- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదవర్గాల వాటాగా... ఉచితాలు కొనసాగాల్సిందే!
దేశంలో ఉచితాల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హామీలను నియంత్రించాలంటూ కొంతమంది న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. ఇటీవలి కాలంలో దాదాపుగా అన్ని పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి. అయితే దీనిపై,పన్నుల రూపాల్లో ప్రజలు కట్టిన సొమ్మును ఉచితాల పేరుతో పంచి పెడుతున్నారన్న వాదన వ్యతిరేక వర్గం నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఉచితాలు కొనసాగించాల్సిందేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ప్రభుత్వానికి సంపద సృష్టించడం ముఖ్యమే కావచ్చు. దీనికోసం రకరకాల మార్గాలున్నాయి.కానీ పేద వర్గాలకు బతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. అందుకే ఉన్న సంపదలో పేదవర్గాలకు కాస్తంత వాటా ఇవ్వాల్సిందేనంటున్నారు జనం పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు. పరిమితికి మించకుండా కొంతమేర ఉచితాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా వ్యతిరేకులు పేర్కొంటున్నారు. తాయిలాల సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్న విమర్శలు వస్తున్నాయి. సంక్షేమం పేరుతో అడ్డూ అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఉచితాలతో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయంటున్నారు కొందరు ఆర్థిక వేత్తలు.
ఉచితాల సృష్టికర్త
ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం పందారం చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఉచిత పథకాలు అమలవుతున్నాయి. ఉచిత పథకాలు అనగానే వెంటనే గుర్తుకువచ్చేది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ను ఉచితాలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాతే ఉచితాలు ఎక్కువయ్యాయి. అయితే ఆయన ఉచితాలు ప్రారంభించడం వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. 70ల్లో తమిళనాట పేదరికం బాగా ఉండేది. మూడు పూటలా తిండి సంపాదించుకోవడానికే పేదలు నానా ఇబ్బందులు పడేవారు. చిన్నారులను బడులు మానిపించి సంపాదన కోసం కార్ఖానాలకు పంపేవారు. ఈ స్థితిని చూసి ఆయన పేదలను ఆదుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనే వినూత్న పథకాన్నిప్రారంభించారు.
ఉచితాలను బలపరిచిన ఇందిరాగాంధీ!
ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వలస పాలన వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమాలు పెల్లుబికి ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు సమీకరించాయి. ఏ దేశ స్వాతంత్ర్య ఉద్యమం కూడా తాము పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని కనీసం మాట వరసకు కూడా అనలేదు. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. 1971–72 ప్రాంతంలో పేదరిక నిర్మూలన గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ఓ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అప్పుడు సంపద పెరగకుండా సంక్షేమాన్ని ఎలా సాధిస్తారని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ఓ ప్రముఖుడు ఇందిరా గాంధీని ప్రశ్నించారు. దీనికి ఇందిర జవాబు చెబుతూ ఉచితాలను బలపరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశించారని ఆమె చెప్పారు. అయితే అనేకానేక కారణాలతో ప్రజల బతుకుల్లో వెలుగులు రాలేదన్న వాస్తవాన్ని ఇందిర అంగీకరించారు. ఈ నేపథ్యంలో పేదల బతుకులు బాగు చేయడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఉన్న సంపదలోనే పేదలకు కొంత వాటా ఇవ్వడం తప్పనిసరి అంటూ ఉచితాలను ఇందిరా గాంధీ అప్పట్లోనే బలపరిచారు.
పేదలను అవమానించడం తప్పు
ఏది ఏమైనా కాలే కడుపునకు పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వాల విధి కావాలి. సంక్షేమం పేరుతో కొంతవరకు ఉచితాలను ప్రకటించినా, వాటిని స్వాగతించాల్సిందే. సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం కావాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి ఎంచక్కా విదేశాల్లో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల గురించి పల్లెత్తు మాట అనని ఆర్థికవేత్తలు పేదవారి కోసం అమలు చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరం. ఏమైనా సమాజంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది సంక్షేమ రాజ్యమే. సంక్షేమమే పాలకులకు తారకమంత్రం కావాలంటున్నారు ప్రజల పక్షాన నిలబడే ఆర్థిక వేత్తలు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా పేర్కొనడం కూడా సమంజసం కాదు. ఇది ఉచితాల వల్ల ప్రయోజనం పొందే పేదలను అవమానించడమే. పేదల బతుకుల్లో వెలుగుల్లో నింపడానికి అప్పట్లో ఇందిర చెప్పినట్లు ఉన్న సంపదలో కొంత వాటా ఇవ్వాల్సిందే. పేదల కోసం ఉచితాలను స్వాగతించాల్సిందే.
ఎస్. అబ్దుల్ ఖాలిక్,
సీనియర్ జర్నలిస్ట్
63001 74320