మీ జిమ్మిక్కులకు ఓట్లు రాలవు!

by Ravi |   ( Updated:2023-09-24 01:01:24.0  )
మీ జిమ్మిక్కులకు ఓట్లు రాలవు!
X

ఢిల్లీ నుంచి పావులు కదిపే పార్టీలకు జనం సమస్యలు ఎక్కడ అర్థమవుతాయి? జాతీయ పార్టీలంటేనే.. సీల్డు కవర్లు, లాబీయింగ్​లు అనే ముద్రపడేలా చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు​. తెలంగాణలో అధికారం కోసం చూస్తున్న ఈ పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘ఒక్క చాన్స్‌’ అంటూ కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు హామీల గ్యారంటీ కార్డు నమ్మశక్యంగా లేదు. కర్నాటకలో ఐదు హామీలు ఇస్తే గెలిచామని, ఆ పార్టీ ఇక్కడ మరో హామీ కలిపి ఆరు హామీలు ఇచ్చి గెలిచేసినట్టేనని అనుకుంటున్నది. అయితే కర్నాటకలో ఐదు హామీలిచ్చి గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలు కర్నాటకలో ఏం జరుగుతున్నదనే దానిపై నిశితంగా గమనిస్తున్నారన్న విషయం మర్చిపోయారు.

కర్నాటకలో తెలంగాణ వలె సాగునీళ్లు లేవు, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ లేదు. కనీసం రేషన్​ బియ్యం కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నది. ‘అన్నభాగ్య’ పథకం కింద పేద కుటుంబాలకు ఐదేసి కిలోల చొప్పున బియ్యం ఇవ్వలేక కిలోకు రూ.34 చొప్పున డబ్బు లెక్క కట్టిస్తున్నది. పైగా ఎన్నికల ముందు ఇచ్చిన మిగతా హామీలు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. అక్కడ బీజేపీపై వ్యతిరేకత పెరిగి ప్రత్యామ్నయం లేక ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, గెలిచాక హామిలు అమలుచేయలేక కష్టాలు పడతుంది. కర్నాటక గెలుపు వాపును చూసుకొని.. బలుపు అని భ్రమపడి తెలంగాణలోనూ విజయం సాధిస్తామని పగటి కలలు కంటున్నది.

ఆ హామీలకు బడ్జెట్ ఏది?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొన్నటి దాకా డిక్లరేషన్ల పాట పాడిన హస్తం పార్టీ.. ఇప్పుడు అలవికాని హామీల దస్త్రం దుమ్ము దులిపింది. కర్నాటకలో ఇచ్చిన ఐదు హమీల తరహాలోనే ‘సిక్స్ గ్యారెంటీస్’ పేరుతో తెలంగాణ ఓటర్లకు వల వేస్తున్నది. వాటికి ​ ‘గ్యారెంటీస్’ అని పేరుపెట్టినా.. వాటిలో ఉన్నవి కొత్తవేమీ కావు. ఇదివరకే తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నవే! వాటిని వేలం పాట తరహాలో ఇంకొంచెం పెంచి ఇస్తామని అంటున్నది. పింఛన్‌ రూ.2500కు పెంచుతాననడం, రైతుబంధు రూ.15 వేలు ఇస్తాననడం తెలంగాణలో అమలులో ఉన్న పథకాలను కాపీ కొట్టి నగదు మొత్తం పెంచడమే కదా! ఒక అంచనా ప్రకారం కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారెంటీ హామీలకు లెక్కగడితే.. దాదాపు రూ.2.90 లక్షల కోట్లు కావాలి. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమే. రాష్ట్ర బడ్జెట్​ మొత్తం ఆరు హామీలకే పోతే.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఎవరికీ అంతుపట్టని చిదంబర రహస్యమే.

ఆ హామీలన్నీ.. అమలు చేశాం!

కర్ణాటకలో కాంగ్రెస్​కు అప్రయత్నంగా దక్కిన విజయాన్ని చూసి, తెలంగాణ కాంగ్రెస్​ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి వేరు కర్నాటక వేరు. అక్కడి బీజేపీ ప్రభుత్వ ఏలుబడి.. తెలంగాణ పాలనతో పోల్చలేం. అధికార పార్టీపై కన్నడ ప్రజలకు ఉన్నంత ప్రజావ్యతిరేకత తెలంగాణలో ఎక్కడున్నది? కాంగ్రెస్​ పార్టీ కర్నాటకలో ఎన్నికల్లో రావడానికి అక్కడ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలే. అయితే వాటిలో 70 శాతానికి పైగా ఇప్పటికే తెలంగాణలో ప్రతి ఇంటికి చేరిన విషయం తెలంగాణ కాంగ్రెస్​ నేతలు సోయితెచ్చుకొని చూడాలి. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గృహ జ్యోతి(200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ప్రతి కుటుంబంలోని మహిళకు రూ.2000), అన్న భాగ్య(బీపీఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహార ధాన్యాలు), యువ నిధి (నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు), శక్తి(మహిళలకు ఉచిత బస్సు రవాణా) ఈ ఐదు అంశాలతోపాటు నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్ ఇస్తామని తెలిపింది. మిల్క్ క్రాంతి పథకం కింద.. రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తికి చర్యలు, రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతామని తెలిపింది.

కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు కర్నాటక మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్​ ప్రస్తావన పెట్టింది కానీ.. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్​ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే! దీనిద్వారా 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రత్యేకంగా ఆలోచిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన కులాల అభివృద్ధికి.. వారు కొనసాగిస్తున్న వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ, గొల్ల కురుమల కోసం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నది. సంప్రదాయ కులవృత్తులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌‌ను అందజేస్తున్నది. నాయీబ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్‌కటింగ్‌ సెలూన్లు, రజకులు నిర్వహిస్తున్న లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తున్నది. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తో పాటు పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను తెలంగాణకు ఆహ్వానించి నిరుద్యోగ యువతకు రికార్డు స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కర్నాటకలో కాంగ్రెస్​ ఇస్తానన్న పాల సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రోత్సాహకరంగా ఇస్తున్నది. ఇక పోలీసులకు ప్రత్యేక అలవెన్స్​ల విషయానికొస్తే.. తెలంగాణలో అన్ని శాఖల ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ప్రత్యేకించి ట్రాఫిక్​ పోలీసులకు దేశంలోనే అత్యధిక ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్​ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇలా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కేసీఆర్​ పథకం చేరింది. ప్రతి వ్యక్తి ప్రభుత్వ లబ్ధిదారే.

అభివృద్ధిపై చర్చకు రారెందుకు?

నాలుగు చోట్ల గెలిచి.. రాష్ట్రాన్ని గెలిచినట్లుగా భావిస్తున్న కాషాయ పార్టీది మరో రకమైన పరిస్థితి. డబుల్​ ఇంజన్​ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని చెబుతున్న బీజేపీ పెద్దలు.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఏమిటనే దానిపై చర్చకు రమ్మంటే రారు. వారి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉచిత కరెంట్​, కనీసం తాగునీళ్లు లేని పరిస్థితి. గ్రూపులు, కుమ్ములాటలు గల బీజేపీ అసమర్థ నాయకత్వాన్ని, ఢిల్లీ గులాములను తెలంగాణ ప్రజలు ససేమిరా ఒప్పుకోరు. కర్నాటకతో కాషాయ పార్టీ పతనం మొదలైంది. కేవలం ఢిల్లీ కాషాయ పెద్దలకు నచ్చలేదని కర్నాటకలో బీజేపీ సీనియర్​ నాయకుడిని సీఎం కుర్చీ నుంచి దించిన బీజేపీ.. మరో అసమర్థ, అవినీతి నేత అయిన బసవరాజ్​ బొమ్మైని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆయన ప్రజాపాలనను గాలికొదిలేసి అవినీతి, కమీషన్లు.. హిజాబ్, అలాల్​ లాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పైగా గుజరాత్​ నుంచి అమూల్​పాలను తీసుకొచ్చి రాష్ట్ర సర్కారు యాజమాన్యంలో నడిచే నందిని పాల వ్యవస్థను ధ్వంసం చేద్దామనుకుంటే.. కన్నడిగులు చైతన్యవంతంగా పోరాడి అడ్డుకోగలిగారు. సంక్షేమం, అభివృద్ధి లేకుండా కేవలం 300 లింగాయత్​ మఠాలను నమ్ముకున్న బీజేపీకి సరైన గుణపాఠం నేర్పారు కన్నడ ప్రజలు. కెంపెగౌడ విగ్రహం పెట్టించిన సర్కారు.. బెంగళూరు వరదలను నివారించలేకపోయింది. మాటలకు, జిమ్మిక్కులకు ఓట్లు రాలే కాలం పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక్క స్థావరం కోల్పోయిన బీజేపీ త్వరలో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లోనూ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకపోవడం గ్యారంటీ.

బచ్చు శ్రీనివాస్,

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,

93483 11117

Advertisement

Next Story