లడ్డూలాంటి ఛాన్స్... హస్తం చేజారవద్దు

by Ravi |
లడ్డూలాంటి ఛాన్స్... హస్తం చేజారవద్దు
X

కాంగ్రెస్‌ పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ప్రజల్లో ఎన్నికల మూడ్ లోకి తీసుకొచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే శ్రమిస్తున్నా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ని నింపాయి. హైదరాబాద్‌లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సభలు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. పార్టీలో చేరికలు పెరిగాయి. తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి దశాబ్దం పాటు అధికారం కాదు కదా సరైన స్థాయిలో సీట్లను కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్. దీనికి గల కారణాలు, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయాన్ని తీసుకోనుంది. అలాగే ప్రస్తుత పాలకుల వైఖరిని ఎండగట్టి.. ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఛాన్స్ ఇవ్వండి. చేసి చూపిస్తాం

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని చారిత్రకమైన రామప్ప నుంచి పూరించారు. రాహుల్, ప్రియాంక ములుగు జిల్లాలో తొలి ఎన్నికల శంఖారావ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలను గుప్పించింది. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని.. తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా తీసుకుంటామని ప్రకటించారు. తుక్కుగూడ సభా వేదికగా ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి ములుగు విజయభేరి సభ వరకు అన్ని చోట్లా ఇదే తరహాలో ముందుకు సాగుతోంది హస్తం పార్టీ. మొత్తంగా ఛాన్స్ ఇవ్వండి. చేసి చూపిస్తాం అన్న నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో పాగా వేసేందుకు పకడ్బందీగానే ముందుకు సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాతోనే ఈ హామీలను ప్రకటింపజేసిన హస్తం పార్టీ.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆమెతోనే చెప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం ద్వారా.. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలుపుకుంటుందనే సందేశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ములుగులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలోనూ ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఓవైపు కేసీఆర్ ప్రభుత్వం చేయని పనులను వేలెత్తి చూపుతూనే.. రాష్ట్రంలో స్థానికంగా ఉన్న సమస్యలపై ఫోకస్ చేయడం ద్వారా ప్రజల్ని తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు వారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ.. పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ బలహీనంగా ఉందని చర్చ జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరు గ్యారంటీల హామీ జనం లోకి వెళ్ళిందని నమ్ముతున్న టి కాంగ్రెస్‌… అగ్ర నేతల టూర్‌తో బూస్ట్‌ ఇవ్వాలనుకుంటోంది.

కాంగ్రెస్ గ్రాఫ్ బాగానే పెరిగిందా!

గతంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ బాగానే పెరిగిందంటున్నారు పరిశీలకులు. . కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడంలో ఈ పార్టీ తన సత్తా చాటుతోంది. పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈసారి అధికారాన్ని దక్కించుకునేందుకు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు దగ్గరవ్వడమే లక్ష్యంగా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క‌తోపాటు ముఖ్యమైన నేతలు ఇప్పటికే పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ఓటర్లకు చేరువవ్వడంతోపాటు పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు ఒక్కొక్క వర్గానికి చేరువయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల ముందుకు వెళ్లాలని నాయకత్వం భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాటం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

'హస్త’వ్యస్తంగా ఉన్న పార్టీ కుదుట పడుతోంది. పార్టీ వీడిన వారు పెద్దగా ప్రభావం చూపలేరు ఎందుకంటే సహేతుక కారణం చూపలేదు కాబట్టి. పార్టీని గెలిపించడం కోసం కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంటుంది. కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇచ్చినా ఆధికారంలోకి వచ్చిన తర్వాత మిగతావారిని వివిధ పదవుల్లో సర్దుబాటు చేయవచ్చు. కొంతమందికి పార్లమెంట్ స్దానాలలో అవకాశం కల్పిస్తాం అన్నది అధిష్టానం మాట. కర్నాటక తరహాలో గెలుపు కోసం సీనియర్లు తమవంతు సహకారం అందించాల్సిన తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పర్దలు వీడి వాస్తవ పరిస్థితిని అధిష్టానానికి వివరించాలి. అంతర్గత కలహాలకు స్వస్తిచెప్పి ఉమ్మడి కార్యాచరణను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చెయ్యాలి. ముఖ్యమంత్రి ఆభ్యర్దిపై ఇప్పడే వివాదాస్పద వాఖ్యలు ప్రకటనలు చేయకుండా సంయమనంతో వ్యవహరించాలి. కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కించడం తప్పుకాదు కాని పార్టీలో స్థిరంగా వున్న నాయకులకు గెలుపును సాధించే అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. వీలైనంత త్వరగా అసమ్మతిని చల్లార్చి, సమైక్యంగా ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాలను, విమర్శలను తిప్పికొట్టాలి. అనుభవం ఉన్న నాయకులతో బలంగా వున్న పార్టీ సమిష్టిగా శ్రమిస్తే ఫలితాలు రావచ్చు.

శ్రీధర్ వాడవల్లి

రాజకీయ విశ్లేషకులు

99898 55445

Advertisement

Next Story

Most Viewed