- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మనిషి’చుట్టూ... ముసురుకుంటున్న అజ్ఞానం
మనిషి స్వాభావికంగా హేతువాది. కానీ అతని హేతుత్వం, బయటపడనీయకుండా, ఆలోచించనీయకుండా మన చుట్టూ అజ్ఞానపు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికి ఊపిరి సలపకుండా, ఉక్కిరిబిక్కిరి అయ్యేట్టుగా ఇంటా బయట మతాల, కులాల, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటాయి.
దేవుడి ఉనికి కాపాడటం కోసం, మతాల ప్రచారం కోసం మన దేశంలో ఎన్నో మత సంస్థలు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. అమాయకులైన ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటూనే ఉన్నాయి. ఇది కనిపెట్టని ప్రజలు దేవుడిపై భారం వేసి పోలోమంటూ ఆధ్యాత్మిక ప్రార్థన మందిరాల చుట్టూ తిరుగుతున్నారు. మతాల వల్ల లాభపడేవారు ఈ సంస్థలను నిర్వహిస్తూ, ప్రజల్ని అజ్ఞాన బాట పట్టిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి, మత సంస్థలకు ప్రార్థన మందిరాలకు డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాయి.
టీవీ చానెళ్ళ వలన..
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ చిన్నదో, పెద్దదో తప్పనిసరిగా ఉంటుంది. టీవీ కార్యక్రమాలు మనకు ప్రపంచంలో ఎటువంటి సంఘటనలు జరిగినా అదే నిమిషంలో తెలియజేయడానికి, మనలో జ్ఞానాన్ని పెంచడానికి ఉద్దేశింపబడినవి. కానీ దానికి విరుద్ధంగా మనలో అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూ, ప్రతిక్షణం మన మెదళ్లను అజ్ఞానంతో నింపుతూ, మతాల మత్తులో ముంచేస్తున్నాయి.నిత్యం దాదాపు 30 వివిధ మతాల భక్తి చానల్స్ నిత్యం భక్తిరసాన్ని ఊదరగొడుతున్నాయి. వీటి మొత్తం సారాంశం దేవుడూ, మతమూ, భక్తీ..! టీవీ వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, రుద్రాక్షలు ధరించడం... టీవీ నిండా ఇవే కార్యక్రమాలు ఇక లైవ్‌లో పూజలు, పునస్కారాలు, దేవుని పేరుతో ఉత్సవాలు జాతరలు సినిమాలలో సీరియల్స్‌లో కూడా మతానికి సంబంధించిన దేవుళ్ళ కార్యక్రమాలు ఇవే కనిపిస్తుంటాయి. వినిపిస్తుంటాయి. ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఆలోచించనివ్వకుండా మన మెదళ్ళను భక్తి పిచ్చితో నింపేస్తున్నాయి. ఇక అదే టీవీలో తినే తిండీ, కట్టే బట్టమీద కూడా దేవుడి పేరుతో దాడి పెంచేశారు! మన ఇంట్లో మనం ఏ వైపున ముఖం పెట్టి కూర్చోవాలో ఏ వైపున పడుకోవాలి? మలవిసర్జనకు ముఖం ఎటువైపు ఉంచాలో కూడా చెప్పే నీచమైన పంతుళ్లు కూడా ఉన్నారు. క్రైస్తవులు కల్వరి నూనె, హిందువులు పతంజలి పేస్ట్, ముస్లింలు ఫలానా టూరిస్ట్ అంటూ మొదలెట్టేసారు!
