- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నది ఉన్నట్టు: బడ్జెట్.. అంకెలు కాదు ప్రజల భవిష్యత్తు
పేదలను ఆదుకోడానికి సమాజంలో తప్పనిసరిగా సంక్షేమ పథకాలు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఏడున్నర దశాబ్దాలైనా సంక్షేమ ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. పాలకులు ఇచ్చేవారిగానూ, పేదలు అందుకునేవారిగానూ ఉండిపోతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోడానికి సంక్షేమం ఉపశమనంగా ఉండాలి. వారి జీవన ప్రమాణాలు పెరిగి స్వంత కాళ్ళమీద నిలబడేందుకు ఊతమివ్వాలి. ఏడున్నర దశాబ్దాల పాలనలో ఇంకా ముప్పావు శాతం జనాభా పేదరికంలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఒకవైపు ఆకలి కేకలు మరోవైపు పిడికెడు మంది సంపన్నుల ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. జీవన ప్రమాణాలను పెంచలేకపోవడం పాలకుల చేతకానితనం కాదా? సంక్షేమాన్ని ఆశించాల్సిన అవసరం లేని స్థాయికి వారిని నిలదొక్కుకునేలా చేయడమే పాలకుల గొప్పదనం. పేదలను ఆదుకోడానికి సంక్షేమ పథకాలు అవసరమే. పేదరికం ఉన్నంతకాలం అవి కొనసాగాల్సిందే. కానీ అవి ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా, సంక్షోభంగా మారకూడదు. ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న ప్రతి పైసా సద్వినియోగం కావాలి. బడ్జెట్ అంటే కేవలం అంకెలు కాదు. సమాజంలోని ప్రజల జీవితాలు.
దేశంలో సంపన్న రైతులు ఎక్కడున్నారంటే అది తెలంగాణలోనే అని చెప్పుకోవాలి.. రైతులు కాలు మీద కాలేసుకుని కూర్చుంటే.. అగో అది బంగారు తెలంగాణ.. అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. తొమ్మిదేళ్ళయింది. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా.. ఇలాంటి సంక్షేమ పథకాలతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందనేది ఆయన చెప్తున్న మాట. నిజమే.. ఈ తరహా పథకాలు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణకు మాత్రమే పరిమితం. ఈ స్కీమ్‌ల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నదీ వాస్తవం. కానీ వీటితో పేదల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
ప్రతీ సంవత్సరం సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయింపులను పెంచుతూనే ఉన్నది. గతేడాది 80 వేల కోట్లుగా ఉన్న సోషల్ సర్వీస్ బడ్జెట్ కేటాయింపులు ఈసారి లక్ష కోట్లు దాటాయి. మొత్తం బడ్జెట్‌లో దాదాపు 40% ఇలాంటి పథకాలకే ఖర్చవుతున్నది. ఈ సంవత్సరం ఎన్నికలు కూడా వస్తున్నాయి. రేపు ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను తీసుకొస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం వరాలు కురిపిస్తారోననే చర్చ మొదలైంది. మళ్లీ అధికారంలోకి రావడానికి, ఓటర్లను ఆకట్టుకోడానికి ఏదో ఒక భారీ హామీ ఇస్తారనే ఆశలున్నాయి. పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే హామీలు ఇచ్చేస్తున్నాయి. ఏ హామీకి ఓటర్లు ప్రభావితమవుతారో, ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
ఉచితాలతో సోమరులవుతారా?
ఆర్థికంగా చితికిపోయిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. ఉచితాలు దేశ ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యకరం కాదంటూ ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫ్రీబీస్ స్కీమ్‌లు ప్రజలను సోమరిపోతులను చేస్తాయంటూ ఆర్థికవేత్తల నుంచి విమర్శలూ వినిపిస్తున్నాయి. ఏది ఉచితం, ఏది సంక్షేమం అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. రైతులకు రుణమాఫీని తప్పుపట్టే నేతలు, సంపన్నులు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలను మాఫీ చేయడం దేనికిందకు వస్తుందనే ప్రశ్నలకు కేంద్ర పాలకుల నుంచి సమాధానం కరువైంది.
