- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్వ మతప్రవక్తల సందేశం ఒక్కటే!
‘హెచ్చరిక చేసేవాడెవ్వడూ రాని జాతి జాదీ లేదు’ అని దివ్య ఖురాన్ ప్రవచిస్తుంది. మానవాళి అధర్మ మార్గంలో పయనించకుండా సన్మార్గంలో నడవడానికి ప్రవక్తలను పంపిస్తాడు. అలాంటి ప్రవక్తల పరంపర మహనీయ ముహమ్మద్(స) గారితో సమాప్తమైందని ముస్లిముల విశ్వాసం. ఇలాంటి మహనీయుల రాక గురించి వివిధ మత ధార్మిక గ్రంథాల భవిష్య వాణులు మనకు వివరిస్తాయి. వాటిలో చెప్పిన దైవ దూత లేదా దైవ ప్రవక్త లక్షణాలు ముహమ్మద్(స)లో ఉన్నాయన్న విషయాన్ని ‘భారతీయ ధార్మిక గ్రంధాలలో మహనీయ ముహమ్మద్(స)’ పుస్తకం ఉదాహరణ సహితంగా మనకు వివరిస్తుంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేసింది.
వేదాల్లో పేర్కొన్న ‘నరాషన్స్’ అన్న పదానికి ప్రశంసించబడిన మానవుడు అని అర్థం వస్తుంది. ముహమ్మద్ అనే పదానికీ అదే అర్థం వస్తుంది. వేదాల్లో పేర్కొన్న నరాషన్స్‌కు ఉన్న ఉత్తమ గుణాలన్నీ ముహమ్మద్(స)లో ఉన్నాయి. ప్రపంచంలో క్రూరత్వం వ్యాపించి, పాపాలు పెరిగిపోయినప్పుడు కల్కి అవతరించి దుష్టుల్ని అణచి వేస్తారని హిందువుల నమ్మకం. ఏడో శతాబ్దం ప్రారంభంలో అరబ్ ప్రాంతంలో అలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ముహమ్మద్(స) ఈ భూమిపై అవతరించి ధర్మ పరిరక్షణ చేశారు. అంటే ముహమ్మద్(స) నరాషన్స్‌కు ప్రతిరూపమని ఈ పుస్తకం వివరిస్తుంది. భాగవతం, మహా భారతంలో పేర్కొన్న కల్కి అవతారానికి ఉండే జ్ఞానం, ఆత్మనిగ్రహం, పరాక్రమం, దాతృత్వం మొదలైన దైవ ప్రసాదిత గుణాలు ముహమ్మద్(స)లో ఉన్న విషయాన్ని ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. వేదాల్లో చెప్పిన సత్యం ఒక్కటే, ఏకేశ్వరోపాసనను ముహమ్మద్(స) కూడా ప్రచారం చేశారని ఈ పుస్తకం చక్కని పోలికను చూపుతుంది.
అన్ని మతాలు ఒక్కటేనని..
దేవుడు సర్వ విశ్వాన్ని పోషిస్తాడని, రుషులందరినీ ఆయనే పంపిస్తాడని అల్లోపనిషత్తులో చెప్పారు. ముహమ్మద్(స) అల్లాహ్ పంపిన దైవ సందేశహరుడనేది మనకు తెలిసిందే. దీన్ని బట్టి ఉపనిషత్తుల్లోనూ ముహమ్మద్(స) గురించి ప్రస్తావించారని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఇక గౌతమ బుద్ధుడు తన లాంటి మైత్రేయ్ బుద్ధుడు భవిష్యత్తులో అవతరిస్తాడని చెప్పాడు. ఆ మైత్రేయ్ బుద్ధుడిలోని కొన్ని ప్రముఖ లక్షణాలకు ముహమ్మద్(స)కు ఉన్న లక్షణాలకు సారూప్యత ఉన్నదని ఈ పుస్తకం...ఆ లక్షణాలను వివరించింది. క్రీస్తు పూర్వం 571లో మహావీరుడి నిర్వాణనంతరం వెయ్యి సంవత్సరాల తర్వాత కల్కి అవతరిస్తాడు అని జైన మత గ్రంథాల్లో రాసి ఉంది. ఆ ప్రకారం చూస్తే మహావీరుడు చనిపోయిన వెయ్యి సంవత్సరాలకు ముహమ్మద్(స) పుట్టారు. అంటే జైన గ్రంథాలు చెప్పే కల్కి కూడా ముహమ్మద్(స)నే అయి ఉండొచ్చు. ఇలా వివిధ మతాల్లో దైవ దూతలకు సంబంధించిన సద్గుణాలకు, ముహమ్మద్(స)లో ఉన్న సద్గుణాలకు సారూప్యత ఉన్నదన్న వాస్తవాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. చివరగా సర్వ మత ప్రవక్తల సందేశం ఒక్కటేనని, మానవులు ముహమ్మద్(స) హిత బోధనలను, ఆదేశాలను ఆచరిస్తూ సత్య మార్గంలో జీవించాలన్న సందేశాన్ని ఈ పుస్తకం మనకు అందిస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లో మహనీయ ముహమ్మద్ (సల్లాల్లాహు అలైహి వసల్ల) పుస్తకం రచించింది డాక్టర్ ఎం.ఎ శ్రీవాస్తన్. అనువాదం చేసింది అబుల్ ఫౌజాన్. ఈ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ పుస్తకం కోసం సంప్రదించండి 1800 572 3000
ముహమ్మద్ ముజాహిద్,
96406 22076