కుటుంబ సంబంధాలు పునర్నిర్మించే 'బలగం'

by Ravi |   ( Updated:2023-04-01 07:13:55.0  )
కుటుంబ సంబంధాలు పునర్నిర్మించే బలగం
X

‘బలగం’ అంటే కుటుంబం, స్నేహితులు, బంధువుల సమూహం అని అర్థం. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో 2015లో వచ్చిన కన్నడ చిత్రం తిథికి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా ఇది తెలంగాణ కుటుంబ సంబంధాలు, సంస్కృతిపై వాస్తవిక సామాజిక ప్రతిబింబంగా కనిపిస్తుంది. సాంప్రదాయ గ్రామీణ జీవన గమనం, మానవ సంబంధాలు తీవ్రంగా విచ్చిన్నమైనప్పుడు వ్యక్తులు సామాజిక-సాంస్కృతిక పరిసరాలలో ఎలా ప్రవర్తిస్తారో ఈ చిత్ర కథనం తెలియజేస్తుంది.

కుటుంబ సంబంధాలు నాశనం అవుతూ..

తెలంగాణా గ్రామీణ మధ్యతరగతి జీవనశైలి, ఆలోచనా సరళి ప్రస్తావిస్తూనే, ఒకరి పట్ల మరొకరు అంతర్లీనంగా చాలా శ్రద్ధ, ప్రేమ, కరుణ ఉన్నప్పటికీ, చిన్న అహంభావం కారణంగా కుటుంబ సంబంధాలు ఎలా నాశనం అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి బలగం ఒక కథ వస్తువును అందిస్తుంది. అహంకారానికి మూలకారణాన్ని పరిశోధించడానికి, అహంపై ఎలా గెలవాలో తెలుసుకోవడానికి ఈ చిత్రం చాలా ఉపయోగకరంగా ఉంది. సహజసిద్దమైన మానవ స్వభావం లేదా రోజువారీ జీవితంలో స్వీయ ప్రదర్శన పట్లనున్న గాఢమైన కోరిక కారణంగా అహంకారాలు పెరుగుతున్నయా, లేదా నిగూఢమైన బలవంతపు సామాజిక శక్తుల ద్వారా పెరుగుతున్నయా అనే వివరణను ఈ చిత్రం స్పష్టంగా తెలుపుతుంది. ఈ చిత్రం నిస్సందేహంగా ప్రేక్షకులకు కుటుంబ సంబంధాల పునర్నిర్మాణం చేసుకోవడానికి వ్యక్తి తన లోపల ఎలా తవ్వుకోవాలో మరింత అవగాహన కల్పిస్తోంది. అలాగే సామాజిక శాస్త్రవేత్తలకు సైద్ధాంతిక దృక్కోణాల నుండి సామాజిక పరస్పర చర్యలను విశ్లేషించడానికి వాస్తవిక కథనాన్ని అందిస్తుంది.

ఈ చిత్రంలో, కొమురయ్య, ఇతర గ్రామీణ అమాయకుడిలాగానే, తన కుటుంబం మళ్లీ కలుసుకుంటుందా లేదా అనే సందేహం కలిగి ఉన్నాడు, అతను నిజం తెలుసుకోకుండనే చనిపోతాడు. కొమురయ్య ఎప్పుడూ రైతు కూలీలు, గ్రామస్థులతో ఉల్లాసంగా సంభాషించడం, రుమాలు, చుట్టా, దుడ్డుకర్రతో కూడిన ఆయన వేషధారణలు అతన్ని ఒక సాధారణ సాంప్రదాయ జ్ఞానిగా చిత్రీకరిస్తున్నాయి. అయితే అల్లుడు, కొడుకులకు మధ్య జరిగిన గొడవలకు అతను చాలా బాధతో ఉంటాడు. ఐలయ్య అల్ప కోపాన్ని కలిగి ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే ఇతరులతో గొడవ పడతాడు, అయితే అతని అమాయక సోదరుడు మొగిలయ్య అతని భార్య చేతిలో లోకి గా ఉంటాడు. నారాయణ సహజంగా స్పందించే వ్యక్తి, అల్లుడుగా తన స్వంత గౌరవాన్ని కోరుకుంటాడు. అతని భార్య లక్ష్మి ఓపికగా ఉంటుంది, తన భర్త, తోబుట్టువుల మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని ఏర్పచడానికి ప్రయత్నించి విఫలమైంది. సాయిలు ఒక నిరుద్యోగి, ఎల్లప్పుడూ స్నేహితుల చుట్టూ ఉండే ఒక సాధారణ వ్యక్తి. అతని మరదలు సంధ్య చదువుకున్నది, ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకోవాలనుకుంటుంది. కుటుంబ కలహాలను ద్వేషిస్తుంది.

జానపద కళలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ..

