- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యుద్ధం కలిపిన ప్రేమ కథ బవాల్
యుద్ధంతో రాసిన ప్రేమకథ అని గత ఏడాది తెలుగులో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'సీతారామం' విమర్శలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కుల సమస్యను రెండో ప్రపంచ యుద్ధంతో ముడిపెట్టి క్రిష్ కొన్నేళ్ల క్రితం తీసిన కంచె సినిమా కూడా చాలా మందిని ఆకర్షించింది. లక్షలాది మంది ప్రజల, సైనికుల ప్రాణాలు హరించే యుద్ధంలో కమర్షియల్ ఎలిమెంట్ ఉందని దాన్ని ప్రేమ ఇతి వృత్తంతో కలిపి తీస్తే హిట్లు సాధించవచ్చని భారతీయ చిత్ర పరిశ్రమ అనుభవంలోకి మళ్లీ కొత్తగా వచ్చినట్లుంది. (హిందీలో రాజ్ కపూర్ అయిదు దశాబ్దాలకు ముందు తీసిన 'సంగమ్' సినిమా మనకు గుర్తుంది) ఈ కోవలో వచ్చిన తాజా హిందీ సినిమా బవాల్ (Bawaal). ఎక్కడ భార్యా భర్తల మధ్య జగడం, ఎక్కడ రెండో ప్రపంచ యుద్ధం.. వ్యక్తిగత అంశాన్ని సామాజిక అంశంతో ముడిపెట్టి తీసిన బవాల్ అన్ని భాషల్లో నేరుగా ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్ వీడియో) వచ్చింది. పైగా ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో విడుదలై హిందీ సినిమా మార్కెట్ శక్తిని కూడా విజయవంతంగా నిరూపించుకుంది. ఇది యుద్ధ నేపథ్యం కలిపిన ప్రేమ కథ. అత్యాశకు పోతే నాజీ హిట్లర్ జీవితం ఏమైందన్న పాయింట్‌నే ప్రధానంగా చూపిస్తూ అల్లుకున్న సాదా సీదా రొమాంటిక్ డ్రామా బవాల్. ‘దంగల్’, ‘ఛిఛోరే’వంటి హిట్ సినిమాలను అందించిన నితేశ్ తివారీ.. ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేపుతూనే, విమర్శకుల కలాలకు పదును పెడుతూనే ‘బవాల్’ విషయంలోనూ పాజిటివ్ మార్కులే కొట్టేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అసంబద్ధతకు, రెండో ప్రపంచ యుద్ధ నేపధ్య అద్భుతానికి మధ్య సాగిన ఊహాత్మక కల్పనా చిత్రం బవాల్. ఈ సినిమా అటు క్లాస్ కాదు.. ఇటు మాస్ కూడా కాదు. అన్ని మసాలాలూ సమపాళ్లలో కలిపి ప్రేక్షకులపై విసిరిన యుద్ధం విప్పిన ప్రేమకథ. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో ఏర్పడిన సంక్షోభానికి యూరప్ పర్యటనను పరిష్కార మార్గంగా ఎన్నుకుని లక్నోలోని ఒక సాదాసీదా హిస్టరీ టీచర్ సాగించిన విదేశీ యాత్రా చిత్రమిది. దాంపత్య బంధాన్ని నిలబెట్టడానికి యూరోపియన్ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని పదేపదే ఉపయోగించుకున్న వైనాన్ని కథలో చూపించడం మామూలుగా అయితే నమ్మడం కష్టం. కానీ ప్రధాన కథకు అనుబంధంగా జోడించిన సెకండాఫ్‌లోని రెండో ప్రపంచ యుద్ధ దృశ్యాలను చూపు తిప్పుకోలేనంత, భావోద్వేగాలను తట్టుకోలేనంత స్థాయికి తీసుకుపోవడం ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పాలి. దీన్ని మినహాయిస్తే బవాల్ సాదా సీదా ముడిసరుకుతో కూడిన 'లో ప్రొఫైల్ చిత్రం' మాత్రమే.
