చైనాను భారత్ అధిగమించగలదా!?

by Ravi |   ( Updated:2023-03-12 03:26:24.0  )
చైనాను భారత్ అధిగమించగలదా!?
X



2030 నాటికి రెండో స్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించడం లేదా దరిదాపుల్లోకి రావటం ఖాయమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాను అధిగమించడం ఇండియాకు సాధ్యమయ్యే పనేనా అని సగటు మనిషి మొదలుకొని ఆర్థిక వేత్త వరకు అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో ఇప్పటికీ పెట్టుబడులు భారీగా వస్తున్నప్పటికీ, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్’లో 2022 లెక్కల ప్రకారం భారత్ 116 వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూసినా పెట్టుబడులను ఆకర్షించడం ఎంత కష్టసాధ్యమో అర్థమౌతుంది. పారిశ్రామిక చట్టాలు, భూ చట్టాలు, ఐటీ చట్టాలు మొదలుకొని పన్ను చట్టాల వరకు, చిన్నస్థాయి మొదలు కొని పెద్ద స్థాయి కంపెనీ వరకు ఉపయోగపడే విధంగా మార్చినప్పుడే మనం ప్రపంచ వాణిజ్య పటంలో నేడు కాకపోయినా ఇంకో 20-30 ఏళ్ల కైనా చైనాను దాటి అగ్రస్థానానికి చేరుకోవడం అసాధ్యమేమీ కాదు!

2030 కల్లా భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందబోతోందని, 2023లో భారత జీడీపీ 6.5 శాతంగా ఉంటుందని చాలారోజుల క్రితం వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. అనుకున్న దానికంటే వృద్ధిరేటు వేగంగా ఉందని ప్రపంచ బ్యాంకు అంచనాలను సవరించి 6.9 గా ఉంటుందని తాజాగా పేర్కొంది. 2030 నాటికి రెండో స్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించడం లేదా దరిదాపుల్లోకి రావటం ఖాయమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాను అధిగమించడం ఇండియాకు సాధ్యమయ్యే పనేనా అని సగటు మనిషి మొదలుకొని ఆర్థిక వేత్త వరకు అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో ఇప్పటికీ పెట్టుబడులు భారీగా వస్తున్నప్పటికీ, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్’లో 2022 లెక్కల ప్రకారం భారత్ 116 వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూసినా పెట్టుబడులను ఆకర్షించడం ఎంత కష్టసాధ్యమో అర్థమౌతుంది.

వాళ్ళ పాలసీలు అలా ఉన్నాయి!

ఇప్పటి వరకు పెట్టుబడుల కోసం అమెరికా, రష్యా వైపే భారతదేశం దృష్టి సారిస్తూ వచ్చింది. ఈ దేశాలన్నీ పెద్దపెద్ద పారిశ్రామిక రంగాలపై ఆధారపడుతూ. ప్రతి చిన్న వాటికీ మేధోసంపత్తిపై పేటెంట్ హక్కులను పొందుతున్నాయి.. కానీ భారత్‌లో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసినప్పటికీ, పేటెంట్ హక్కులను తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో, విదేశీ కంపెనీలు వారికి తమ కంపెనీలో ఉద్యోగాన్ని ఆశచూపి మన మేధో సంపత్తిని వాళ్ల కంపెనీకి సంబంధించిన పేటెంట్‌గా మార్చుకుంటున్నాయి. ఫలితంగా ఎంతో విలువైన మేధో సంపత్తి వేరే దేశాలకు తరలిపోతోంది. అమెరికా లాంటి అగ్రదేశాల్లో, పాశ్చాత్య దేశాలలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడ వివిధ పరిశ్రమలు స్థాపిస్తారు. స్టార్టప్‎లకు భారీ ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి. ఆవిష్కర్తలకు అడ్డు పడకుండా వ్యాపారాలు చేస్తారు. మేధో సంపద హక్కులకు భంగం కలిగించని చట్టాలు ఉంటాయి. ఆవిష్కరణలు నష్టాల పాలు అయితే వెనక నుంచి ఆదుకునే ప్రభుత్వ పాలసీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇలాంటివి ఏవీ లేవు, భారత్‌లో మాత్రం ఈ ప్రోత్సాహకాలు నేటికీ తక్కువగానే ఉన్నాయి. స్టార్టప్ ఐడియాలు ఎన్ని ఉన్నా కూడా వాటికి సరైన ప్రోత్సాహకాలు, సరైన పన్ను రాయితీలు కూడా ఉండకపోవడంతో ఆదిలోనే ఇవి చతికిల పడిపోతున్నాయి. ఫలితంగా భారత్‌లో స్టార్టప్‎ల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నాయి.

