అప్రమత్తతే అంటువ్యాధులకు విరుగుడు

by Ravi |   ( Updated:2024-07-07 00:31:15.0  )
అప్రమత్తతే అంటువ్యాధులకు విరుగుడు
X

వర్షాకాలంలో వచ్చే ప్రతి వ్యాధి అంటు వ్యాధే. ఈ వ్యాధులు ఎక్కువగా పిల్లలకు, వృద్ధులకు హాని చేస్తాయి. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటమే దీనికి కారణం. కాబట్టి వారే తొందరగా జబ్బుల బారిన పడతారు. వాటిని తట్టుకోలేక మరణాల పాలవుతారు. కావున ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. సురక్షితమైన మంచినీటినే తాగాలి. అవసరం అయితే కాచి చల్లార్చి వడబోసిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి.

కొన్ని వ్యాధులు ప్రత్యేకమైన కాలాల్లోనే వస్తాయి. అలాంటి వ్యాధులను సీజనల్ డిసీజెస్ అంటారు. ఇవి ప్రత్యేకంగా వర్షాకాలంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ వస్తాయి. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులలో ముఖ్యమైనవి జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు (స్వైన్ ఫ్లూ, కరోనా), తీసుకున్న ఆహారం జీర్ణం కాక పోవడం మొదలగునవి. ఇవే కాకుండా ఇన్ ఫ్లూయెంజా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలతో పాటు కలరా, కామెర్లు, మెదడువాపు, ప్లేగు, చికెన్ గున్యా లాంటివి కూడా ఈ సీజన్‌లో విజృంభిస్తాయి.

కలుషిత నీటితో కోటి వ్యాధులు

వేసవి ముగియగానే వర్షాకాల ప్రారంభంలో కురిసిన నీరు పలుచోట్ల నుంచి చెత్తా, చెదారంతో కలిసి ప్రవహిస్తూ వచ్చి పాత నీటిలో కలవడం జరుగుతుంది. దీంతో నీరు కలుషితం అవుతుంది. దీనినే తాగునీటి అవసరాలకు వాడటం వలన పలు రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకాలు లేని ప్రాంతాల్లో ఈ సమస్య అధికం. నీటి కలుషితం వలన మనకు కలరా, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి నీటితో పాటు అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వలన టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దీనిని ఈ సీజన్‌లో వచ్చే సాధారణ వైరల్ ఫీవర్ అంటారు. ఇక వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు చేరి మడుగులలో, గుంటలలో నిల్వ ఉండి మురుగు నీరుగా మారుతోంది. ఈ మురుగు నీరు దోమలకు, ఈగలకు నిలయాలుగా మారుతుంది. ఆ అపరిశుభ్ర వాతావరణంలో దోమలు, ఈగలు గుడ్లు పెట్టి తమ సంతతిని బాగా వృద్ధి చేస్తాయి. ఈ నీటిలో పుట్టిన దోమకాటు వలన అనేక రోగాలు వస్తాయి. సీజనల్ వ్యాధులను వ్యాపింపజేయడంలో దోమలు, ఈగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

దోమలంటే భయపడే కాలం

మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు దోమలు ప్రధాన కారణం. దోమల ద్వారా సుమారు పదమూడు రకాల వ్యాధులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజుకు కోటి దోమలు పుడుతున్నట్లు అంచనా. సంవత్సరానికి మనిషి సగటున వెయ్యి సార్లు దోమకాటుకు గురవుతుంటారని తెలుస్తుంది. మలేరియాతో దేహం అంతా వణికిపోతోంది, శరీరం, కండరాల బలహీనత కనబడుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది దీనితో బాధపడుతున్నారు. దోమల ద్వారా ఈ సీజన్ లో వచ్చే మరో ప్రధాన జ్వరం డెంగ్యూ. ఇది కీళ్ల నొప్పులను కలిగిస్తుంది. ప్లేట్‌లెట్స్‌ను తగ్గించి శారీరక అసక్తతకు కారణం అవుతుంది. ఇక ఎల్లో ఫీవర్ అనే దోమకాటు ద్వారా చికెన్ గున్యా వస్తుంది. ఇది కీళ్లల్లో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది.

వర్షాకాలమంటేనే అంటువ్యాధులు

వర్షాకాలంలో వచ్చే ప్రతి వ్యాధి అంటు వ్యాధే. ఈ వ్యాధులు ఎక్కువగా పిల్లలకు, వృద్ధులకు హాని చేస్తాయి. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటమే దీనికి కారణం. కాబట్టి వారే తొందరగా జబ్బుల బారిన పడతారు. వాటిని తట్టుకోలేక మరణాల పాలవుతారు. కావున ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. సురక్షితమైన మంచి నీటినే తాగాలి. అవసరం అయితే కాచి చల్లార్చి వడపోసిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి. పరిశుభ్రమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహార పదార్థాలపై దోమలు, ఈగలు వాలకుండా చూసుకోవాలి.

డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Advertisement

Next Story

Most Viewed