వర్షాలు... ప్రాణగండాలు

by Ravi |   ( Updated:2023-07-26 23:00:08.0  )
వర్షాలు... ప్రాణగండాలు
X

దేశవ్యాప్తంగా వర్షాలు ఆరంభమయ్యాయి. దీంతో ఏ పని ప్రారంభించాలన్నా అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయి. విద్యుత్ స్తంభాలతో ప్రమాదాలు జరుగుతాయి. ఏదో చోట విద్యుదాఘాతాలు సంభవిస్తుంటాయి. వాన నీటిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు, కరెంటు స్తంభాలు అనుకోకుండా తాకినప్పుడు, విద్యుత్ తీగల కింద నిల్చునప్పుడు తెగిపడి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇందులో జనం నిర్లక్ష్యం, అశ్రద్ధ, చిన్నపిల్లల ఆటలు, తప్పిదాలు, ఇతర కారణాలతో అవి ప్రాణాలు బలి తీసుకునే యమపాశాలవుతున్నాయి.

వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తూ తాకిన మహిళ సాక్షి అహుజా(34) ఢిల్లీలో మృత్యువాత పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలం మచ్కల్ గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ చేన్లో సాగు చేసిన వేరుశనగ పంటకు అడవి జంతువుల నుంచి రక్షణ కంచె వేయించాడు. అయితే బోరు బావిల కనెక్షన్ కోసం వేసిన విద్యుత్ స్తంభం గాలి, వానకు కూలి పై ఆ విద్యుత్ తీగలు పక్కనే ఉన్న కంచెపై పడ్డాయి. ఆ పంటలోకి రైతు వెళ్లడానికి ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. జూన్‌లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌ కు చెందిన ఒక పశువుల కాపరి విద్యుత్‌ స్తంభానికి ఉన్న స్టే వైర్‌పై కరెంట్ సరఫరా అవుతున్న వైరు తెగి పడింది. అతనికి అది తెలియక స్టే వైరుకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

ఇలాంటి దుర్ఘటనలు వర్షాకాలంలో ఎన్నో జరుగుతాయి. అప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉంటేనే మంచిది. వానాకాలంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి సలహాలు, సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలి. అందులో భాగంగా విద్యుత్ స్తంబాలు, పడిపోయిన కరెంటు తీగలకు దూరంగా ఉండాలి. ప్రవహిస్తున్న నీరు, కాలువలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయొద్దు. చెట్ల కింద, పాత గోడలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ వరదనీటిలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలి. ప్రమాద సమయంలో పోలీసుల సాయం కోసం 100కు ఫోన్ చేయాలి.

- తలారి గణేష్

99480 26058

Advertisement

Next Story