పోడుపై రాజకీయ నీడ..

by Ravi |   ( Updated:2022-09-30 05:14:04.0  )
పోడుపై రాజకీయ నీడ..
X

'మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులను భాగస్వాములను చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఆదివాసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో జీఓను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ చట్టం అమలు నిలిపివేయాలని కేసు నడుస్తోంది. ఈ కేసులు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో పోడుపై ఆధారపడిన గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అటవీ అధికారులతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి.'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టం-2006 వచ్చిన తర్వాత 2008-09 లో అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. తెలంగాణలో 1 లక్ష 93 వేల మంది వ్యక్తిగత, సామూహిక హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపుగా 93 వేల మందికి హక్కు పత్రాలు జారీ అయ్యాయి. సగం మందికి వచ్చాయి. మిగతా సగం మందికి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లకు అటవీ ప్రాంతంలో నిరంతరం పోడు భూముల కోసం జరుగుతున్న పోరాటాలు, ఆదివాసీల సమస్యలను గుర్తించి ప్రభుత్వం 8 నవంబరు 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్నవారందరికీ చట్టప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం 11 సెప్టెంబర్ 2022న గిరిజన సంక్షేమ శాఖ జీఓ నం. 140 జారీ చేసింది. అదే ఇపుడు వివాదాస్పదంగా మారింది.

2006 చట్టం ఏమిటి?

ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు వారి జీవనానికి అడవి మీద, అడవి సంపద మీద ఆధారపడుతున్నారు. అడవిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ బతుకుతున్నారు. తరతరాలుగా అడవిని నమ్ముకుని ఉంటున్నా లక్షల కుటుంబాలకు అటవీ భూమి హక్కులు లభించలేదు. హక్కుల కోసం జరిగిన ఉద్యమాల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2006లో తొలిసారిగా 'షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం' రూపొందించింది. దీనిని 1 జనవరి 2008 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టేటపుడు గిరిజనులకు మాత్రమే పరిమితమై ఉంది. ఆ తర్వాత 'ఇతర సాంప్రదాయక నిర్వాసితులకు' అనే పదాన్ని చేర్చి గిరిజనేతరులకు కూడా అవకాశం కల్పించారు. ఈ చట్టం గిరిజన ప్రాంతంలోనే కాకుండా, అడవి ఉన్న అన్ని ప్రాంతాలలో అమలవుతుంది.

ఎలాంటి హక్కులు ఉంటాయి?

అటవీ హక్కుల చట్టం- 2006 సెక్షన్- 3 అడవిలో వేటను తప్ప అన్ని రకాల హక్కులను గుర్తించింది. అటవీ భూములలో నివాసం ఉండేందుకు, సాగు చేసుకునేందుకు హక్కు పత్రాలు ఇస్తారు. సామూహిక హక్కులు అంటే తేనె, బంక, లక్క, తునికాకు, ఔషధ మొక్కలు, అటవీ మొక్కలు సేకరించటం, చేపలు పట్టడం మొదలైనవి. పోడు చేసుకునేవారికి సెక్షన్-4 (6) ప్రకారం పది ఎకరాల లోపు హక్కు పత్రం ఇస్తారు. అది కూడా 13 డిసెంబర్ 2005 నాటికి పోడులో ఉన్నవారికే. ఆ తర్వాత సాగు చేసుకుంటే హక్కు పత్రం లభించదు.

అలా సాగు చేసుకునేవారిపై చట్ట ప్రకారం కేసులు పెడతారు. 13 డిసెంబర్ 2005 నాటికి అటవీ భూమిని మూడు తరాలుగా అంటే, 75 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు హక్కుపత్రాలు వస్తాయి. అటవీ సంరక్షణ చట్టం-1980 ఉన్నప్పటికీ సెక్షన్ 3 (2) ప్రకారం గ్రామంలో పాఠశాల, దవాఖానా, కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ, చెరువులు, కుంటలు, రోడ్ల అవసరాల కోసం గ్రామసభ అనుమతితో ఒక హెక్టారులో 75 చెట్లను మించకుండా తీసివేసి అటవీ భూమిని వాడుకోవచ్చు. సెక్షన్ 4 (4) ప్రకారం హక్కుపత్రం వచ్చినవారు భూమిని వారసత్వంగానే అనుభవించాలి. బదలాయింపు చేయరాదు. భార్య, భర్త పేర్ల మీద జాయింట్ పట్టా జారీ చేస్తారు. అందులో వారి పిల్లల పేర్లు రాయబడతాయి. దీంతో ఆ కుటుంబానికి కుటుంబానికి హక్కు వస్తుంది.

దరఖాస్తు చేసుకునే విధానం

గ్రామసభ ఆమోదంతో 10 నుంచి 15 మందితో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. అర్హత కలిగినవారు వ్యక్తిగత, సామూహిక హక్కుల కోసం కమిటీకి తగిన సాక్ష్యాధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. సాగు చేసుకుంటున్న భూమిపై పోలీసు కేసు, భూ రికార్డులలో పేరు, స్టడీ రిపోర్టులో నమోదు, ప్రభుత్వం ప్లానింగ్ రిపోర్టులో నమోదు, కోర్టు తీర్పులు, ఆంత్రోపాలజికల్ సర్వే వంటి సంస్థలు రూపొందించిన నివేదికలు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు జతచేయవచ్చు. ఎటువంటి ఆధారం లేనప్పుడు గ్రామంలోని ఇద్దరు పెద్దమనుషులు రాతపూర్వకంగా ఇచ్చిన సాక్ష్యం ఉండాలి. కమిటీ వీటిని పరిశీలించి గ్రామసభకు పంపుతుంది. గ్రామసభ దీనిని సబ్ డివిజినల్ కమిటీకి నివేదిస్తుంది.

ఆర్‌డీఓ సారథ్యంలోని కమిటీ వాటిని సరి చూసి జిల్లా కమిటీకి పంపుతుంది. కలెక్టర్, గిరిజన సంక్షేమ అధికారి, ఐటీడీఏ పీఓ, అటవీ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీ వీటిని పరిశీలించి అర్హులకు హక్కు పత్రాలు జారీ చేస్తుంది. జాబితాను అటవీ హక్కుల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. అభ్యంతరాలు ఉంటే రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్న మానిటరింగ్ కమిటీకి నివేదించవచ్చు. దీనిలో రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖల కమిషనర్లు, ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారు.

జీఓ 140 ఏం చెబుతుంది?

జీఓ 140 ప్రకారం హక్కుల గుర్తింపు ప్రక్రియకు జిల్లాస్థాయి కో-ఆర్డినేషన్ కమిటీని నియమించారు. దీనికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. పోలీస్ కమిషనర్ లేదా ఎస్‌పీ, ఐటీడీఏ పీఓ, అడిషనల్ కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, డీఆర్‌డీఓ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్‌పీ చైర్‌పర్సన్‌లు ఉంటారు. కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో పోడు భూముల గుర్తింపు, అటవీ హక్కు పత్రాలు జారీ ప్రక్రియలు కొనసాగుతాయి.

ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులను భాగస్వాములను చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఆదివాసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో జీఓను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ చట్టం అమలు నిలిపివేయాలని కేసు నడుస్తోంది. ఈ కేసులు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో పోడుపై ఆధారపడిన గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అటవీ అధికారులతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి.

వాసం ఆనంద్ కుమార్

కేయూ, వరంగల్

Advertisement

Next Story

Most Viewed