బీటలు వారుతున్న బీఆర్ఎస్

by Ravi |   ( Updated:2024-01-31 01:16:05.0  )
బీటలు వారుతున్న బీఆర్ఎస్
X

టీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం కావడంతో బీఆర్ఎస్ బీటలు వారుతోంది. పార్టీ పేరు మార్పుతో జరిగిన రాజకీయ నష్టం పూడ్చలేనంత అగాథంగా మారిపోయింది. అధినేత అభీష్టాన్ని ఎదిరించలేని నాయకులు ఇప్పుడు తమకు వ్యక్తిగతంగా జరిగిన రాజకీయ నష్టాన్ని తలచుకొని కుమిలిపోతున్నారు. రాజకీయ భవితవ్యం ఏమిటని ప్రశ్నించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఇంతగా ఉంటుందని ఊహించలేక పోయామని వాపోతున్నారు. నియోజక వర్గాలవారీగా నిర్వహించిన సమీక్షల్లో పార్టీ వైఖరిని నిలదీసినవారే అధికంగా ఉన్నారనేది వాస్తవం.

తెలంగాణ ఆకాంక్షల పునాదిపై ఎదిగిన తెలంగాణ రాష్ట్ర సమితి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పునాదినే విస్మరించింది. ఉద్యమకారుల ఆకాంక్షలను నీరుగార్చింది. నిర్బంధంతో కూడిన కఠిన పాలన సాగించింది. అధినేత బుర్రకు తోచిందే నిర్ణయంగా పాలన సాగించింది. అనేక మంది ఉద్యమకారుల ఉనికిని ప్రశ్నార్ధకం చేసింది. కుటుంబ పాలనకు పెద్ద పీట వేసింది. గడీల పాలనను గుర్తు చేసేదిగా పాలన సాగించింది. చివరగా పార్టీ పేరునే మార్చేసింది. దీంతో తెలంగాణ వాదులు ఆక్రోశించక తప్పలేదు. ప్రజాస్వామిక పాలన కావాలని కోరుకున్నారు. అందుకు అనుగుణంగా పాలన సాగించే వారికి ప్రజలు పట్టంగట్టారు.

అన్ని తప్పులనూ సహించారు కానీ...

కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి దాదాపు పదేళ్ల పాటు ప్రజలు అన్ని విధాలుగా సహకరించారు. మాటల మాంత్రికుడైన ముఖ్యమంత్రి చర్యలను సహిస్తూనే తెలంగాణవాదం బతకాలని భావించి ప్రభుత్వం చేసే తప్పులను మన్నిస్తూ వచ్చారు. అణచివేతను సహించారు. అక్రమాలను భరించారు. పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపే ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించినప్పటికీ రాష్ట్రం బాగుపడాలనుకున్నారు. కానీ, ప్రజల సహనాన్ని బలహీనతగా భావిస్తున్నారని గుర్తించి, ఓటు అనే ఆయుధంతో బీటలు వారుతున్న బీఆర్ఎస్ ను ఇంటిబాట పట్టించారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రజాభీష్టాన్ని బీఆర్ఎస్ నేతలు పరిగణలోకి తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారదాహంతో రగిలిపోతున్నారు. ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.

ప్రతిపక్షంలోనూ సరిగా ఉండలేరా?

కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వంపై విషం జిమ్ముతున్నారు. ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో కూడా ఉండలేని పరిస్థితి సృష్టించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని చూస్తున్నామనే ప్రజాభిప్రాయం కూడా వారికి కనువిప్పు కల్పించలేక పోతుంది. పదేళ్ల టీఆర్ఎస్/బీఆర్ఎస్ పాలన అవినీతిమయం అని ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రజల ముందుంచింది. తోడిన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని అక్రమాలు బయట పడే విధంగా దర్యాప్తులు ముమ్మరమయ్యాయి. దోచుకోవడం, దాచుకోవడం అనే లక్ష్యంతోనే టీఆర్ఎస్/బీఆర్ఎస్ పాలన సాగిందనే విధంగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

ప్రజాధనం లూటీకే ప్రాధాన్యం

ప్రజల ఆకాంక్షలను కాలరాసి అక్రమ సంపాదనకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల తీరు రాష్ట్రమంతటా చర్చనీయాంశం అయింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, వనరుల సృష్టి అనే లక్ష్యాన్ని తమ పాలన సాగినంత కాలం బీఆర్ఎస్ నేతలు విస్మరించారు. ఉద్యోగ విరమణ పొందిన పలువురు సీనియర్ అధికారులను కీలక పదవుల్లో నియమించుకొని శాఖల వారిగా దోపిడీకి పాల్పడిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. ప్రజాధనం లూటీ చేసే పథకాలకే గత పాలకులు ప్రాధాన్యతనిచ్చారని తేటతెల్లమవుతుంది. బీఆర్ఎస్ స్వార్ధంతో వ్యవహరించి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. జనం నివ్వెరబోయే విధంగా అవినీతి, అక్రమాలు, బంధు ప్రీతి, పక్షపాతం లాంటి చర్యలు వెలుగుచూస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జనంలో తిరగలేక పోతున్నారు.

రెండోసారి అవకాశాన్నీ వమ్ముచేశారు

కేసీఆర్ ప్రభుత్వం తొలి ఐదేళ్ల పాలనపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలనే ఆకాంక్షతో మరో ఐదేళ్ల పాలనకుప్రజలు అవకాశం కల్పించారు. ఈ ఐదేళ్లలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారింది. నియంతృత్వం పెరిగింది. ప్రజల ఆకాంక్షల ఎజెండాను అమలు జరపాలనే లక్ష్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. రాజకీయంగా తమకెవరూ సాటికాదనే అహంకారంతో వ్యవహరించింది. సొంత ఆలోచనలతో వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. నిరర్ధక వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్ధ కునారిల్లింది. గొప్పల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసిందనే అపవాదును మూటగట్టుకుంది. ధరణి, కాళేశ్వరం, టీఎస్‌పీఎస్సీ, విద్యుత్ ఒప్పందాలు, 59 జీవో అక్రమ క్రమబద్దీకరణలు, భూదందాలు, చివరికి ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్ భూ సేకరణలో అక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే తవ్విన కొద్దీ అక్రమాలు, అవినీతి చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ ఒక్క వ్యవస్థా బాగుందని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది.

పాలనను గాడిలోపెట్టిన కొత్త ప్రభుత్వం

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై పార్టీ చేస్తున్న విమర్శలు తొందరపాటు చర్యలుగానే భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పరిపాలన వ్యవస్థను చక్కదిద్దుకుంటుంది. పారదర్శక పాలన అందించే తపనతో అడుగులు వేస్తుంది. మెరుగైన, సమర్ధవంతమైన పాలనకు దోహదపడే అధికార యంత్రాంగాన్ని గుర్తించి కీలక బాధ్యతలు అప్పగిస్తుంది. కేంద్రంతో సఖ్యతతో వ్యవహరించడానికి స్నేహ హస్తం అందిస్తున్నది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటుగా వనరుల సమీకరణ పై దృష్టి కేంద్రీకరించింది. పాలనా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం కల్పించింది. అర్జీలను సానుకూలంగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనిస్తోంది. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రజాపాలన సాగించాలనే సంకల్పంతో నిరంతరం సమీక్షలు జరుపుతూ, ఆదేశాలు జారీ చేస్తోంది. అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరచడానికి మంత్రివర్గ ఉప సంఘాలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమైంది.

కొలను వెంకటేశ్వర రెడ్డి

ఎస్పీ జైల్స్ ( రిటైర్డ్)

80960 95555

Advertisement

Next Story

Most Viewed