రంగురాళ్లు, రుద్రాక్షలు, న్యూమరాలజిస్ట్, వాస్తు పండితులు, ఫలానా పూజా మందిరాలూ, భూత వైద్య శిబిరాలు వీటికి అదనం! ప్రవచనాల పేరిట ప్రతి సాయిబు, స్వామి, పాస్టర్ ఎలా స్నానం చేయాలో, గోచీ ఎవరు, ఎలా వుతకాలో మొదలుపెట్టి, చివరికి ఎలా బతకాలో కూడా చెప్పేవాడే! ఇక దెయ్యాలను పారద్రోలే దయ్యాల మాంత్రికులు కూడా ప్రతి ఊర్లోను కనిపిస్తుంటారు మానసిక ఆరోగ్యం బాగోలేక పిచ్చిగా ప్రవర్తించడం గమనించి దెయ్యం పట్టిందని, ఆత్మ ఆవేశించిందని మోసం మాటలు చెబుతూ దెయ్యాల మాంత్రికులు మనుషులను ఘోరంగా హింసిస్తారు. వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి, కర్రలతో కొమ్మలతో కొట్టి గాయపరుస్తారు ఆ దెబ్బలకు తాళలేక కొందరు చనిపోయిన సంఘటనలు కూడా మనం వింటుంటాం
ప్రతి పనికి ముహూర్తం..
కొందరు యమగండం, రాహుకాలం, సుముహూర్తాలు చూసుకుని ఇంటి నుండి బయలుదేరుతారు. మంగళవారం ఆ దిక్కు పోకూడదని, గురువారం ఈ దిక్కు పోకూడదని పంచాంగంలో ఉన్న వాటిని యధావిధిగా పాటించేవారు ఉన్నారు. శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వకూడదని మూఢంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు.ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముహూర్తం చూడవలసిందే. దానికోసం బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళవలసిందే. ఇల్లు కడితే పూజలు, ఇల్లు కట్టడానికి ముందే పూజలు, ఇల్లు కట్టిన తర్వాత పూజలు, గృహప్రవేశం కోసం పూజలు,రోగం వస్తే పూజలు, చస్తే పూజలు, బతికితే పూజలు అన్నట్టుగా మనిషి పుట్టిన గడియ నుండి చనిపోయే గడియ వరకు, షాపు ప్రారంబించినా, కంపెనీ ప్రారంభించినా చివరకు తల వెంట్రుకలు తీసుకున్నా మంచి రోజు చూస్తుంటారు. ప్రతి పనికి పూజలు చేస్తుంటారు. మమ్మల్ని కాపాడుమని, మాకు ఐశ్వర్యం ప్రసాదించమని, మాకే కష్టం రాకూడదని, ఆకాశం వైపు చూస్తూ చేతులెత్తి దండాలు పెడుతుంటారు. సుఖదుఃఖాలకు అన్నింటికీ దేవుడే కర్తయని, నమ్ముతారు. అన్ని దేవుడే చేస్తాడని, మనల్ని పుట్టించాడని, సుఖదుఃఖాలకు ఆయనే కర్త, కారణమని, ఆయనను ప్రార్థిస్తే అన్ని కష్టాలు తీరుతాయని, సుఖం లభిస్తుందని ప్రవచనాలు చెప్పే మోసకారి దొంగ పంతుల్లను మనం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటాం.
