కేసీఆర్ చేసిన గాయాలకు... రేవంత్ ఆయింట్‌మెంటు?

by Ravi |   ( Updated:2024-11-20 01:15:17.0  )
కేసీఆర్ చేసిన గాయాలకు... రేవంత్ ఆయింట్‌మెంటు?
X

తెలంగాణ అంటే రక్త చరిత్ర. తెలంగాణ ఒంటి నిండా గాయాలే. గాయం లేని చోటెక్కడ? తెలంగాణ శరీరం పచ్చి పుండు. నాలుగు దశాబ్దాలుగా భూస్వాముల కారణంగా ఈ నేలపై లేత నెత్తురు ఒలికింది. అది కృష్ణా, గోదావరి మీదుగా ఇంద్రావతి, ప్రాణహిత వైపు ప్రవహిస్తోంది. ప్రతి సందర్భమూ ఒక గాయమే. ప్రతి సంఘటనా ఒక గాయమే. తెలంగాణకు దెబ్బ తినడమూ తెలుసు. కోలుకొని మళ్లీ మర్లబడడమూ తెలుసు. అన్నింటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే 'జిందా తిలిస్మాత్' అనుకున్నాం. కేసీఆర్‌ను బాపూ అన్నాం. తెలంగాణకు మీరే దిక్కు అన్నాం. కానీ అది మన భ్రమ అని తేలడానికి పదేండ్లు పట్టింది.

గాయపడ్డ తెలంగాణ 2014 నుంచి కోలుకోగలదని అనుకున్నాం. పొట్ట కొట్టడానికి వచ్చిన వాళ్లను తరిమేస్తానని కేసీఆర్ 2001లో సింహగర్జన చేస్తే నిజమేనని అనుకున్నాం. కేసీఆర్ 2014లో 'కుబుసం' విడుస్తారని ఎవరనుకున్నారు? ఆయన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల 'మనిషి' అని ఎట్లా అనుమానిస్తాం? జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. తెలంగాణ సాకారానికి కారకులైన వారిని పగబట్టి కాటేస్తారని ఎట్లా ఊహించగలం? గతం ఎప్పుడూ మరమ్మతు కాదు. భవిష్యత్తును ఆయినా సరిగ్గా నిర్మించుకోవాలి.

అవమానితులను అక్కున చేర్చుకుని..

తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేండ్ల తర్వాత ప్రజలు ఆదరించారు. కేసీఆర్ చేసిన, కేసీఆర్ కారణంగా అయిన గాయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందు రాసే పనిలో ఉన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా అవమానాలు గురైన ఉద్యమ కారులను, రాజకీయ వ్యక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కున చేర్చుకొని కేసీఆర్ చేసిన ఆనాటి గాయాలకు ఔషధపు లేపనాలు రాస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఉద్యమ శ్రేణులుగా ముందు వరుసలో ఉన్నవారికి ఆకర్షణీయంగా, అభినందనీయంగా మారుతున్నాయి. తాజాగా గద్దర్ కూతురు వెన్నెలను రాష్ట్ర సంస్కృతిక సారధిగా నియమించడం పట్ల గద్దర్‌పై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని ముఖ్యమంత్రి చాటుకున్నారని చెప్పుకోవచ్చు.

గద్దర్, కోదండరాంలకు ఘోరావమానం!

ఆరు దశాబ్దాల ఉద్యమ నేతగా పీడిత తాడిత ప్రజల గొంతుగా మారిన గద్దర్ చివరి దశలో రాజకీయ పార్టీలకు సైతం గొంతుగా మారారు. తెలంగాణ ఉద్య మంలో ఆయన పాట ముందు నడిచింది. ప్రతి పాట గద్దర్‌ని అనుసరించినదే.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. అలాంటి గద్దర్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తిరిగి మరోసారి ప్రశ్నించే గొంతుగా మారారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వలె క్రియాశీల పాత్ర పోషించిన కోదండరాం సైతం కేసీఆర్ ఎత్తుల ముందు చిత్తయిపోయారు. ఆయనను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. ఏ రాష్ట్రం కోసమైతే కోదండరాం తపించి పోయారో అదే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ విధానాలను ఎండగడుతూ పదేళ్లు కొట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోదండరాంకు సముచితమైన స్థానమే లభించింది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి పాలనలో కోదండరాం కీలకంగా మారతారని, రానున్న మంత్రివర్గ విస్తరణలో కోదండరాంకు విద్యాశాఖ పదవి లభిస్తుంది అన్న అభిప్రాయాలు కూడా బలంగా ప్రజల్లో వినిపిస్తూ ఉన్నాయి.