భూ చట్టాల సంస్కరణలు

దేశంలోని భూ చట్టాలను సంస్కరించాల్సిన అవసరముంది. సాధారణంగా పెట్టుబడులను పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే మాత్రం త్వరగా భూములను కేటాయించడం జరుగుతోంది. ల్యాండ్ పూలింగ్‌లో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితో నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. దీంతో చిన్న సంస్థలకు భూములను కేటాయించడం కఠినంగా మారింది. దేశంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలు తమ కంపెనీలను విస్తరించ లేకపోవడం వల్ల భారీ ఎత్తున నష్టం జరుగుతున్నది. దీనికి కారణం చాలా ఏళ్ళుగా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తూండటమే.

కార్పొరేట్ చట్టాల సవరణ

దాదాపు అన్ని దేశాల్లో కూడా కార్పొరేట్ చట్టాలు పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలంగాను, సులువుగానే ఉంటాయి. అయితే భారత్ లోని చట్టాలు మాత్రం పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉండి, చిన్న స్థాయి, మధ్య స్థాయి సంస్థలకు వ్యతిరేకంగా మారాయి. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ చట్టాలకు సరళీకృత సవరణలు చేసి మరింత సులభతరం చేయాల్సిన అవసరముంది. పెట్టుబడులు పెట్టే అన్ని కార్పొరేట్ సంస్థలూ కూడా భారత ప్రభుత్వాల చట్టాలను కచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది.

చిన్న కంపెనీలను పట్టించుకోవాలి..

చాలా వరకు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వాలు పన్ను రాయితీలను కల్పిస్తుంటాయి. అయితే ఇది పెద్ద పెద్ద కంపెనీల విషయంలో మాత్రమే జరుగుతోంది. చిన్న చిన్న కంపెనీల ద్వారా తమ ప్రభుత్వానికి గుర్తింపు రాదనే కారణంతో వాటికి పన్ను రాయితీలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కాబట్టి చిన్న కంపెనీలకు కూడా పన్ను రాయితీలను కల్పించాల్సిన అవసరముంది. అలాగే జీఎస్టీని మరింత సులభతరం చేయాల్సిన అవసరముంది. ఇప్పుడున్న జీఎస్టీ శ్లాబులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే జీఎస్టీ శ్లాబులను మరింత తగ్గించాల్సిన అవసరముంది. కొత్త స్టార్టప్ కంపెనీలు వీటిని తట్టుకుని నిలబడలేని స్థితిలో ఉన్నాయి.

ఇంకా విదేశీమయమేనా?