గడప దాటి బయటకు వస్తే
వీధి వీధినా మతాల గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా మందిరాలు మన చెవిలో అదే హోరు ప్రతిధ్వనిస్తుంటుంది. నామదారులు, వేషధారులు కనబడుతుంటారు. వీధిలో గవర్నమెంటు స్కూలు నుండి మిషనరీ స్కూల్ దాకా రాబోయే తరాల్ని ప్రశ్నించడం మానేసేలా ప్రతిరోజూ పొద్దున్నే ప్రార్థన పేరుతో పసి మెదళ్ల ట్యూనింగ్! రోడ్డుమీద కార్తీక మాసం, రంజాన్ మాసం, డిసెంబర్ మాసం.. అదనంగా ప్రతినెలా రెండు మూడు పండగలు, అవి మర్చిపోవద్దని గుర్తుచేస్తూ వీధుల్లో రోడ్లన్నీ మూసి ఎదురుగా పీర్లు, వినాయకులు, దుర్గల విగ్రహాలు! శుక్రవారం ముస్లింలూ, ఆదివారం క్రైస్తవులు, మిగతా ఐదురోజులూ హిందువుల దాడి! అలారాలున్నా అజాలు వినిపిస్తారు; ప్రతి పండగకీ మైకులు చెవుల్లో దూర్చేస్తారు; పిచ్చిముదిరిన రోజల్లా పక్కింటివాడు కొంపలో భజనో, ప్రార్థనో ఏర్పాటు. ఇవి సరిపోకపోతే మైదానాల్లో దేవునితో రెండురాత్రులు, ఫలానా స్వామీజీతో సాయంత్రం, ఫలానా ఇస్లాం శాఖ ఇజ్తెమా! ఇక ప్రతిమతపెద్దా తానో పేద్ద సర్వఙ్ఞడని ఎద ఎత్తుకొని నడక, 'నా కాళ్లు పట్టుకోవా' అనే వెధవ బెదిరింపు చూపులు! రోడ్డుమీద ప్రతి వాహనం ముందూ, వెనకా సైకిల్ వద్దనుండి కాస్ట్లీ కారుదాకా దేవుడి ఫోటోలు, రాతలు! రోడ్డులో నడుస్తున్నా, వాహనం మీదున్నా రోడ్లకిరువైపులా చూస్తూ గుండెలమీద శిలువల ముద్రణ, చెవులు పట్టుకోవడం, కళ్లు మూసుకోవడం, ఆ చెంపా ఈ చెంపా తామే ఫటాఫటా వాయించుకొంటున్నాడా, లేడా అని చూసే చర్చి, మసీదు, గుడిగోపురాలు! లిఫ్ట్నీ, మిషన్లనీ, కంప్యూటర్లనీ, చివరికి ఆకాశంలోకి పంపే రాకెట్లనీ వదలని పూజలు, ఫోటోలు, అగరొత్తులు! ఇవన్నీ ఆఫీసుల్లో, పాఠశాలల్లో జరగడం దారుణం.
సైన్స్ ఎందుకు నమ్ముతారు?
ఇన్ని రోజువారీ పరీక్షలు దుర్నీక్షతతో ఎదుర్కొంటూ శరీరాన్నీ, మనస్సునీ, మేధస్సునీ హేతుబద్దంగా, తార్కికంగా, సశాస్త్రీయంగా, మానవీకరణంగా ఒక వ్యక్తి ఈ దేశంలో బ్రతకాలంటే సముద్రమంత స్థైర్యం కావాలి, హిమాలయమంత ఎత్తైన వ్యక్తిత్వం కావాలి! ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిది. ప్రజలు ఇప్పటికే మూఢాచారాల్లో, అజ్ఞానాంధకారంలో మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మెదళ్ళలో పట్టిన బూజు దులుపుకుంటే మత చెత్తను తీసి వేసుకుంటే మానవులుగా బతుకులు వ్యర్థం అవుతాయి. మనిషికి ప్రతిక్షణం ఇలా అజ్ఞానం మాటలు చేతలు వినవస్తుంటే అజ్ఞానపు చీకట్లు చుట్టూరా ముసురుతుంటే ఇక వైజ్ఞానిక ఆలోచనలు ఎలా వస్తాయి? సైన్స్ పరంగా ఎలా ఆలోచిస్తాడు? ఇది మన సమాజ దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఎలా తయారవుతారు? శాస్త్రీయంగా ఎలా ఆలోచిస్తారు? అందుకే మన దేశంలో బాబాలకు స్వామీజీలకు ఉన్నంత విలువ శాస్త్రజ్ఞులకు ఉండదు. మనదేశంలో చదువుకు విలువలేదు చదువు రాని మూర్ఖుడు వేషం వేసి బాబాను అంటే చదువుకున్న మూర్ఖులు, చాంతాడంత పొడవైన డిగ్రీలు సంపాదించిన వారు కూడా వాని కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. ఇక ఈ సమాజాన్ని హేతువాదులే రక్షించాలి.
అడియాల శంకర్
అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం
7093062745
- Tags
- rationalism