కథా సారాంశం
అజయ్ అలియాస్ అజ్జూ (వరుణ్ ధావన్).. హిస్టరీ టీచర్. సొంత ప్రతిష్ట కోసం అనునిత్యం తాపత్రయపడే అతడు నిషా (జాన్వీ కపూర్)ని వివాహం చేసుకుంటాడు. కానీ, పెళ్లికి ముందు ఆరోగ్యానికి సంబంధించి ఓ విషయంలో అబద్ధం చెప్పిందనే కారణంతో ఆమెను దూరం పెడతాడు. ఓ రోజు ఇంట్లో వాగ్వాదం జరుగుతుంది. ఆ కోపాన్ని స్కూల్లో విద్యార్థిపై ప్రదర్శిస్తాడు. స్టూడెంట్‌పై చేయి చేసుకోవడం చట్టరీత్యా నేరమంటూ స్టూడెంట్ తండ్రి అయిన ఎమ్మెల్యే.. అజయ్‌ని సస్పెండ్ చేయాలంటూ ప్రిన్సిపాల్‌ని ఆదేశిస్తాడు. దీంతో తనపై ఎలాంటి నెగెటివ్ మార్క్ పడకుండా ఉండేందుకు అజయ్ ప్లాన్ చేస్తాడు. రెండో ప్రపంచయుద్ధం జరిగిన ప్రాంతాలను విద్యార్థులకు చూపిస్తూ, ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పాలనుకుంటున్నానని, ఉద్యోగం నుంచి తీసేయకుండా తనకు మరొక అవకాశం ఇవ్వమని కోరతాడు. అలా విదేశాలకు వెళ్లిన అజయ్ ఏం చేశాడు, ఇష్టంలేని భార్యని వెంట తీసుకెళ్లడానికి కారణమేంటి అసలు నిషా దాచిన ఆ నిజమేంటి విదేశాల్లో వీరిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు ఇంతకూ అజయ్ సర్ సస్పెండ్ అయ్యారా, లేదా అన్నది మిగతా కథ.
మానవ జీవితాన్ని తాత్వీకరించి..
దాంపత్య సంబంధాల్లో పరివర్తన లక్ష్యంగా తీసిన బవాల్ సినిమా రెండో ప్రపంచ యుద్ధ గుణపాఠాలను భారతీయ చిత్ర పరిశ్రమ ఇంతవరకు చూపనంత గొప్పగా చిత్రించింది. డజన్లకొద్దీ సోవియట్ యూనియన్ తీసిన యుద్ధ సినిమాలను, హిట్లర్ జాతి హత్యాకాండ నేపథ్యంపై వచ్చిన అసంఖ్యాక డాక్యుమెంటరీ చిత్రాలను ఇన్నేళ్లుగా చూసి ఉంటాం. కానీ బవాల్ సినిమా చివర్లో చూపిన దృశ్యాలు కారుణ్యానికి సరికొత్త నమూనాగా నిలిచాయి. ఒక వ్యక్తి ఉన్మాదం కాన్సంట్రేషన్ క్యాంపుల్లో 11 లక్షల మందికి పైగా యూదులను నిలువునా తగులబెట్టి, గ్యాస్ చాంబర్లలో ఊపిరాడకుండా చేసి హతమార్చిన చరిత్రను చూస్తూ కూడా మనం ఇంకా కక్షలు, కార్పణ్యాలు, అపార్థాలు, మనస్పర్థలతో బతుకుతూ ఉండాలా. ఇంకా ఎంతకాలమిలా అని ప్రశ్నిస్తూ మానవ జీవితాన్ని తాత్వీకరించిన సినిమా బవాల్.
యూరప్ పర్యటనలో హీరో, హీరోయిన్‌లు రెండో ప్రపంచ యుద్ధ బాధాకరమైన జ్ఞాపకాలను మననం చేసుకోవడం, ఎలాంటి స్పందనలు లేకుండా బండబారిపోయిన హృదయాలను కూడా చలింప చేసేంత కారుణ్య దృష్టిని కలిగిస్తుంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ముఖ్యపాత్రల్లో కనిపించే బవాల్‌లో కనిపించే మసాలా దృశ్యాలు చాలానే ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ మొత్తంగా రెండో ప్రపంచ యుద్ధ ఘటనలను, నాజీ దురాగతాలను దృశ్యమానంగా చూపిస్తూ భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళుతుంది. వరుసగా వచ్చే ఆ దృశ్యాలను వర్ణించడానికి భాష సరిపోదు. ఏ భాషలోనైనా ఈ సినిమాను తప్పక చూడాలి. రెండో ప్రపంచ యుద్ధ గుణపాఠాలను వ్యక్తిగత జీవితాలకు అన్వయిస్తూ, మనుషులు ఇంకా ఎప్పుడు జీవిత పాఠాలు నేర్చుకుంటారు అనే కోణంలో మన చైతన్యాన్ని మేల్కొల్పుతున్న తాజా చిత్రం బవాల్.