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో ఆర్థిక శక్తి కొరవడి డబ్బులు లేని కారణంగా ప్రభుత్వమే ప్రజాప్రయోజన లక్ష్యంతో పలు పారిశ్రామిక సంస్థలను మొదలు పెట్టిందని చెప్తుంటారు. కానీ ఈ రోజుకు కూడా మనం అరవై శాతం భారతీయులు పనిచేసే వ్యవసాయ రంగంలో ఉపయోగించే ప్రతి ఒక్కటి విదేశీ ఆవిష్కరణల ఉత్పత్తే. రోడ్లు వేసే కంపెనీలు, బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణ సంస్థల పరికరాలు, రక్షణరంగంలో సైనికులు ఉపయోగించే చాలా ఆయుధాలు, మనం వాడుతున్న పేపర్ కరెన్సీ, పోలవరానికి జర్మనీ మంచి తెప్పించిన పరికరాలు, 5జి సెల్ ఫోన్ సర్వీసులు, అంతా విదేశీ సాంకేతికతనే వాడుతున్నారు. వాటిని మనం దేశంలోనే తయారు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అందుకు కోట్లలో లైసెన్స్ ఫీ చెల్లించాలి. ఇలా చాలా రంగాలను నిబంధనలతో భారతీయులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు. ఆవిష్కరణలకు ఆదరణ కొరవడడానికి కారణం వలస పాలన కాలం నాటి చట్టాలనే ఇంకా అనుసరిస్తుండడమే. మన యువత ఆవిష్కరణలు, నవీన పరిశోధనలు, సాంకేతికతకు అవకాశం ఇచ్చే సంస్థాగత, వ్యవస్థీకృత చర్యలు చేపట్టడం లేదు. మన దేశంలో డబ్బుతో ప్రజాప్రయోజన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. దురదృష్టం ఏమిటంటే లక్షల కోట్ల బడ్జెట్‌లున్న దేశంలో కనీసం 5-6 వేల కోట్ల ఆవిష్కరణలు కూడా ఉండటం లేదు.

విదేశీ కార్పొరేట్లకు కేవలం భారత మార్కెట్ మాత్రమే కావాలి, తమ ఉత్పత్తులను అమ్మగలిగే వ్యాపారులు మాత్రమే కావాలి. కానీ సాంకేతిక జ్ఞాన పోటీ అసలే ఉండకూడదు. అందుకే మన దేశంలో సాంకేతిక శిక్షణ ఉన్న ఉద్యోగాల కన్నా వ్యాపార శిక్షణ ఉన్న ఉద్యోగాలకే భారీ జీతాలు అందుతున్నాయి. ఇలా విదేశీ కంపెనీలు మన దేశాన్ని ఉత్పాదక దిశ నుంచి అనుత్పాదక దిశలోకి నెట్టివేస్తున్నాయి. భారత్ పారిశ్రామికంగా మరింత వృద్దిని సాధించాలంటే ఉన్న చట్టాలను మరింత సులభతరం చేస్తే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మంచి స్థానం పొందే అవకాశం కచ్చితంగా ఉంది.

మార్పులు చేస్తేనే.......

ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అంచనాలకు మించి అభివృద్ధి చెందుతుంది. నేడు జనాభాలో చైనాను దాటి మొదటి స్థానంలోకి చేరుకున్నాం. ఫలితంగా కొనుగోలు దారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శ్రామిక వర్గసంఖ్య దండిగా ఉంది. నైపుణ్యాలకు కొదువలేదు, చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, అక్కడి కార్మిక ఖర్చులు భారీగా ఉండటంతో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే సంస్థలు చాలా వరకు భారత్ వైపు చూస్తున్నాయి. 2030 నాటికి, వినియోగదారుల వ్యయం ఇప్పుడు $1.5 ట్రిలియన్ల నుండి 2030 చివరి నాటికి $6 ట్రిలియన్లకు పెరగగలదని అంచనాలు నెలకొన్నాయి. భారత్ ఇదే రీతిన వృద్ధి సాధిస్తే.. 2030 నాటికి 8.4 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతోపాటు.. జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఖాయమంటున్న నేపథ్యంలో పారిశ్రామిక చట్టాలు, భూ చట్టాలు, ఐటీ చట్టాలు మొదలుకొని పన్ను చట్టాల వరకు, చిన్నస్థాయి మొదలు కొని పెద్ద స్థాయి కంపెనీ వరకు ఉపయోగపడే విధంగా మార్చినప్పుడే మనం ప్రపంచ వాణిజ్య పటంలో నేడు కాకపోయినా ఇంకో 20-30 ఏళ్ల కైనా చైనాను దాటి అగ్రస్థానానికి చేరుకోవడం అసాధ్యమేమీ కాదు సుమా !

డా. బి.కేశవులు నేత. ఎండీ.

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed