కాంగ్రెస్.. బీఆర్ఎస్.. దొందు దొందే!

by Ravi |   ( Updated:2023-10-31 01:00:30.0  )
కాంగ్రెస్.. బీఆర్ఎస్.. దొందు దొందే!
X

బీసీలు, మైనార్టీలకు టికెట్ల కేటాయింపుపై బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్... తాను కూడా అగ్రవర్ణ ఆధిపత్య పార్టీయే అని నిరూపించుకున్నది. సామాజిక న్యాయం చేయడంలో విఫలమైంది. అంతేకాకుండా పార్టీ అధికారంలో లేకున్నా.. దశాబ్దాలుగా పార్టీని మోసిన వారికీ అన్యాయం చేసినట్లు కనిపిస్తున్నది. అధికారాన్ని సాధించుకోవడానికి మౌలిక సూత్రాలకు, నీతి నియమాలను పక్కన పెట్టవచ్చని ప్రూవ్ చేసింది. తమది రాజకీయ పార్టీ అని, సిద్ధాంతాలు చెప్పడానికి మాత్రమే కానీ.. పాటించడానికి కాదని చెప్పకనే చెప్పింది.

బీసీలకు 20 టిక్కెట్లే!

ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టుల్లో వందమంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో బీసీలకు కేటాయించింది 20 సీట్లు మాత్రమే. పార్లమెంట్ సెగ్మెంట్‌కు కనీసం రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించాలని పార్టీలోని బీసీ లీడర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనికి హై కమాండ్ సైతం ఓకే చెప్పింది. కానీ తీరా సమయం వచ్చినప్పుడు సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసినట్లు కనిపిస్తున్నది. ఇంకా 19 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఇందులో జనరల్ స్థానాలు 11 మాత్రమే. పొత్తుల్లో వామపక్షాలకు సీట్లు ఇవ్వకుండా, మొత్తం 11 జనరల్ స్థానాలను బీసీలకు కేటాయించినా.. 34 నంబర్‌కు కాంగ్రెస్ చేరుకునే చాన్స్ లేదు. అన్నీ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో 25 స్థానాల వరకు మాత్రమే కాంగ్రెస్ బీసీలకు కేటాయించే పరిస్థితి కనిపిస్తున్నది. అంతకుముందే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ బీసీలకు కేటాయించింది 22 స్థానాలు మాత్రమే.

మహిళలకు, మైనార్టీలకు సైతం..

మైనార్టీ పక్షపాతిగా గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్.. రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం వారిని 'అంటరాని'వారిగా చూస్తున్నట్టు అర్థమవుతున్నది. వంద సీట్లలో అభ్యర్థులను ప్రకటించగా అందులో కేవలం నలుగురు మైనార్టీలకు మాత్రమే అవకాశం కల్పించింది. ఇంకా 11 జనరల్ సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఒకరిద్దరి కంటే ఎక్కువ మందికి చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఐదుగురి కంటే ఎక్కువ మైనార్టీలకు అవకాశమిచ్చేలా కనిపించడం లేదు. అదే సమయంలో బీఆర్ఎస్ ముస్లింలకు కేటాయించిన సీట్ల సంఖ్య కేవలం మూడు మాత్రమే. అంతేకాకుండా మహిళలకు సైతం రెండు పార్టీలు ఇచ్చిన ప్రాధాన్యత అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీ వంద మందిలో 11 మంది మహిళలకు అవకాశం కల్పించగా, బీఆర్ఎస్ ఎనిమిది మందికి మాత్రమే టికెట్లు కేటాయించింది.

డబ్బులున్న వారికే ప్రాధాన్యం!

మునుగోడు, హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేశాయి. ఆ ఉప ఎన్నికలు దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా పేరుగాంచాయి. దీంతో ఆ పార్టీలను ఢీకొనాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులకే బరిలో దింపాలని కాంగ్రెస్ భావించినట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకే కాంగ్రెస్‌ను నాశనం చేసేలా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకొని టికెట్ కేటాయించినట్లు కనిపిస్తున్నది. అంతేకాకుండా ఐడియాలజీతో సంబంధం లేకుండా అనేక మంది ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకూ పోటీ చేసే అవకాశం కల్పించింది.

పార్టీల వారీగా కుల సంఘాలు

ఇప్పటికే బీసీ, మైనార్టీల సంఘాలు పార్టీల వారీగా విడిపోతున్నాయి. బీసీ కుల సంఘాలు పార్టీల వారీగా సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని సంఘాలైతే రెండుగా చీలిపోయి ఒక్కో పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. తమ సామాజిక వర్గానికి ఒక్క సీటూ కేటాయించలేదని ఇప్పటికే ముదిరాజులు బీఆర్ఎస్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు మైనార్టీ సంఘాలు సైతం ఇప్పటికీ ఎటువైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నాయి. గతంలో కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన జమాతె ఇస్లామి హింద్.. ఈ సారి తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ముస్లింల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. జమియతుల్ ఉలెమా సైతం ఇంకా నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. అయితే ఎన్నికలకు 15-20 రోజుల ముందు ఈ సంఘాలు తమ నిర్ణయాలను ప్రకటిస్తే... ఆ ప్రభావం ఆయా పార్టీలపై పడే అవకాశముంది.

- ఫిరోజ్ ఖాన్

సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Advertisement

Next Story

Most Viewed