సీఏఏ అమలు నిలిపేయాలి!

by Ravi |   ( Updated:2024-03-28 01:00:38.0  )
సీఏఏ అమలు నిలిపేయాలి!
X

పౌరసత్వ సవరణ చట్టాన్ని 2024 మార్చి 11 నుంచి దేశంలో అమలు జరుపుతున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించి కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019లో సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఐదు సంవత్సరాలు మిన్నకుండి అకస్మాత్తుగా దీన్ని అమలు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? పార్లమెంట్‌కు ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్న నేపధ్యంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం అమలు జరపడంలో ఉద్దేశం ఏంటి?

భారతదేశంలో పెద్ద సంఖ్యలో వలసదారులు నివసిస్తున్నారు. సరిహద్దు నిర్వహణపై ఉన్న టాస్క్ ఫోర్స్ 2001లో 15 మిలియన్ల అక్రమ వలసదారులు ఉన్నారని పేర్కొన్నది. 2004లో 12 మిలియన్ల వలసదారులు ఉన్నారని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో పేర్కొంది. వీరు ఓటు హక్కును కూడా పొందారు. ఇలా ఓటు హక్కును పొందిన వారిని ఎన్నికల్లో గెలుపునకు ఉపయోగించుకున్నాయి పార్టీలు. 2014 డిసెంబర్ 31 తేదీ నాటికి దేశంలో విదేశీ శరణార్ధులు 2,89,394 మంది ఉన్నారని 2016 మార్చి 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు కూడా భారతదేశంలో నివసిస్తున్నారు. గతంలో ఐదుసార్లు సవరించిన పౌరసత్వ చట్టంపై పెద్దగా వివాదాలు రాలేదు.

ముస్లింలే లక్ష్యంగా...

భారతీయ జనతా పార్టీకి, వలసదారులను ముఖ్యంగా ముస్లింలను గుర్తించడం, బహిష్కరించటం అనేది 1996 నుండి ఎజెండాలో ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హిందూ శరణార్ధులందరికీ సహజమైన ఇల్లు నిర్మిస్తామని పేర్కొన్నది. 2016లో అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస నుండి పారిపోయిన హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అక్రమ వలసదారులు ముస్లింమేతరులైతే, వారు శరణార్ధులనే కారణంతో భారత పౌరసత్వం పొందవచ్చని, అక్రమంగా వలస వచ్చిన ముస్లింలు మాత్రమే బహిష్కరించబడతారని అందులో పేర్కొంది. 2016 ఎన్నికలకు ముందు సంవత్సరం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మతపరమైన మైనారిటీలకు చెందిన శరణార్ధులకు మోదీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. వారికి దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేసింది. అయితే, ఇది అస్సాంతో బంగ్లాదేశ్ చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించటమే. ఈ ఒప్పందంలో భాగంగా 1971 తర్వాత అస్సాంలోకి వచ్చిన బంగ్లాదేశ్ వాసులను గుర్తించి బహిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చింది.

పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం

మోదీ ప్రభుత్వం నేడు అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని, 2019 డిసెంబర్ 9న బిల్లుగా ప్రవేశ పెట్టారు. ప్రతిపక్షాల, ప్రజా సంఘాల నిరసన మధ్య పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అక్రమ వలస దారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టంలో, మోదీ ప్రభుత్వం ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం ద్వారా మార్పులు చేసింది. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు ముఖ్యంగా హిందువులకు పౌరసత్వ చట్టంలో చేసిన మార్పుల ద్వారా పౌరసత్వం ఇవ్వవచ్చు. ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకోవటానికి 12 సంవత్సరాలు భారత్‌లో నివశించటం కాని, ప్రభుత్వం కోసం పని చేసి ఉండటం తప్పనిసరి అర్హతలు అన్న నిబంధనను కూడా మోడీ ప్రభుత్వం సవరించింది.

రాజ్యాంగ వ్యతిరేకం

ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్త్రెస్తవులకు చట్టం నుంచి నివాసకాల నుంచి మినహాయింపులు ఇచ్చారు. అయితే వీరు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లలో ఏదో ఒక దేశానికి చెందని వారని నిరూపించుకోవాలి. వీరు ఆరేళ్లు భారతదేశంలో నివసించడం లేదా పని చేసి ఉంటే చాలు. అలాంటి వారు పౌరసత్వ పొందటానికి అర్హులుగా సవరణ చట్టం పేర్కొన్నది. ఇలా దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు ప్రధానంగా హిందువులకు పౌరసత్వ లభించేలా చట్ట సవరణను మోదీ ప్రభుత్వం చేసింది. ముస్లిం వలస ప్రజలకు పౌరసత్వం పొందటానికి ఈ మినహాయింపులు సవరణ చట్టంలో లభించలేదు. పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌కి చెందిన ఏ వ్యక్తి అయినా గత పన్నెండు నెలలుగా లేదా అంతకు ముందు 14సంవత్సరాల్లో 11 సంవత్సరాలు భారతదేశంలో నివశించినట్లు రుజువైతే పౌరసత్వానికి అర్హులుగా ప్రకటించబడతారు. ముస్లింలు దీన్ని రుజువు చేసుకోవాలి. ఈ నిబంధన వలన అత్యధికంగా ముస్లింలు పౌరసత్వానికి దూరమౌతారు. విదేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వ ఇచ్చే విషయంలో ఈ వివక్ష లౌకిక రాజ్యాంగ సూత్రానికి వ్యతిరేకమే! పౌరసత్వ వ్యత్యాసం వివక్ష బీజేపీ స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం.

పౌరసత్వం వీరికి మాత్రమేనా?

సవరణ చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి వలస వచ్చిన ముస్లిమేతరులందరికీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పిస్తుంది. వారికి రక్షణ ఇస్తుంది. ముస్లిం వలస దారులకు మాత్రం సవరణ చట్టం రక్షణ లేకుండా చేస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 క్రింద వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. దేశంలోకి వలస వచ్చిన వారికి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం మత వివక్ష లేకుండా అర్హులైన వారందరికీ పౌరసత్వం కల్పించాలని, మోదీ ప్రభుత్వం మత విద్వేషాలు విడనాడాలని ప్రజలు ప్రజాతంత్ర వాదులు నినదించాలి.

బొల్లిముంత సాంబశివరావు

98859 83526

Advertisement

Next Story