ఈ బదిలీలు పాలనలో భాగమేనా ..!

by Ravi |   ( Updated:2024-03-01 01:00:52.0  )
ఈ బదిలీలు పాలనలో భాగమేనా ..!
X

ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో... లేదంటే దీర్ఘకాలం రెండు మూడేళ్లు పైబడి ఒకే చోట పని చేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం సహజం. కానీ ఇటీవలి ఐఏఎస్‌ల బదిలీల నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్‌లను గతంలో వారు చేస్తున్న స్థానం నుంచి కొత్త చోటుకు బదిలీ చేసిన సందర్భంలో మీడియాలో వచ్చిన కథనాలు పాలనా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. సివిల్ సర్వీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలతో ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది కూడా.

దిగజారుతున్నారా... దిగజారుస్తున్నారా..?

సివిల్ సర్వీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలతో ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వేటు..! సీఎం కార్యాలయంలో పనిచేసిన సీనియర్ అధికారి తొలగింపు..! లాంటి వార్తా కథనాలు బ్యూరోక్రసీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో పనిచేసిన పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సందర్భంలో వారిపై వేటు వేశారని బాధ్యతల నుంచి తప్పించారని కథనాలు వచ్చాయి. ఇది దేనికి సంకేతం.. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించడం లేదా వేటు వేయడం అంటే ఉద్యోగ ధర్మంలో వారు నిక్కచ్చిగా పనిచేయకపోవడం, లేదంటే అవినీతి ఊబిలో కూరుకుపోవడం జరిగిన సందర్భాల్లోనే వేటు వేయడం జరుగుతుంది. లేదంటే సహజంగా అందరూ ఐఏఎస్ అధికారుల బదిలీల మాదిరిగానే వారి బదిలీలను చూడాలి. గతంలో నాటి సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొంతమంది ఐఏఎస్ అధికారులకు ఉన్నఫళంగా కీలక పదవులు దక్కాయన్నది ఐఏఎస్ వర్గాల్లోనూ ప్రచారం ఉంది. అలాంటి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లూప్ లైన్ పోస్టుల్లోకి పంపింది. ఇదే సందర్భంలో అలాంటి అధికారులపై అనేక అవినీతి ఆరోపణలు సైతం తెరపైకి వచ్చాయి. దీన్నిబట్టి అత్యంత ఉన్నత హోదా కలిగిన ఐఏఎస్ అధికారుల దిగజారుడుతనం బయటపడింది. మరి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దల వద్ద మోకాళ్ళకు మడుగులొత్తుతూ దిగజారుతున్నారా..! పాలకులే వారిని దిగజారుస్తున్నారా..! అన్నది సంశయంగా మారింది.

గత అనుభవాలను మరిచిపోతున్నారా..?

మై యే భారత్ కే సంవిధాన్ ప్రతీ... అంటూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి మరీ బాధ్యతలను స్వీకరించే అవకాశం సివిల్ సర్వీస్ అధికారులకు మాత్రమే దక్కుతుంది. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అంతటి ప్రాధాన్యత ఉంది. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే సామాన్యుడు నోటి వెంట వెలువడే పదం... నేను కలెక్టర్ దగ్గరికి వెళతానంటూ తన ఆవేదన వెల్లగక్కే సందర్భాలు అనేకం చూస్తూనే ఉంటాం. సామాన్యుడికి అదొక భరోసా. అలాంటి ఉన్నత హోదాకు మాయని మచ్చను తెస్తూ సివిల్ సర్వీసెస్ కు కళంకం తెస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు చూస్తే బాధ కలగక మానదు. ఇటీవలనే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తదితరులపై భూములకు సంబంధించిన ఫిర్యాదులు బయటపడ్డాయి. హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ప్రత్యక్ష విచారణలో ఐఏఎస్ అధికారుల పేర్లు చెప్పినట్లు కూడా కథనాలు వచ్చాయి. కార్ రేస్ పోటీలకు సంబంధించి 50 కోట్ల రూపాయలు పైగా ఎటువంటి ఫైల్ మూమెంట్ లేకుండా నోటిమాటగా మంత్రి చెబితే చెల్లించామంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి పేర్కొనడం చూస్తే పాలన విభాగం ఏ స్థాయిలో గాడి తప్పిందో అర్థం గాక మానదు.

ఎస్ కృష్ణ మోహన్,

సీనియర్ జర్నలిస్ట్,

94404 43554

Advertisement

Next Story

Most Viewed