విద్యారంగంపై కేసీఆర్‌ చిన్నచూపు

by Ravi |   ( Updated:2022-09-03 16:29:51.0  )
విద్యారంగంపై కేసీఆర్‌ చిన్నచూపు
X

'సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతుమేసదా' చదువు ప్రాముఖ్యతను, ఉపాధ్యాయుల విశిష్టతను తెలియజేసే శ్లోకం ఇది. ఈ రోజు తెలంగాణలో విద్యారంగం దుస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ముఖ్యంగా, చదువుల తల్లి సరస్వతీదేవి చెంతనే ఉన్న ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన యావత్‌ తెలంగాణ దృష్టిని ఆకర్షించింది. విద్యార్థుల కోర్కెలను సిల్లీ అని విద్యా శాఖా మంత్రి ప్రకటించడం వారి విజ్ఞతకే వదిలివేయాలి. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన ఏ ప్రభుత్వమూ ఈ రకమైన వ్యాఖ్యలు చేయదు.

ఈ రోజు సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది ఒక బాసర ట్రిపుల్‌ ఐటీనే కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల దుస్థితి దాదాపు అంతే ఉంది. తెలంగాణలో 11 విశ్వవిద్యాలయాలు ఉండగా అన్నింటా అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 3,000 ఉండగా, 2,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే 848 పోస్టులు భర్తీ కాకపోవడం గమనార్హం. గ్రంథాలయాలు లేవు, మెస్‌, వసతి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 50 ఏండ్ల కింద నిర్మించిన హాస్టళ్లలోనే విద్యార్థులు చదువులు కొనసాగించడం ఎంతటి దుర్భరమో కేసీఆర్‌కు అర్థం కాకపోవడం విచారకరం.

సమస్యల తోరణం

ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు సమస్యలతోనే స్వాగతం పలికింది. యేటా జూన్‌ 13న విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని తెలిసినా, ప్రభుత్వం తగిన సన్నద్ధతతో లేకపోవడమే ఇందుకు కారణం. బడులు తెరిచేనాటికి కనీసం పాఠ్యపుస్తకాలైనా అందివ్వాలన్న ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫీజుల నియంత్రణ, ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ అజమాయిషీకి సంబంధించి ప్రొ.తిరుపతిరావు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.

ఆ నివేదికలోని 'యేటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చు' అన్న సిఫార్సును మాత్రం ఆగమేఘాల మీద అమలు చేసేందుకు పూనుకున్నది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని కార్పోరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఏకంగా 20 శాతం నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కోవిడ్‌ కాలంలో ఆర్థికంగా చితికిపోయిన మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన ఫీజులు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ చార్జీలు తల్లిదండ్రులకు గుదిబండగా మారాయి. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రూ.215 ఉన్న మంత్లీ బస్‌పాస్‌ చార్జీ రూ.470కు పెరిగింది. క్వార్టర్లీ బస్‌పాస్‌ చార్జీ రూ.645 నుంచి రూ.1,410కు పెరిగింది. రూట్‌ బస్‌పాస్‌ చార్జీలు కనిష్టంగా రూ.165 నుంచి రూ.450 కి, గరిష్టంగా రూ.330 నుండి రూ.1,350కు పెరిగాయి. ఈ రకంగా భారాలు మోపడం పేద విద్యార్థులను క్రమంగా విద్యకు దూరం చేయడమే అవుతుంది.

ముందస్తు ప్రణాళిక లేదు

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు నేడు రేపు అంటూ ఏడేళ్లుగా కాలయాపన చేస్తోంది. చట్టపరంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొద్దునిద్రే దీనికి కారణం. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 691 పాఠశాలలు ఉండగా 900 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు గతంలో విద్యా వాలంటీర్లతో సర్దుబాటు చేసేవారు. మూడేండ్లుగా విద్యా వాలంటీర్లను రిక్రూట్‌ చేయకపోవడం, టీచర్‌ పోస్టులు కూడా సకాలంలో భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దాక్షాగానే మిగిలింది.