పేదలను ఆదుకోడానికి సమాజంలో తప్పనిసరిగా సంక్షేమ పథకాలు ఉండాలన్నది నిర్వివాదాంశం. ఏడున్నర దశాబ్దాలైనా సంక్షేమ ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. పాలకులు ఇచ్చేవారిగానూ, పేదలు అందుకునేవారిగానూ ఉండిపోతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోడానికి సంక్షేమం ఉపశమనంగా ఉండాలి. వారి జీవన ప్రమాణాలు పెరిగి స్వంత కాళ్ళమీద నిలబడేందుకు ఊతమివ్వాలి. రైతుబంధు లాంటి స్కీమ్ పంటల సీజన్‌లో రైతులకు పెట్టుబడిగా ఒక మేరకు ఉపయోగపడుతుందనేది వాస్తవం. కానీ ఇదే సర్వ రోగ నివారిణి తరహాలో ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. దీని సాకుతో అప్పటివరకూ అందిన సబ్సిడీల్లాంటివి కనుమరుగైపోయాయి.
స్కీమ్‌ల స్ఫూర్తి ప్రశ్నార్థకం
అవసరం ఉన్న రైతులకు రైతుబంధు సాయం అందాల్సిందే. కానీ సేద్యం చేయని భూస్వాములకూ ఇవ్వడమే వివాదాస్పదం. లక్షలాది మంది రైతుల్లో ఇలాంటివారు వేలల్లోనే ఉంటారంటూ ప్రభుత్వం సమర్ధించుకుంటున్నది. సంపన్నులకు రైతుబంధు సాయం అవసరమే లేనప్పుడు ఎందుకు ఇస్తున్నదనేది చాలాకాలంగా జరుగుతున్న చర్చ. మరోవైపు కౌలు రైతులకు ఈ సాయాన్ని అందించడంలేదు. లీగల్ చిక్కులను కారణాలుగా చూపుతున్నది. దళితబంధు స్కీమ్ సైతం ఇదే తరహాలో విమర్శలను ఎదుర్కొంటున్నది. పేద దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని సచివాలయ ఉద్యోగులకు సైతం అమలుచేస్తామని ప్రకటించడం ఈ స్కీమ్ స్ఫూర్తినే ప్రశ్నార్ధకం చేసింది.
సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు పాలిటిక్స్‌గా మారిపోయాయి. తొమ్మిదేళ్ళ కేసీఆర్, మోడీ పాలనలో అమలైన వెల్ఫేర్ స్కీమ్‌లు ఏ మేరకు పేదలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేశాయనేది సమాధానం లేని ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం కరోనా పరిణామాలతో గరీబ్ కల్యాణ్ అన్నయోజన అనే స్కీమ్‌ను తెచ్చింది. దేశంలోని 88 కోట్ల మందికి దీని ద్వారా లబ్ధి కలుగుతుందని గొప్పగా చెప్పుకుంటున్నది. ఏడున్నర దశాబ్దాల పాలనలో ఇంకా ముప్పావు శాతం జనాభా పేదరికంలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఒకవైపు ఆకలి కేకలు మరోవైపు పిడికెడు మంది సంపన్నుల ఆస్తులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. జీవన ప్రమాణాలను పెంచలేకపోవడం పాలకుల చేతకానితనం కాదా?
