- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరూ సమానమే
సూర్యుడు అలసిపోయి మెల్లమెల్లగా పడమటి తీరం జారుకుంటున్న వేళ. ఆవులమందలన్నీ ఇంటి దారి పడుతున్న వేళ. ఒక చిన్న పిల్లవాడు ఆరుబయట ఆడుకుంటూ కాలికి బండ తాకి కిందపడ్డాడు. బాధను భరించలేక అప్రయత్నంగానే అమ్మా అమ్మా అంటూ ఏడ్వసాగాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసు పనిలో విసిగివేసారి సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్త ఏమేవ్ కాఫీ అంటూ కుర్చీలో వాలాడు.
కాలేజీలో ఏవో కుర్రకారు వేషాలు, గొడవలతో విచారం పొదువుకున్న అన్నను చూసి ఏరా అన్నయ్య! ఏమైంది అలా దిగులుగా ఉన్నావు! అంటూ పక్కనే చేరి ఓదార్పుతో ఆప్యాయతను పంచిన ఒక చెల్లి. అనారోగ్య సమస్యలు,కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడిలో కూరుకుపోయిన తండ్రి చంకలో కెక్కి బుగ్గన ముద్దు పెట్టి బాధను మరిపించి ప్రేమను కురిపించిన ఓ చిట్టి తల్లి. ఇలా.... తల్లిగా, చెల్లిగా, ఆలిగా, బిడ్డగా మగవారితో విడదీయలేని అనుబంధం ఆమెది.
ఉదయమే లేచి ఇంటి పనంతా చేసి బాక్సులు సర్దుతుండగా, ఆఫీసుకు లేటవుతుందని అరిచే భర్తలెందరో. కూలి నాలి చేస్తూ ఇల్లు గడుపుతూ అవసరాలకై నాలుగు పైసలు దాచుకుంటే వాటిని సైతం దొంగిలించే మొగుళ్లెందరో. చిన్న పిల్లలను సైతం వదలక కామపు కోరలకు బలి చేస్తున్న మృగాలెందరో. ఇంటా బయటా పనిచేస్తూ ఆర్థికంగా చేయూతనిస్తున్నా అనుమానపు పెనుభూతం ఆవహించి అణగదొక్కుతున్న మగమహారాజులెందరో.
అలసట లేని ఆరాటం, సమాజంలో అస్తిత్వానికై నిరంతర పోరాటం, మగవాని మనసులో స్థానంకై ఎదురుచూపు, కామాంధుల కోరలకు చిక్కుకుంటామన్న భయం మహిళలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వెలకట్టలేని ప్రేమను అందిస్తూ విలువల జాడేలేని మగువలెందరో. జీవితమంతా క్రొవ్వొత్తిలా కరిగించినా వెలుగుదారులు చూడని మహిళలెందరో.
ఇంకా సమాజంలో స్త్రీ వెనకబడే ఉంది. అంతర్గతంగా హింసను, మానసిక వేదనను భరిస్తూనే ఉంది. అన్ని రంగాల్లో రాకెట్‌లా దూకుసుకుపోతున్నా...ఎక్కడో ఒకచోట అవమానం తప్పడం లేదు. ఎంతటి హోదాల్లో ఉన్నా మగవాని అణచివేత తప్పడం లేదు. ఉన్నత చదువులు చదివినా పురుషాధిక్యత తప్పడం లేదు.
నేటి తరంలో కొంతమార్పైతే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇద్దరూ ఉద్యోగం చేసే ఇంట్లో భర్త కొన్ని పనుల్లో సహకరిస్తూ ఉండటం చూస్తున్నాము. కానీ...ఇంకా మగవారి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆడవారిని చూసే వైఖరి మారాలి. ఇంటా బయటా ఆడవారికి విలువనివ్వాలి. ఇద్దరూ సమానమనే భావన బలంగా నాటుకోవాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమైనట్టు.
అయిత అనిత
కవయిత్రి