పదేళ్లు పాలించినా.. ‘పాఠాలు’ నేర్చుకోలేదా?

by Ravi |   ( Updated:2023-10-19 01:01:06.0  )
పదేళ్లు పాలించినా.. ‘పాఠాలు’ నేర్చుకోలేదా?
X

ఎట్టకేలకు బీఆర్ఎస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ఈ మేనిఫెస్టోను చూస్తే, ఆ పార్టీ పెద్దగా కసరత్తు చేయకుండా.. కాంగ్రెస్ ‘గ్యారెంటీ’లను కాపీ కొట్టినట్టు కనిపిస్తున్నది. మహిళలను ఆకర్షించేందుకు ‘హస్తం’ ప్రకటించిన మహాలక్ష్మి స్కీమ్‌కు పోటీగా ‘సౌభాగ్యలక్ష్మి’ని తీసుకొచ్చింది. రైతుబంధు సాయాన్ని, ఆసరా పింఛన్లను పెంచుతామని తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విధి విధానాలపై సరైన స్పష్టత ఇవ్వకున్నా... ఈ హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

పరిస్థితి తెలిసినా హామీలా?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే సమయంలో తెలంగాణ ‘సర్ ప్లస్’ రాష్ట్రం! అలా తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో అప్పటి తెలంగాణను ధనిక, మిగులు రాష్ట్రమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉమ్మడి ఏపీ అప్పులను పంచగా.. తెలంగాణకు వాటాగా వచ్చిన అప్పు కొన్ని వేల కోట్లు మాత్రమే. అయితే మొదటి టర్మ్‌లో నాలుగున్నరేళ్లు పాలించిన తర్వాత రాష్ట్రం అప్పు రూ. 2.30 లక్షల కోట్లకు చేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చి మరో ఐదేండ్ల తర్వాతా అంటే ఇప్పుడు తెలంగాణ అప్పు రూ. 5లక్షల కోట్లకు చేరువలో ఉంది. అందుకే ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలు, పరోక్ష పన్నులు, ఇంకా వివిధ రకాల విధానాలను అవలంభించినా.. ఆశించిన స్థాయిలో నిధులు సమకూర్చుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమయ్యాయి. దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు చేయూత వంటి పథకాలు కొందరు లబ్ధిదారులకే పరిమితమైపోయాయి. ఏడాదికి కేవలం రూ. 2వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యే ‘నిరుద్యోగ భృతి’ హామీని సైతం బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గ్రామాల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు తెలిసినా... కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ ‘ఉచిత’ హామీలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

అర్హులంటే.. ఎవరు?

కాంగ్రెస్ రూ. 500కే గ్యాస్ కనెక్షన్ ఇస్తామంటే.. తాము రూ.400కే ఇస్తామని బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చింది. సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు రూ.3000 జీవన భృతి ఇస్తామని చెప్పింది. అయితే ఈ స్కీమ్స్‌లో ‘అర్హులకు’ అనే తిరకాసు పెట్టింది. అర్హులంటే ఎవరో, విధి విధానాలు ఎలా ఉంటాయో స్పష్టత ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఈ స్కీమ్ అమలుపై గ్యారెంటీ ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా’ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని క్లారిటీ ఇచ్చింది. కానీ గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి స్కీమ్స్ విధి విధానాలపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

ఇన్నేళ్లు.. ఎందుకు చేయలేకపోయారు?

సీపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. అయితే పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు అధ్యయన కమిటీ ఎందుకు వేయలేకపోయిందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అసైన్డ్ భూముల హక్కుల విషయంలోనూ పదేళ్లుగా సర్కారు నిర్ణయం తీసుకోలేకపోయింది. అలాగే ఇంటి జాగా లేని నిరుపేదలకు స్థలాలను కేటాయిస్తామని, ప్రస్తుత విధానం అమలవుతుందని బీఆర్ఎస్ చెబుతున్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హౌజింగ్ కార్పొరేషన్‌నే ఎత్తివేసింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణమూ, కేటాయింపు అంతంత మాత్రమే. గృహలక్ష్మి స్కీమ్‌ను ఎన్నికలకు ముందు తీసుకొచ్చి కొందరికే పరిమితం చేశారు. ఇలాంటి అంశాలను ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చితే ప్రజలు నమ్ముతారా లేదా అనేది రానున్న ఎన్నికల్లోనే తేలనున్నది. ఇంకా అనేక హామీలు ఇవ్వగా ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిధులెక్కడి నుంచి తీసుకొస్తారు?