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలోనూ అనేక సమస్యలున్నాయి. తమ హయాంలో గురుకులాల సంఖ్య పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఆయా పాఠశాలలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పడుతున్న అవస్థలపై కనీస శ్రద్ధ చూపడం లేదు. జూన్‌ ఒకటి నుంచి 'మన ఊరు-మన బడి' కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి దశలో 9,123 బడులలో 12 రకాల పనులు ప్రారంభించనున్నట్టు హడావుడి చేసింది. ఈ పథకం కోసం వినియోగించే నిధులలో అధిక భాగం కేంద్రం కేటాయించినవే. ఈ విషయం నేను చెప్పినందుకు 'బండి సంజయ్‌ అబద్దాలు చెబుతున్నారని. కేంద్రం నుండి పైసా నిధులు రాలేదని' విద్యా శాఖా మంత్రి ప్రతిస్పందించడం విడ్డూరం.

ఆ నిధులు కేంద్రానివే

'మన ఊరు-మనబడి' కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్ర విద్యా శాఖ జీఓ నం.4 (03.02.2022) విడుదల చేసింది. అందులో చాలా స్పష్టంగా 'మన ఊరు-మన బడి'కి అయ్యే ఖర్చులను సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), ఉపాధిహామీ నిధుల నుండి డ్రా చేసుకోవాలని కలెక్టర్లకు డైరెక్షన్‌ ఇచ్చారు. ఈ రెండూ కేంద్రం అమలు చేసే పథకాలే. వాటికి కేంద్రం నుండే నిధులు వస్తాయని విద్యా శాఖా మంత్రి గారికి తెలియదనుకోను. ప్రజలు అమాయకంగా వారు చెప్పిందల్లా నమ్ముతారని వారి అతివిశ్వాసం తప్ప మరొకటి కాదు. మెరుగైన ఫలితాలు సాధించే విధంగా చూడాల్సిన పర్యవేక్షకుల కొరత కూడా తీవ్రంగా ఉంది.

రాష్ట్రంలో 584 మండలాలు ఉండగా 577 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడు మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు ఉన్నారు. 62 డిప్యూటీ ఈఓ పోస్టులు, 23 డీఈఓ పోస్టులు ఖాళీగా వున్నాయి. సంక్షేమ హాస్టళ్ల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారు. పౌష్టికాహారం అందక రోగాల బారిన పడుతున్నారు. మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వ చెవికి ఎక్కడం లేదు. దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థుల పట్ల ప్రభుత్వానికికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

నాణ్యమైన విద్య కలగానే

కార్పోరేట్‌ సంస్థల ప్రవేశం తరువాత పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య కలగానే మిగిలిపోయింది. కార్పోరేట్‌‌కు దీటుగా ప్రభుత్వ విద్యావ్యవస్థను మెరుగు పరచాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, పాఠశాలలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. తద్వారా మంచి ఎకడమిక్‌ వాతావరణం పాఠశాలలో నెలకొనాలి. ఇప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. రాష్ట్రంలో 12 వేల అదనపు తరగతి గదులు అవసరమని, 300 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

దేశానికి రేపటి భవిష్యత్‌గా భావించే మన విద్యార్థుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే అదర్శనీయ సమాజాన్ని ఎలా నిర్మించగలమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. సాంకేతిక విద్యకూడా తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గత రెండేళ్లలో నాలుగు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. తెలంగాణను నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామంటూ నిత్యం బాకాలు ఊదే మంత్రులు, బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల రోదనను పట్టించుకోకపోవడం చూస్తే సాంకేతిక విద్యకు వారు ఇస్తున్న విలువ ఏ పాటిదో అర్థమవుతుంది.

మేం మార్చి చూపుతాం

గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అరకొర నిధుల కేటాయింపు, కేటాయించిన బడ్జెట్‌ కూడా సక్రమంగా ఖర్చుచేయకపోవడంతో విద్యావ్యవస్థ సమస్యల వలయంలో సతమతమవుతున్నది. విద్యారంగం అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి ముడిపడి ఉందని బీజేపీ సంపూర్ణంగా విశ్వసిస్తున్నది. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి అర్హులైన వారందరికీ ఉచిత విద్యను అందించాలని సంకల్పించింది.

కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య ఎలా అందించవచ్చో బీజేపీ నిరూపించి చూపుతుంది. ఈ సంకల్పానికి అవసరమైన కార్యాచరణ కోసం విద్యారంగ నిపుణులు, మేధావులతో చర్చించి తగిన ప్రణాళికలను రూపొందిస్తామని రాష్ట్ర ప్రజలకు బీజేపీ భరోసా ఇస్తోంది.

బండి సంజయ్‌‌కుమార్‌

ఎంపీ, కరీంనగర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Advertisement

Next Story

Most Viewed