటివి.
గంజాయి తాగేవారి కళ్లు మిగతా వారికి భిన్నంగా, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు.. ఎందుకని అడిగితే అదే ఫ్యాషన్ అంటూ సాకులు చెబుతుంటారు. గతంతో పోలిస్తే పాకెట్ మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంటారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొదట కళాశాల, తర్వాత ఇంట్లో యువత ఎక్కువ గడిపేది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్‌లు చేస్తుండటంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. అందువల్ల పిల్లలపై పర్యవేక్షణ కరువవుతుండటంతో వారు చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మత్తు కన్నా కిక్ ఇచ్చేవి..
గంజాయి పీల్చి డ్రైవింగ్ చేస్తే, వారికే కాక ఇతరులకూ ప్రమాదం. వారి మానసిక స్థితి క్రమేణా అధ్వానం అవుతుంది. వారు మనుషులు లేని చోట మనుషులను ఊహించుకుంటూ ‘హెలూసినేషన్స్’ అనే విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది తరచూ వస్తూ ఉంటే, వారు క్రమేణా విపరీతంగా భీతిల్లుతూ, ఇతర వ్యక్తులు తమకు హాని తలపెట్టే ఉద్దేశంలో ఉన్నారని భావిస్తుంటారు. గంజాయి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు (లంగ్ క్యాన్సర్)కు హేతువు. పైగా ఎక్కువ కాలం గంజాయి వ్యసనం ఉంటే పురుషులలో శుక్రకణాలు తగ్గే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ గంజాయి పీల్చే అలవాటు ఉన్న స్త్రీలు గర్భవతులయితే, వారి శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. మాదక ద్రవ్యాలలో వచ్చే కిక్ కోసం ఇవి తీసుకుంటున్నామని వాదిస్తుంటారు కొందరు, కానీ వాటికంటే కిక్ నిచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒక విషయంపై శ్రద్ధ పెట్టి చేసే ‘ధ్యానం’ ఇచ్చే కిక్ ఎన్ని మాదక ద్రవ్యాలు తీసుకున్నా రాదు. అలాగే సాటి మనిషికి ఉపకారం చేసినప్పుడు, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వచ్చే కిక్ ఎంతో బాగుంటుంది. చక్కగా చదివి ఒక మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. ఇటువంటి విషయాలను ప్రతీ విద్యార్థికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి చెప్పగలగాలి.
- డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
స్పెషల్ ఎడ్యుకేటర్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్
97039 35321
- Tags
- drugs
- drugs cases