- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం అందించడంలోనూ పక్షపాతమా?
స్వాతంత్య్రం తర్వాత దేశంలో వివక్షతో కూడిన దాడులు అనేకం జరిగాయి. దళిత మహిళలైన మరియమ్మ, సునీత ఘటనలు కూడా ఇందులో భాగమనే ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలు పోలీసుల పైశాచికత్వాన్ని, వివక్షతో కూడిన దాడులపై మరోసారి చర్చకు దారితీశాయి. అయితే ఇలాంటి ఘటనలపై ఆయా ప్రభుత్వాలు వేగంగా స్పందించినట్టు కనిపించినా.. జాతి, కుల దురహంకారంపై పోలీసుల వ్యవహరశైలికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి వేలాది కేసులు దశాబ్దాలుగా కోర్టుల్లో కొనసాగుతూనే ఉండగా.. బాధితులకు న్యాయం అందని ద్రాక్షగా మిగులుతున్నది.
2021లో లాకప్ డెత్ అయిన మరియమ్మ కేసు, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో పోలీసులు దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నప్పటికీ, బాధితులకు న్యాయం అందించడానికి, నిందితులకు శిక్ష వేయడానికి ఇంకెంత కాలం పడుతుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు, ముస్లింలపై వివక్షతో అనేక దాడులు జరిగాయి. అయితే చాలా కేసుల్లో వాటిని రుజువు చేయడంలో ఇబ్బందులు ఎదురవడంతో దోషులు బయటపడినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది.
అనుకూల తీర్పులు అంతంతే..!
దేశంలో వివక్షతో కూడిన దాడుల్లో.. బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులు అంతంత మాత్రమేనని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. కేసులు, చార్జ్ షీట్ నమోదులో పోలీసుల వైపు నుంచి జరిగే జాప్యంతో నిందితులు తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. చుండూరు ఘటనపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు పదహారేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించగా, ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో బాధితుల బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉన్నది. కారంచేడు ఘటనలో గుంటూరు కోర్టు ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, 46 మందికి 3 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1998 జూలై 24న ఇచ్చిన తీర్పులో కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు కొట్టి వేసింది.
ఆ తర్వాత సుప్రీంకోర్ట్‌లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయగా, 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా దేశంలో 20 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నట్టు దళిత సంఘాలు చెబుతున్నాయి. చాలా కేసుల్లో కింది స్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, నిందితులను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. చాలా సందర్భాలలో సాక్ష్యాధారాలు రూపుమాపుతున్నారని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని, బలవంతపు రాజీలు చేస్తున్నారని, విచారణలు సక్రమంగా జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో ఏడాదిలోనే న్యాయం!
అమెరికాలో, ఫేక్ డాలర్ నోట్ల అనుమానంతో డెరిక్, అతని ముగ్గురు సహచర అధికారులతో జార్జ్ ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఫ్లాయిడ్‌ను తరలించే క్రమంలో పోలీసులు క్రూరంగా వ్యవహరించగా.. అతను ప్రాణాలు కోల్పోయాడు. జాత్యాహంకార హత్యగా ఇది ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘటన 25 మే 2020 న జరగగా సరిగ్గా ఒక సంవత్సరం 32 రోజుల తరువాత తీర్పు వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన అధికారి డెరిక్ చౌవిన్‌కు ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ‘ఈ తీర్పు భావోద్వేగాలతో, సానుభూతితో ఇచ్చింది కాదు. కానీ, ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు’ అని జడ్జి పీటర్ కాహిల్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషయంలో, సిటీ కౌన్సిల్ ఆఫ్ మిన్నియాపాలిస్, ఫ్లాయిడ్ కుటుంబం మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద, సిటీ కౌన్సిల్ ఫ్లాయిడ్ కుటుంబానికి 27 మిలియన్ డాలర్లు (సుమారు రూ.196 కోట్లు) ఇచ్చింది.
చట్టాలెన్ని ఉన్నా..
భారతదేశంలో దళితులు, గిరిజనుల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా నిందితులు ఎలాగోలా తప్పించుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దళితులు, గిరిజనుల రక్షణ కోసం షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారించి, నేరం తీవ్రతను బట్టి బాధితులకు సహాయం, పునరావాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు. అంతేకాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహించడం నేరం. దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమలులోనే పాలకుల చిత్తశుద్ధిలేమి స్పష్టంగా కనిపిస్తోంది. నేరాలు జరగడం, కేసులు వీగిపోవడంలో రాజకీయాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. న్యాయ, అన్యాయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ ప్రభావం లేని పాలకులు.. పాలకుల ఒత్తిడి లేని పోలీసులు.. దీనికి తోడు న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలిచే ఉద్యమకారులు.. ప్రజలు, పక్షపాతం, ఒత్తిడి లేకుండా తీర్పు చెప్పే న్యాయస్థానాలు ఉంటే భారతదేశంలో కూడా న్యాయం సత్వరం అందే అవకాశముంటుంది.
-మహమ్మద్ ఆరిఫ్
96184 00190