అందెశ్రీ గీతాన్ని తొక్కిపెట్టారు..

ఇకపోతే 'జయ జయహే తెలంగాణ' అనే గీతాన్ని తిరిగి రాష్ట్ర అధికార గేయంగా ప్రకటించిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. తన ఊపిరినంత ధారబోసి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెట్టిన కేసీఆర్ తనను అనేక విధాలుగా గాయపరిచారని అందెశ్రీ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం ఒక కేసీఆర్ మాత్రమే కనిపించాలన్న దుర్బుద్ధి వల్లనే టీఆర్ఎస్‌లో ఉన్న ఒక సెక్షన్ సాహిత్య రంగం, సాంస్కృతిక రంగాలలో వెలుగుతున్న వారిని, మేధావులుగా ప్రజల్లో నానుతున్న వారిని అణిచివేసే కుట్రలో భాగమే ఒక కోదండరాం, ఒక అందెశ్రీ.. ఒక గద్దర్. ఇలాంటి వారందరి పైనా కుట్ర జరిగిందన్న బలమైన అభిప్రాయం ఉంది. వీటిని గమనించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అలాంటివారిని చేరదీసి ఆరాధించి అందలమెక్కించడం రాజకీయంగా తన రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.

సీఎం వైపు కవులూ, సాహితీవేత్తలూ..

రేవంత్ 'రెడ్డి' రాజకీయ జిత్తులా.. రణ తంత్రపు ఎత్తులా? వర్గ ప్రేమా..? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయా శక్తుల నుండి అందిన సహకారానికి కృతజ్ఞత చూపుతున్నారా? ఇవన్నీ ప్రశ్నలే. అధికారం వచ్చిన తర్వాత సమీకరణాలన్ని మారిపోతుంటాయి. కష్టపడ్డ వారెవరు గుర్తు ఉండే అవకాశం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కష్టపడ్డ వారిని గుర్తించడంతో పాటు కేసీఆర్ వలన అవమానాలకు గురైన వారిని ఏరి కోరి మరీ గుర్తుపట్టి వారికి పదవులు ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేక ఆకర్షణీయంగా మారారు. ఇటీవల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పేరును ఓ కళాశాలకు పెట్టారు. ఐలమ్మ మనవరాలికి అక్కడే రాష్ట్ర మహిళా కమిషన్‌లో సభ్యురాలుగా నియమిస్తూ ప్రకటించి సీఎం సంచలనం లేపారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలకు ఓర్చిన వారిని అక్కున చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ అభిమానుల అండదండలు పొందుతున్నారు.

వెన్నెలకు రథసారథ్యం..

రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ పక్కనపెట్టి అవమానించడం, గాయపరచడం, కనుమరుగయ్యే విధంగా ప్రవర్తించడం లాంటి విధానాల వల్ల ఉద్యమకారులు చాలా సందర్భాలు తమ నిరసన గళాన్ని విప్పారు. అందులో ప్రధానంగా గద్దర్ వస్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చెప్పుకోవాల్సి వస్తే కేసీఆర్ కంటే 20 ఏళ్ల ముందే పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించింది. ఆ మేరకు సాంస్కృతిక బృందాన్ని ఏర్పాటు చేసి గద్దర్ పాల్గొన్న ప్రతి చోటా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పాటలు పాడారు, మాట్లాడారు. స్వయంగా బెల్లి లలిత ప్రాణాలర్పించారు. కేసీఆర్‌తో కలిసి ధూమ్ దామ్‌లలో గద్దర్ నడిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి గేటు ముందు గేట్ పడిగాపులు కాచారు. గద్దర్ కన్నుమూశాక టీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీళ్లు కాచారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలను ఓడించారు. అయితే ఎన్నికల రణ రంగంలో నెగ్గడం అసాధారణమని భావించిన కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి వెనుకంజ వేసింది. అందుకే గద్దర్ కూతురుగా గుర్తిస్తూ వెన్నెలకు సాంస్కృతిక రథసారధిగా అవకాశాన్ని కల్పిం చడం పట్ల కళలు సాంస్కృతిక రంగాలకు చెందినవారు రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అభిమానులుగా మారుతున్నారు.

కట్టా నరేంద్రచారి,

సీనియర్ జర్నలిస్టు

63030 73400

Advertisement

Next Story