ప్రస్తుతం రైతుబంధు పేరిట ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందజేస్తున్నారు. దీనికే ఏటా సుమారు రూ. 15వేల కోట్లు కేటాయిస్తున్నారు. రైతుబంధు సాయాన్ని పెంచితే బడ్జెట్‌ను కనీసం రూ. 20వేల కోట్లకు పెంచాల్సి ఉంటుంది. సౌభాగ్యలక్ష్మి, రూ. 400కే గ్యాస్‌కు రేషన్ కార్డు కుటుంబాలను అర్హతగా ఉంచితే కనీసంలో కనీసం రూ. 30వేల కోట్లు అవసరమవుతాయి. ఆసరా పింఛన్ల బడ్జెట్‌ను క్రమక్రమంగా రూ. 20వేల కోట్లకు పెంచాల్సి ఉంటుంది. రేషన్‌లో సన్న బియ్యం, రేషన్ కార్డు కలిగి ఉన్న 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిధి రూ. 15లక్షలకు పెంపు, కొత్త గురుకులాలు, లక్ష బెడ్ రూమ్ ఇండ్లు వీటికీ వేల కోట్లు అవసరమవుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, గృహలక్ష్మి, బీసీలకు చేయూత, దళితబంధు, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్, కంటి వెలుగు, రైతుబీమా, కేసీఆర్ కిట్, హరితహారం, ఆరోగ్యలక్ష్మి, గొర్రెల పంపిణీ వంటివాటికీ రూ. వేల కోట్ల బడ్జెట్ అవసరమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు/వేతనాల కోసం రూ. 38,627 కోట్లు, పెన్షన్ల కోసం రూ. 13,024 కోట్లు కేటాయించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి సబ్సిడీల కోసం రూ. 12,958 కోట్లు కేటాయించింది. కొత్త పీఆర్సీ వేసినందున ఆ నివేదికకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి వస్తే ఈ బడ్జెట్‌కు అదనంగా రూ. 5 వేల నుంచి రూ. 10వేల కోట్లు పెంచాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ లెక్కన వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 3.10 లక్షల కోట్ల నుంచి రూ. 3.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముంటుంది. ప్రస్తుత పథకాలు, కొత్తగా ఇచ్చిన హామీల అమలుకు ఏ స్థాయిలో నిధులు అవసరమవుతాయో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌కు తెలియదని చెప్పలేం. ఇప్పటికే ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. నిధుల సమీకరణ కోసం అనేక పాట్లు పడుతున్నది. రూ. లక్ష రుణమాఫీ చేయడానికే ఐదేళ్లు పట్టింది. అది కూడా పూర్తిస్థాయిలో చేయలేకపోయిందనే విమర్శ ఉంది. రైతుబంధు నిధుల జమకు కూడా నెలల సమయం తీసుకుంటున్నది. అంతేకాకుండా పాత అప్పులకు వడ్డీల చెల్లింపులు సరేసరి. దీంతో సంక్షేమ పథకాలు ప్రకటించే ముందు బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే బీఆర్ఎస్ ప్రస్తుతం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కనీసం రూ. 5లక్షల కోట్లు ఉంటేనే సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కచ్చితంగా ఆ హామీలు నెరవేర్చుతామనే పార్టీలు అధికారంలోకి వచ్చాకా ఆ మాట నిలబెట్టుకుంటాయా?

మహమ్మద్ ఆరిఫ్

సీనియర్ జర్నలిస్ట్,

96184 00190

Advertisement

Next Story

Most Viewed