హర్యానాలో బీజేపీ హ్యా‌ట్రిక్

by Ravi |   ( Updated:2024-10-09 01:15:48.0  )
హర్యానాలో బీజేపీ హ్యా‌ట్రిక్
X

దేశ ప్రజలు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయాలు అబద్ధాలుగా తేలాయి. హర్యానాలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, జమ్మూ కశ్మీర్లో హంగ్ ఏర్పడుతుందని చెప్పిన విషయాలు తలకిందులు అయ్యాయి.

హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారానికి రావ డం మామూలు విషయం కాదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక రాష్ట్రంలో మూడో సారి ఒకే పార్టీ అధికారం చేపట్టడం ఆషామాషీ విషయం కాదు. బీజేపీ ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ 90 సీట్లకు గాను 50 సీట్లు సాధిం చడం, కాంగ్రెస్ పార్టీ 35 సీట్లకు పరిమితం కావడం, ఐఎన్ఎల్‌డీ, జేజేపి, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రభావం చూపలేకపోవడం రాజకీయ పరిశీలకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. జాట్లు, రైతు, రెజ్లర్, దళిత్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

క్షేత్ర వాస్తవాల అంచనాలో వైఫల్యం

కాంగ్రెసులోని గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని కొంపముంచాయంటే అతిశయోక్తి కాదేమో! కాంగ్రెస్ గెలిస్తే తనను ముఖ్యమంత్రి చేయాలని కుమారి షెల్జా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడం, ఈ విషయంపై పత్రి కల ముందు మాట్లాడడం హర్యానా ఓటర్లను కన్ఫ్యూజన్‌కు గురి చేసింది. హర్యానాకు పక్కన ఉండే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ పది ఉచిత హామీలు ఇచ్చి, కొన్నింటిని మాత్రమే నెరవేర్చడం, నెరవేర్చిన ఉచిత హామీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వంటివి హర్యానా ఓటర్ల పైన కొంత ప్రభావం చూపి ఉండవచ్చు! దళిత ఓటు కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్‌ఫర్ అవుతుందని, ఈ ఎన్నికలలో విజయం తమదేనని కాంగ్రెస్ నాయకులు ధీమాతో ఉండిపోయారు తప్ప గ్రౌండ్ లెవెల్‌లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం బీజేపీకి అన్ని విధాల సహాయ సహకారాలను అందించింది. ఈ పనిని చాలా వ్యూహాత్మకంగా ఆ సంస్థ చేసింది. రైతు ఉద్యమం వెనక, జాతి వ్యతిరేక శక్తులు, ఖలి స్తాన్ ఉద్యమ కారులు ఉన్నారని, ఈ ఉద్యమం దారి తప్పిందని, కాంగ్రెస్ గెలిస్తే, జాట్ నాయకుల పెత్తనం నిమ్న వర్గాలపై బలీయంగా పనిచేస్తుందని, క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు చెప్పిన విషయాలు హర్యానా ఓటర్లపై కొంత ప్రభావం చూపించినట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

కశ్మీర్ ఫలితాలు ఊహించినవే కానీ...

ఇక జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధిస్తుందని జాతీయవాద రాజకీయ విశ్లేషకులు ముందే తెలియజేశారు. ఈ కూటమి 52 సీట్లు సాధించడం గొప్ప విశేషం ఏమి కాదు. వాస్తవంగా ఆ రాష్ట్రంలో బీజేపీకి 27 సీట్లు రావడం అనూహ్యమే! ఈ రాష్ట్రంలో జాతీయ వాద భావజాలం ఉన్న ఓటర్లు అందరూ బీజేపీ వైపు ఉన్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇస్లామిక్ మతోన్మాదం కాంగ్రెస్ కూటమి వైపు నిలవగా, హిందుత్వ వాదం బీజేపీ వైపు నిలిచినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని కూటమి నాయకులు చెప్పిన మాటలు ముస్లిం ఓటర్లను పోలరైజ్ చేసినట్లు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో పీడీపీ రెండు సీట్లతో సరిపెట్టుకోవడం జిహాదీ ఉగ్రవాదాన్ని సమర్థించే వారికి నిరుత్సాహం కలిగించిందని చెప్పాలి. ఇక చివరగా హర్యానాలో బీజేపీ సాధించిన అనూహ్య విజయం త్వరలో జరగబోవు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కొంత ప్రభావాన్ని చూపవచ్చు! సిద్ధాంత బలం, మాతృ సంస్థ ఆలోచనలు బీజేపీకి భవిష్యత్తులో మరింత బలాన్ని ఇస్తాయనేది వాస్తవం కాకపోదు.

ఉల్లి బాలరంగయ్య

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Advertisement

Next Story