వంతెనలా.. పిచ్చుక గూళ్లా!

by Ravi |   ( Updated:2024-07-14 01:15:15.0  )
వంతెనలా.. పిచ్చుక గూళ్లా!
X

శతాబ్దాల కాలం నాడు రాజులు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తున్నాయి. ఆంగ్లేయుల పాలనలో నిర్మితమైన వంతెనలు అనేకం ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య పనులు పూర్తికాని వంతెన(బ్రిడ్జి)లు, ప్రారంభానికి సిద్ధమైన వంతెనలు, కొన్నాళ్ల క్రితం వినియోగంలోకి వచ్చినవి స్వల్ప కాలంలోనే పేక మేడల్లా.. పిచ్చుక గూళ్ల కంటే అధ్వాన్నంగా కూలిపోతున్న పరిస్థితి చూస్తుంటే.. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందట! అనే సామెతలా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగంలోకి వచ్చాక కూడా ఈ దుస్థితి పదే పదే పునరావృతం అవుతుందంటే? సాంకేతిక పరిజ్ఞాన లోపమా! అవినీతి చీడపీడా!! ఏదేమైనా ఇది దేశానికి తల వంపుగా మారుతుంది.

పేకమేడల్లా కులడానికి కారణం..

బిహార్ రాష్ట్రంలో వరుసగా పేకమేడల్లా పడిపోతున్న వంతెనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిర్మాణ నాణ్యతపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిర్మాణ సంస్థలు మాత్రం దీనికి ఇసుక తవ్వకాలు, నాణ్యతా లోపం కారణం అంటున్నారు. నదులపై వంతెనలు నిర్మించాక ప్రయాణం మార్గం దగ్గరై, కాలం ఆదా అవుతుంది. కానీ ఈ మధ్య వరుసగా హఠాత్తుగా కూలుతున్న వంతెనలను చూశాక, ఇప్పుడు ప్రజలు వంతెనని ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

ఇది బిహార్ రాష్ట్రంలోనే కాదు, కీలక మౌలిక సదుపాయాల విషయంలో దేశమంతా ఇదే అరాచకం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వాస్తవంగా నాణ్యంగా నిర్మాణం చేపట్టే పనిమంతులకు మన దేశాలు లోటు లేదు. ముఖ్యంగా వంతెనలు, ఫ్లైఓవర్లు వంటివి తరచూ పేకమెడల్లా కూలడానికి కారణం పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్ల నడుమ పెనవేసుకుపోయిన చీకటి బంధాలు సామాన్య జనానికి యమపాశాలవుతున్నాయి. అక్రమాలలో ఆరితేరిన అవినీతి బృందాలు నాసిరకం పనులతో వందల కోట్లు ప్రజా ధనాన్ని తుడిచిపెట్టుకుపోతున్నారు.

మనదేశంలోనే ఎందుకిలా..?

న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో బ్రిడ్జ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ గార్గ బృందం మన దేశంలో వంతెన(బ్రిడ్జి)లు కూలిపోతున్న వైనంపై కొంత కాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆ బృందం వంతెనలకు సమీపంలో ఉన్న నదుల్లో ఇసుకను విపరీతంగా తవ్వి తీయడం వల్ల వంతెన పునాదులు బలహీనపడుతున్నాయని, దానికి తోడు నిర్మాణ సమయంలో వినియోగించే మెటల్, ఇసుక, సిమెంట్ నాణ్యత లేకపోవడం వల్ల కూడా వంతెనలు కూలుతున్నాయని తేల్చారు. అంతేకాక ప్రాథమికంగా వంతెన నిర్మాణానికి ఇచ్చే డిజైన్‌కు, కట్టేటప్పుడు ఉన్న డిజైన్‌కు వ్యత్యాసాలు కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 1977 తర్వాత 40 ఏళ్లలో 2130 వంతెనలు కూలిపోయాయి. 2020-22 మధ్యకాలంలో జాతీయ రహదారుల మీద సగటున నెలకు ఒక బ్రిడ్జి చొప్పున కూలిపోయిందని కేంద్రమే మొన్న డిసెంబర్‌లో రాజ్యసభలో వెల్లడించింది. ఇటువంటి వార్తలు వినడమే తప్ప ఆయా నిర్మాణాల దుర్గతికి కారకులైన వారికి ఎప్పుడైనా శిక్షలు పడ్డాయా! ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప, తర్వాత ఎక్కడిక్కడ సర్ధుకుపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పులు చేసేవారికి చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో మరణశిక్షలు విధిస్తుంటారు. కానీ మన దగ్గరేమో వారిని పాలకులను చేసి మన నెత్తిన కూర్చోబెట్టుకుంటాం. ఈ దౌర్భాగ్యమే అన్ని రకాల అక్రమాలకు కారణమని భావిస్తున్నారు. ఈ రాజకీయ అవినీతిని పెంచిపోసినంత కాలం మన దేశం అభివృద్ధి చెందదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మేకిరి దామోదర్,

సామాజిక విశ్లేషకులు,

9573666650

Advertisement

Next Story

Most Viewed