- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల జీవం పోయగలరా?
నిన్న మొన్నటివరకు తెలంగాణలో హల్‌చల్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఇక్కడ సత్తా చాటడానికి రెడీ అయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా షర్మిల నియమితులయ్యారు. స్వంత పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని విలీనం చేసినందుకు ఆమె కోరుకున్న కానుకనే అందించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఊహించిందే జరిగింది. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అప్పగించింది ఏఐసీసీ. గిడుగు రుద్రరాజును బుజ్జగిస్తూ ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. వైఎస్ షర్మిలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపచేయడానికి షర్మిల ఇమేజ్ ఉపయోగపడుతుందన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బలపడినట్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఇక్కడ బలపడాలని..
వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక విచిత్రాలు కనిపిస్తున్నాయి. పులివెందుల బిడ్డగా పేరున్న వైఎస్ షర్మిల, తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టడమే ఒక విశేషం. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొంతకాలం షర్మిల హల్‌చల్ చేశారు. తెలంగాణ సమస్యల సాధన కోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై వైఎస్ షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరుద్యోగ సమస్యపై అప్పటి గులాబీ పార్టీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతివారం నిరాహార దీక్షలు కూడా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆక్సిజన్ అందించాలని ఢిల్లీ పెద్దలు భావించారు. ఆ సందర్భంలోనే షర్మిల పేరు తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన మానసపుత్రిక అయిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. విలీనం జరిగిన వెంటనే ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా నడిచింది. అయితే ఎందుకోగానీ, కాంగ్రెస్ హస్తిన పెద్దలు కొద్దిగా టైమ్ తీసుకున్నారు. తాజాగా షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణాదిన పుంజుకున్న హస్తం
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగానే ఉన్నా, దక్షిణాదిన ఇటీవల పుంజుకుంది. దక్షిణాదిన ఐదు రాష్ట్రాలుంటే, రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొత్తంగా దక్షిణాదిన బలపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. పూర్తిగా నిస్తేజ స్థితిలో ఉంది. విభజన తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. గెలుపు సంగతి తరువాతి విషయం. కనీసం కాంగ్రెస్ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అసలు కాంగ్రెస్ జెండాలు మోసే కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను మరచిపోయారు. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉన్న సామాజిక వర్గాలన్నీ దాదాపుగా వైసీపీ శిబిరానికి తరలిపోయాయి. టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఇటు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అటు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షాలుగా అవతరించాయి. విభజన తరువాత ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు చోటు లేకుండా పోయింది. బీజేపీది కూడా అతిథి పాత్రే.
ఆమెపైనే నేతల ఆశలు!
వైఎస్ షర్మిలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపచేయడానికి షర్మిల ఇమేజ్ ఉపయోగపడుతుందన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బలపడినట్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మౌలికమైన తేడా ఉంది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నాయకులు విస్మరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మేనంటూ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్లారు. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారే. అయితే ఈ విషయాన్ని గట్టిగా చెప్పి, ప్రజలకు దగ్గరకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళు పట్టింది. కానీ విభజనపై ఏపీ ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతోనే ఉన్నారు. హైదరాబాద్ నగరానికి తాము పరాయివారం అయ్యామన్న బాధ, ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఏ అజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరకు వైఎస్ షర్మిల వెళతారన్నది ప్రశ్నగానే మిగిలింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్తగా పురుడు పోసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పటికే రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఆక్సిజన్ అందించగలరా? కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్,
సీనియర్ జర్నలిస్ట్,
63001 74320