నిజమైన మనిషిగా ఉండడమంటే ఏమిటనే దాని గురించి ఒక సాధారణ నైతిక కథను చెబుతుంది బవాల్. హీరో హీరోయిన్... నాజీల నిర్బంధ శిబిరమైన ఆష్విట్జ్‌కి వెళ్ళినప్పుడు అక్కడి ఘాతుక చర్చలను చూసి చలించిపోతారు. ఆ నిర్బంధ శిబిరం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి (నటుడు) ప్రతి మానవ సంబంధమూ దాని సొంత ఆష్విట్జ్ గుండా వెళుతుందని కన్నీళ్లతో వారికి భరోసా ఇస్తాడు. తరువాత మన ప్రేమికులు ఒక గ్యాస్ చాంబర్‌ని సందర్శించి ఆనాటి పాత్రలతో మమేకవుతూ గడిపిన ఆ దృశ్యం మనసుకు హత్తుకునేలా ఉంది, సినిమా మొత్తంలో ఎమోషన్లను శిఖర స్థాయికి తీసుకెళుతుందీ దృశ్యం.
హీరోయిన్ క్యారెక్టర్‌కీ వ్యక్తిత్వం..
అబద్ధాలతో నిర్మించుకున్న ఒక నాయకుడి ఇమేజ్ చాలా కాలం ఉండదని ఏదో ఒకరోజు ముసుగు తొలగిపోక తప్పదని కూడా ఒకచోట డైరెక్టర్ చెపుతాడు. చాలా సీరియస్ విషయాలను కామన్‌గా చెప్పడంలో దంగల్ దర్శకుడి ప్రతిభ చాలాచోట్ల కనిపిస్తుంది. హిందీ సినిమాల్లోని రొటీన్ మసాలాను చూపిస్తూనే కళ్లముందు యూరప్ గత యుద్ఘ జ్ఞాపకాలకు చెందిన ఒక మహాద్బుతం సెకండాఫ్‌లో సాక్షాత్కరిస్తున్నట్లు అనిపించింది. పాశ్చాత్య చలనచిత్రాలు ఇతర దేశాల చరిత్రలను చూపించడంలో ఇంతకు ముందు ఈ విధమైన స్టంట్‌నే చాలాసార్లు ప్రదర్శించాయి, కాబట్టి భారతీయ సినిమా దీనిని రివర్స్‌లో చూపించడం ఒక రకమైన విద్య అనే చెప్పాల్సి ఉంటుంది.
స్త్రీ కి ఒక వ్యక్తిత్వం వుంటుంది అని, అది దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలో దాన్ని మగాడికి అర్థం అయ్యేలా చేస్తుంది బవాల్ హీరోయిన్. అంతే కాకుండా మనిషి తనకున్న దానిలో ఎలా బతకాలో తెలుసుకోకుండా లేని డాబు దర్పం చూపించుకోవడానికి బతికే వారికి ఒక చెంప పెట్టు ఈ సినిమా. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్‌కి వ్యక్తిత్వం అందించటం ఆ క్యారెక్టర్‌కి హీరో కూడా గొప్పగా హర్షించగలగటం బాగుంది. చివరిగా హీరో తనను తాను గొప్పగా చూపించు కొనే క్యారెక్టర్‌కి స్వస్తి చెప్పటం చాలా బాగుంది. విఫలమైన వైవాహిక జీవిత కథనానికి ముడిపెడుతూ రెండవ ప్రపంచ యుద్ధం, హోలోకాస్ట్‌కి సంబంధించిన ఊహించలేని భయానక సంఘటనలను సందర్భోచితంగా వివరించే ప్రధాన స్రవంతి చిత్రం బవాల్.
కె. రాజశేఖర రాజు
73964 94557