ఒక చలనచిత్రంగా, బలగం ప్రధానంగా కుటుంబ సంబంధాలను మార్చడం, ఒక వ్యక్తి, అతని కుటుంబం యొక్క సామాజిక అంచనాలను నెరవేర్చడం, కుటుంబ సభ్యులను వేరు చేసే శక్తులనూ రూపుమాపడం పై దృష్టి పెడుతుంది. చిత్రంలో, గ్రామ సభ కుటుంబ సభ్యులను కలసిమెలిసి ఉండమని బలవంతం చేసింది, కానీ నిజ జీవితంలో, ఈ రకమైన కౌన్సిల్‌లు, కుల సంఘాలు, యువజన సంఘాలు లేదా మరే ఇతర సమూహాల జోక్యాలు కనిపించకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుత తరుణంలో కుటుంబ బంధాలు మాత్రమే కాదు, సాంప్రదాయ సామాజిక సంస్థలు కూడా వివిధ కారణాల వల్ల దెబ్బతిన్నాయి. ఇది వర్ధమాన సామాజిక సమస్య. పట్టణ కేంద్రాల మాదిరిగానే అన్ని గ్రామాలు క్రమంగా వ్యక్తిగతీకరించబడుతున్నాయి. అన్ని సమాజాలు ఆధునికానంతర, సత్యానంతర ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాయి. సాధారణంగా వివాహం ద్వారా కుటుంబాలు కలిసిపోతాయని నమ్ముతారు. కానీ ఈ చిత్రంలో కొమురయ్య మరణం తర్వాత విడిపోయిన కుమార్తె లక్ష్మిని తిరిగి తీసుకువస్తుందని చూపిస్తుంది. ఆమె భర్త నారాయణ తన సోదరులతో విభేదిస్తున్నందున ఇరవై సంవత్సరాలుగా తన కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ మరణం చివరకు విడిపోయిన కుటుంబాలను తిరిగి కలపడమే కాక, మనుమడు, మనువరాళ్ళ పెళ్లికు కూడా దారి తీస్తుంది.

గ్రామీణ విద్యావంతులైన యువకులు జీవనోపాధి కోసం పెద్ద ఎత్తున అప్పులపాలయ్యారని, అలాగే తగినంత శిక్షణ లేకపోవడంతో అతని అనేక వ్యాపార వైఫల్యాలను కూడా సాయిలు కథ చూపుతుంది. అన్ని సందర్భాలలోనూ మద్యం సేవించడం అనేది పల్లెటూర్లలో కూడా పెద్దగా ఆందోళన కలిగించే అంశంగా సినిమాలో వాస్తవికంగా చూపించారు. కుమార్తె లక్ష్మిని కుటుంబ సభ్యులలో అత్యంత ప్రేమగల వ్యక్తిగా చూపిస్తూ, తెలంగాణ సంస్కృతిలో ఆడపడుచులకు ఉన్న అత్యంత గౌరవాన్ని చాటిచెప్పారు.

బుర్ర కథ, ఒగ్గు కథ వంటి దేశీయ జానపద కళలు చిత్రానికి ప్రత్యేకమైన రుచిని జోడించాయి. సాధారణ స్థానిక జానపద సాహిత్యంలో పాడిన పాటల సాహిత్యం సజీవ అనుభవాలపై ఉద్భవించిన పురాతన జ్ఞానంతో ప్రేక్షకులను ప్రేరేపించింది. తెలంగాణలో ఇప్పటికీ జానపద కళలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సినిమా ధృవీకరిస్తోంది. కథ కొమురయ్య మరణంతో మొదలై, అతని 11వ రోజు పండుగను సంప్రదాయ ఆచారాలలో భాగంగా అందించడంతో ముగుస్తుంది. కథ మొత్తం మరణం మరియు దుఃఖం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. చిత్రం 11 రోజుల శోకంలో నడిచినప్పటికీ, కథనం బాధ నుండి గణనీయమైన ఉపశమనం కలిగించింది. మొత్తంమీద, బలగం చిత్రం తక్కువ బడ్జెట్‌‌తో రూపొందించిన సందేశాత్మక చిత్రం. చలన చిత్రేతర కుటుంబ నేపథ్యం నుండి తక్కువ ప్రొఫైల్‌ ఉన్న తారాగణం, యువ నిపుణులచే చలనచిత్ర నిర్మాణం, తరగతి కుటుంబ సమస్యల ఇతివృత్తం, స్థానిక జానపద కథల మేళవింపు, వంటి పలు అంశాలు స్వాగతించే విషయాలు. ఏదైనా పగను క్షమించడానికి లేదా మరచిపోవడానికి, సామాజిక సంబంధాలను పునర్నిర్మించడానికి ప్రజలు ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా ఈ సినిమాను ఆదరించవచ్చు.

డా. రామ్‌ షెపర్డ్‌ భీనవేణి

విజిటింగ్‌ స్కాలర్‌, అమెరికా

bhenaveni@gmail.కం

ఇవి కూడా చదవండి: ‘బలగం’ సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు

Advertisement

Next Story