- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌కు పోటీ బీజేపీయే!
విజ్ఞులైన తెలంగాణ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తామని తెలంగాణ ప్రజలు చెప్పడం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి ఇప్పట్లో బీఆర్‌ఎస్ కోలుకొనే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మాత్రమే స్థిరమైన పార్టీగా ప్రజల ముందు నిలబడి, తెలంగాణలో అనూహ్యమైన ఫలితాలను సాధించే అవకాశాలున్నాయి.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో గెలిచిన బీజేపీ తెలంగాణలో కూడా ప్రత్యర్థి పార్టీలకు ఆందోళన కలిగించే ఫలితాలను సాధించింది. కే.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బొటాబొటి ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలే గెల్చినా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారబోతోందని, భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషించబోతోందని అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణలో తిరుగులేని శక్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు, బీఆర్‌ఎస్ ఘోర పరాజయంపై చర్చిస్తున్న సమయంలో బీజేపీ సాధించిన ఫలితాలు కూడా తక్కువేమీ కాదు. బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాతం ఓట్లతో ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఈ సారి మాత్రం దాదాపు 14 శాతం ఓట్లతో 8 స్థానాలు సాధించింది. గోషామహల్ స్థానాన్ని నిలుపుకోవడంతో పాటు సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మంట్లను గెలిచింది.
బీజేపీ తరఫున పోటీ చేసిన రాజాసింగ్ గోషామహల్‌లో 54.08 శాతం ఓట్లు సాధించి 21,457 మెజార్టీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్‌బాబు 34.09 శాతం ఓట్లతో 3,088 మెజార్టీ, ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ 35.84 శాతం ఓట్లతో 6,692 మెజార్టీ, ముధోల్‌లో రామారావు పవార్ 48.59 శాతం ఓట్లతో 23,999 మెజార్టీ, నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి 54.03 శాతం ఓట్లతో 50,703 మెజారిటీ, ఆర్మూర్‌లో పైడి రాకేష్‌రెడ్డి 44.9 శాతం ఓట్లతో 29,669 మెజార్టీ, నిజామాబాద్ అర్బన్‌లో ధన్‌పాల్ సూర్యనారాయణ 40.82 శాతం ఓట్లతో 15,387 మెజార్టీతో గెలిచారు. కామరెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి (కేవీఆర్) గెలుపు ప్రత్యేకమైంది. ఇక్కడ ఈయన 6,741 మెజార్టీతో ఇద్దరు బలమైన అభ్యర్థులైన కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడిరచి ‘జెయింట్ కిల్లర్’గా అవతరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. కామారెడ్డిలో కేవిఆర్ 66,652 ఓట్లు (34.55 శాతం), కేసీఆర్ 59,911 ఓట్లు (31.06 శాతం), రేవంత్ 54,916 ఓట్లు (28.47 శాతం) సాధించారు.
అందుకే ఒక్క సీటూ గెలవలేదు
బీజేపీ రాష్ట్రంలో 8 స్థానాల్లో గెలవడంతోపాటు బోథ్, మంచిర్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, దుబ్బాక, గజ్వేల్, కుత్భుల్లాపూర్, లాల్ బహదూర్ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, సనత్‌నగర్, కార్వాన్, చార్మినార్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, కల్వకుర్తి, వరంగల్ తూర్పు, ఖానాపూర్, బోధన్, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, వేములవాడ, మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ముషీరాబాద్, మలక్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మక్తల్, సూర్యాపేట, పరకాల, వరంగల్ వెస్ట్ ల తోపాటు మరో 19 స్థానాల్లో బీజేపీ డిపాజిట్‌ను కాపాడుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ గోషామహల్ మాత్రమే గెలిచినా, ఇతర అన్ని నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇచ్చినట్లు ఓట్ల వివరాలు వెల్లడి చేస్తున్నాయి. బీజేపీ నుండి బలమైన అభ్యర్థులు పోటీలో ఉండటం కారణంగానే కాంగ్రెస్ గ్రేటర్‌లో ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. బీజేపీ మద్దతుతో కూకట్‌పల్లిలో పోటీచేసిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ 39,830 (15.88 శాతం) ఓట్లు సాధించారు.
2018 ఎన్నికల్లో గోషామహల్‌లో మాత్రమే గెలిచిన బీజేపీ 102 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. దీంతో 2023 ఎన్నికల్లో కూడా బీజేపీ 100కు పైగా స్థానాలలో డిపాజిట్ కోల్పోతుందని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. అయితే వీరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 8 స్థానాల్లో గెలిచి, 37 స్థానాలలో డిపాజిట్ పొందగలిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 19.65 శాతం ఓట్లను సాధించిన బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ప్రధాన పోటీదారు బీజేపీనే..!
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా 2019 లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ప్రధానమైన పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో డబల్ డిజిట్ సీట్లు గెల్చుకుంటామనే భరోసాను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల నుండి ప్రజలు నరేంద్ర మోదీకే మద్దతిస్తునట్లు ప్రతి సర్వేలో వెల్లడవుతోంది. మోదీ చరిష్మాతోనే బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బలహీనపడడం, బీజేపీ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందకపోవడంతో బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన పోటీదారుడిగా నిలవబోతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా విశేషంగా కృషి చేస్తోంది. ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం, సాగునీరు- తాగునీటి వసతుల కల్పనకు, విద్యుత్ ఉత్పాదనకు, ఎరువుల కర్మాగారం పునప్రారంభం వంటి ప్రాజెక్టులకు సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల మేరకు కేంద్రం కేటాయించింది. సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలు పర్చిన అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను దాదాపుగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టడం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెబుతున్నారు. అప్పులమయంగా మారిన తెలంగాణాలో అభివృద్ధి గాడిన పడాలన్నా, ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా కేంద్రంలో తిరిగి మోదీ ప్రభుత్వం ఏర్పడటం తప్పనిసరి.
లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తారా?
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీల అమలు కోసం కిందామీదా పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలను గందరగోళం పరుస్తోంది. ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో ముందు దరఖాస్తులు ఇవ్వండి, తర్వాత చూస్తాం అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ హామీల అమలుకు అవసరమైన వనరులను ఏ విధంగా సమకూర్చుకుంటారో రేవంత్ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. లక్షలాది మంది రేషన్ కార్డులు లేకుండా ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంపై స్పష్టత లేకుండా, రేషన్ కార్డు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియ చేపట్టింది. దీంతో రేవంత్ ప్రభుత్వం కుంటిసాకులతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని స్పష్టమవుతోంది. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధపడటం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు ఆ పార్టీలో మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయి. ఈ పరిణామాల మధ్య రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మాత్రమే స్థిరమైన పార్టీగా ప్రజల ముందు నిలబడి, తెలంగాణలో అనూహ్యమైన ఫలితాలను సాధించే అవకాశాలున్నాయి.
- బండి సంజయ్ కుమార్,
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.