సంక్షేమాన్ని వెక్కిరిస్తున్న ఆత్మహత్యలు
రైతుబంధు లాంటి పథకం నాలుగేండ్లుగా అమలవుతున్నా రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగడంలేదు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉన్నది. ఈ స్కీమ్‌తోనే ఆగిపోతాయని కూడా భావించలేం. కానీ వారి జీవన ప్రమాణాలను పెంచలేకపోయిందనేది వాస్తవం. చనిపోకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుదే. కానీ చనిపోయిన తర్వాత రైతుబీమా పేరుతో ఐదు లక్షల సాయాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నది. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రధాన సమస్య అంటూ వ్యవసాయ ఆర్థిక నిపుణులు స్వామినాధన్ ఏనాడో చెప్పారు. పంటకు అయిన ఖర్చు మీద 50% లాభం ఉండాలని, ఈ మేరకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రగల్భాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో విఫలమైంది. సంపన్న రైతుగా తీర్చిదిద్దుతానని చెప్పిన తెలంగాణ ప్రభుత్వమూ ఆ ఫలితాన్ని సాధించలేకపోయింది. ప్రతీ ఉత్పత్తికి ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛ వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఉన్నప్పుడు రైతుకు మాత్రం ఎందుకు ఉండడం లేదనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సంక్షేమం స్వల్పకాలికం, ఉపశమనం మాత్రమే. ఎల్లకాలం వారికి అది కొనసాగుతూనే ఉండడం ఆరోగ్యకరం కాదు. సంక్షేమాన్ని ఆశించాల్సిన అవసరం లేని స్థాయికి వారిని నిలదొక్కుకునేలా చేయడమే పాలకుల గొప్పదనం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే.
ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు?
రాష్ట్రంలోని సుమారు కోటి కుటుంబాల్లో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషను కార్డులున్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలే. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్‌లతో ఆదుకుంటున్నట్లు ప్రభుత్వాలు గర్వంగా చెప్పుకుంటాయి. కానీ వాటి అవసరమే లేని తీరులో సర్కారు ఆస్పత్రుల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రతీ ఒక్కరికీ అందేలా తీసుకునే చర్యలు శూన్యం. పేదల ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపర్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. కానీ క్రమంగా ఆ కుటుంబాలను పేదరికం నుంచి కొంతైనా బైటపడేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలూ లేవు. వారు ఎంతకాలం పేదరికంలో ఉంటే అంతకాలం వారి ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలకు శ్రీరామరక్షగా ఉంటుంది.
ఇప్పటికే లక్ష కోట్లు దాటిన సంక్షేమ బడ్జెట్ రానున్న కాలంలో ఎంత పెరుగుతుందో! రేపటి బడ్జెట్‌లో రాష్ట్ర సర్కారు ఇంకెన్ని వారలు గుప్పిస్తుందో! ఎలాంటి కొత్త స్కీమ్‌లకు శ్రీకారం చుడుతుందో! మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ లోటులోకి వెళ్ళిపోయింది. ధనిక రాష్ట్రం అని సగర్వంగా కేసీఆర్ చెప్తున్నా తొమ్మిదేళ్ళలో రుణ భారం ఆరింతలు పెరిగి ఐదు లక్షల కోట్లు దాటింది. అప్పుచేసి పప్పుకూడు అనే నానుడిని తెలంగాణలో కళ్లారా చూస్తున్నాం. ఉచితాలు మంచిది కాదని చెప్పే ప్రధాని పేదరిక నిర్మూలనకు చేసిందేంటో, సాధించిన ఫలితాలేంటో విడమర్చి చెప్పాలి. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ, దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకునే కేసీఆర్ సైతం తొమ్మిదేళ్ళ పాలనలో ఎన్ని పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చారో చెప్పాలి.
పేదలను ఆదుకోడానికి సంక్షేమ పథకాలు అవసరమే. పేదరికం ఉన్నంతకాలం అవి కొనసాగాల్సిందే. కానీ అదే ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారకూడదు. ఆర్థికంగా సంక్షోభంలోకి తీసుకెళ్ళకూడదు. పేదరికం నుంచి సొంత కాళ్ళ మీద నిలబడేలా జీవన ప్రమాణాలు పెరగడానికి దూరదృష్టితో ఆలోచించి విధాన నిర్ణయాలు తీసుకోవడం తక్షణావసరం. ఖర్చు చేస్తున్న ప్రతి పైసా సద్వినియోగం కావాలి. బడ్జెట్ అంటే కేవలం అంకెలు కాదు. సమాజంలోని ప్రజల జీవితాలు.
ఎన్. విశ్వనాథ్
99714 82403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read....