నిలిచి గెలిచింది.. కమలం విరిసింది

by Ravi |   ( Updated:2024-10-09 00:45:38.0  )
నిలిచి గెలిచింది.. కమలం విరిసింది
X

రైతు చట్టాల వ్యతిరేక నిరసనలు, రెజ్లర్స్ ఆందోళనలు ఈ సారి బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తాయని భావించినా అవన్నీ బీజేపీపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రజలు కమల దళానికే జై కొట్టారు. జాట్ల ప్రాబల్యం కూడా మోడీ చరిష్మా ముందు వెలవెలబోయింది దీర్ఘకాలం పరిపాలించిన పార్టీ ప్రజావ్యతిరేకత చవిచూస్తుందనే ఆనవాయితీని మారుస్తూ హర్యానా ఓటర్ విలక్షణమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఓట్ల శాతం పెంచుకుంది. అదే సమయంలో బీజేపీ అన్ని ప్రాంతాల్లో తన ఉనికిని కాపాడుకుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కూటమి గ్రామీణ ప్రాంతాల్లో తన ఓట్ల వాటాను గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఎన్నికల ఫలితా ల విశ్లేషణ చూపిస్తుంది. జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వంటి పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. మొత్తం శ్రామిక శక్తిలో 65% కంటే ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్న స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో 40.2% ఓట్లను సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ 18 శాతం పెరిగింది. సాగుదారులు, వ్యవసాయ కార్మికుల వాటా 50-65% మధ్య ఉన్న స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 2019 ఎన్నికలతో పోలిస్తే 10 శాతానికి పైగా లాభపడింది.

ఓట్ల వాటాను నిలుపుకున్న కమలం

ఇదిలా ఉంటే, కొన్ని సందర్భాల్లో స్వల్ప పెరుగుదలతో, అన్ని రకాల సీట్లలో బీజేపీ తన ఓట్ల వాటాను విజయవంతంగా నిలుపుకుంది. హర్యానాలో బీజేపీ పట్ల జాట్‌లలో పెరుగుతున్న అసంతృప్తితో, 2014, 2019 ఎన్నికల్లో అధికారాన్ని పొందేం దుకు పార్టీ వ్యూహాత్మకంగా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని అహిర్వాల్ బెల్ట్‌పై ఆధారపడింది. గుర్గావ్, రేవారి, మహేందర్‌గఢ్‌లను కలిగి ఉన్న ఈ ప్రాంతం 2014 నుండి బీజేపీ బలమైన కోటగా ఉంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గురుగ్రామ్, రోహ్‌తక్, భివానీ-మహేందర్‌గఢ్‌లోని 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. అహిర్వాల్ బెల్ట్, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు-గుర్గావ్, రేవారీ, ఫరీదాబాద్, భివానీ-మహేందర్‌గఢ్- రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 28 స్థానాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని ఓటర్లలో 60% కంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

బీజేపీకి సహకరించిన అంశాలు..

వరుసగా మూడోసారి అద్భుతమైన పునరాగమనం చేస్తున్న కాషాయ పార్టీకి కొన్ని అంశాలు సహకరించాయి. అవి ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి మోడీ రాష్ట్రంలో 14 ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత, హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత పాలనను నిర్ధారించడానికి తీసుకున్న నిర్ణయాల పరంపర ఓటర్లలో విశ్వాసాన్ని పెంచింది. కేంద్రం తీసుకున్న వరుస రైతు అనుకూల చర్యలు దోహదపడ్డాయి. అగ్నివీర్ పథకం ఆందోళనలను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అధికార వ్యతిరేకత, ఓటర్ల అలసత్వం, నిరుత్సాహానికి గురైన యువకులు, కోపోద్రిక్తులైన రైతుల కారణంగా బీజేపీకి జననాయక్ జనతా పార్టీ (జెజెపి)తో ఉన్న పొత్తు విచ్ఛిన్నం కావడానికి దారితీసింది. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించారు. 70 రోజులపాటు అధికారంలో ఉన్న సైనీ ప్రభుత్వం తీసుకున్న 126 నిర్ణయాల పరంపర బీజేపీకి మరింత సహాయపడింది.

సైని 200 రోజుల పాలనలో..

జూలై 16న మహేంద్రగఢ్‌లో జరిగిన వెనుకబడిన తరగతుల సమ్మాన్ సమ్మేళన్ సందర్భంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్యానా ఇతర వెనుకబడిన తరగతుల క్రీమీలేయర్ అని పిలవబడే పరిమితిని ₹6 లక్షల నుండి ₹8 లక్షలకు పెంచటం. రాష్ట్ర జనాభాలో మూడో వంతులోపు ఉన్న బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హర్యానా ప్రభుత్వం స్థానిక పరిపాలనా సంస్థల్లో బీసీలకు చెందిన గ్రూప్-ఎ, గ్రూప్- బీలకు రిజర్వేషన్లను పెంచింది. గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టుల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్లను 27%కి పెంచుతున్నట్లు సైనీ చేసిన ప్రకటన సానుకూల ఫలితాలను ఇచ్చాయి. అలాగే మాజీ సీఎం ఖట్టర్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సర్దు బాటు చేయడం ద్వారా ప్రభుత్వం సరైన దిద్దుబాటులో ఉందని స్పష్టంగా సందేశం పంపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో లభించే రిజర్వేషన్ పెంపుదల నిర్ణయం లబ్దిదారులపై ప్రభావం చూపింది. లోక్‌సభ తీర్పు తర్వాత ప్రభుత్వం మేల్కొని వాస్తవాలను గ్రహించింది. ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసిన జంట ప్రధాన పథకాలైన పరివార్ పెహచాన్ పత్ర. ఆస్తి డీడ్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రభంజనం బీజేపీకి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సహాయపడింది. ఆమిత్ షా వ్యూహం మోడీ ప్రచారం సకాలంలో దిద్దుబాటు చర్యలు వెరిసి బీజేపీకి అధికారాన్నీ కట్టబెట్టాయి. సమిష్టి కృషికి ఇదే తార్కాణం.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story