ఎస్సీ , ఎస్టీలపై కపట ప్రేమ...!

by Ravi |   ( Updated:2023-08-31 00:00:31.0  )
ఎస్సీ , ఎస్టీలపై కపట ప్రేమ...!
X

అధికారంలో ఉన్న సమయంలో ఏది తేల్చకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, సమస్యను జఠిలం చేసి అధికారం లేనప్పుడు అడ్డగోలు హామీలు ఇవ్వడం, తెలంగాణ కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అనేది మర్చిపోయి రాష్ట్రానికో మేనిఫెస్టో పెట్టి గందరగోళం సృష్టిస్తున్నది. దశాబ్దకాలంగా అధికారానికి దూరమై అనుసరిస్తున్న వ్యూహం కూడా ఇదే.

అప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడా?

సమాజ పురోగతిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిజమైన భాగస్వామ్యం దక్కడానికి, వివక్ష పోవడానికి ఆ వర్గాలకు చదువుల్లో, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఒక్కటే మార్గమని మన రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించి రిజర్వేషన్లు ప్రవేశపెడితే.. స్వాతంత్య్రం వచ్చిన 76 సంవత్సరాలలో కూడా వివక్ష అంతరించలేదు. దీనికి సింహభాగం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కారణం కాదా? పైగా దీనికి కారణం మీరంటే.. మీరని పార్లమెంట్ సాక్షిగా నిందించుకుంటున్నారు. 76 సంవత్సరాల్లో కానిది రేవంత్ నాయకత్వంలో వర్గీకరణ, రిజర్వేషన్ల పంపకం, సామాజిక న్యాయం జరుగుతుందనుకుంటే పొరపాటే. ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా కాంగ్రెస్ చేతిలో నలిగిపోయింది.

భారతదేశం అనేక సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నది. దాంతో పాటు ఇక్కడ కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నది. హిందూ సమాజంలోని సామాజిక అసమానతలు, వివక్షలూ, అంటరాని కులాలను అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురిచేశాయని, దీంతో రాజకీయంగా కూడా ఆ కులాల వారు అధికారం అంచుల్లోకైనా రాలేకపోతున్నారని అంబేద్కర్ వాదించింది అక్షరాల నిజం అయ్యింది. దళిత, గిరిజన వర్గాల ప్రయోజనాలకు భంగం కలగనీయరాదన్న సంకల్పం ఉంటే భిన్న సందర్భాల్లో వచ్చిన తీర్పులకు పాలకపక్షాలు విలువ ఇచ్చేవి. శ్రద్దగా అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించేవి. కానీ అందుకు విరుద్ధంగా అవి మౌనంగా ఉండిపోయాయి. తాజాగా పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదని, ఆ విషయంలో వారికీ అన్యాయం జరగడం లేదనే సమాచారాన్ని చూపాలని సుప్రీంకోర్టు కోరింది. ఆ పరిస్థితి ఆ కులాల వారికి ఎందుకు? అందుకే పదోన్నతులను కొత్త ప్రాథమిక హక్కుగా మార్చడమో, లేక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విధంగా పకడ్బందీ సమాచారం ఆధారంగా ఆ పదోన్నతులు కల్పించే విధానానికి రూపకల్పన చేయడమో జరగాలి. అంతేతప్ప రాజకీయ ప్రయోజనాలనాశించి పరస్పరారోపణలు చేసుకోవడం కాలహరణమే అవుతుంది.

కోల్పోయిన ఓటు బ్యాంకు కోసం..

అధికారంలో ఉన్నప్పుడు అగుపడని వర్గీకరణ, రిజర్వేషన్ల అంశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు దోబూచులాడుతుందో అర్థం చేసుకోనంత ఎర్రిబాగులోళ్ళు తెలంగాణ దళిత, గిరిజన బిడ్డలు కాదనేది గుర్తెరిగితే మంచిదేమో. రెండు సార్లు ప్రధానిగా, రెండుసార్లు రాష్ట్రపతిగా దళిత అభ్యర్థిని ఎన్నిక చేసే అవకాశం ఉన్నా ఇవ్వని సోనియా, వర్గీకరణపై పార్లమెంట్‌లో మాట్లాడని రేవంత్ దళితుల వర్గీకరణపై మాట్లాడడం విడ్డురంగా ఉంది. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలతో ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారు ఎస్సీ, ఎస్టీలనే విషయం జగద్విదితం.

ఇక కాంగ్రెస్ పార్టీ దళితుల్లోనూ, గిరిజనుల్లోనూ కోల్పోయిన మద్దతును తిరిగి సంపాదించేందుకై అంబేద్కర్‌ను తన వాడిగా చెప్పుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నది. దళిత, గిరిజన వర్గాలు దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ వారి ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసిన నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టిన అనంతరం ఒకదాని తరువాత మరో రాష్ట్రంలో ఓటు బ్యాంకు బలహీన పడసాగింది. ఇప్పుడు తాను కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించేందుకై పేదల పక్షపాతినన్న ముసుగును ధరించవల్సిన ఆవశ్యకతను గ్రహించి, అణగారిన వర్గాలను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ వ్యూహం పన్నింది. రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చి, అంబేద్కర్ ప్రాధాన్యతను పునరుద్ధరించేందుకు పాటుపడుతున్నట్టు నటిస్తున్నది. బొంబాయి ప్రావిన్స్‌లో 1916లో దళితుల మద్దతు కోసం కాంగ్రెస్ నాలుగు సభలు నిర్వహించింది. ఆ సభలు భారత ప్రజల్ని సుదీర్ఘ కాలం చీల్చి ఉంచడానికి రిజర్వేషన్లు పాలకవర్గాలకు మంచి పావులా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఎస్సీలకు 18 శాతం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అంశం తెరమీదకు తెచ్చింది. దళిత ఉద్యమ సైద్ధాంతిక బలహీనతలు, నాయకత్వ దివాళాకోరుతనం, పెచ్చరిల్లిన స్వార్థంతో అంబేద్కర్ మీద హఠాత్తుగా వచ్చి పడిన ప్రేమకు వేదికైంది. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ పైన ఎప్పుడూ మాట్లాడని రేవంత్ రెడ్డి ఏ,బి,సి,డీ లుగా దళితుల వర్గీకరణ చేస్తామని చేవెళ్ల, ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్‌కు మద్దతు తెలుపాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదో నిలదీయాల్సిన అవసరం ఉంది.

డా. సంగని మల్లేశ్వర్

విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ

98662 55355

Advertisement

Next Story

Most Viewed