ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా?

by Ravi |   ( Updated:2024-10-17 01:16:11.0  )
ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా?
X

మొన్న నియామక పత్రాలు ఇచ్చిన టీచర్ ఉద్యోగ నియామాకాల్లో ఒక జిల్లాలో 6వ ర్యాంక్ వచ్చిన బీసీ- డి అబ్బాయికి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ ర్యాంకు వచ్చిన ఓసీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్ రాలేదు, 452 వ ర్యాంకు వచ్చిన ఓసీ అమ్మాయికి జాబ్ వచ్చింది. మరొక జిల్లాలో 70 వ ర్యాంక్ వచ్చిన రవళి బీసీ- బి అమ్మాయికి ఉద్యోగం రాలేదు, 180వ ర్యాంక్ వచ్చిన ఓసి అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఇంకో జిల్లాలో 70వ ర్యాంక్ వచ్చిన బీసీ- డి అబ్బాయికి జాబ్ రాలేదు, కానీ 385 ర్యాంక్ వచ్చిన ఓసీ అబ్బాయికి జాబ్ వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగిన అన్యాయానికి కొన్నిఉదాహరణలు మాత్రమే..!

తెలంగాణ ప్రభుత్వం 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్స్ వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు ముఖ్యంగా బీసీ బిడ్డలకు రావలసిన 11 వందల ఉద్యోగాలు రాకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే, ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ల వల్ల 3000 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు కోల్పో యారు. అంటే బీసీ బిడ్డల నోటికాడి కూడును అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేర అగ్రకులాల పిల్లలకు కట్టబెట్టారు. ఈ నష్టానికి కారకులెవరు? ఈ విధానాన్ని తెచ్చిన పాలకులు దీనిని ఎలా సమర్థించుకుంటారు? ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా? ఏ దేశ రాజ్యాంగమైన ఇలాంటి విధానాన్ని అనుమతిస్తుందా? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా?

రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి?

తరతరాలుగా దోపిడీకి గురైన కులాలకు, సామాజికంగా వివక్షతకు గురి అయిన కులాలకు, విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాతలు సామాజిక కోణంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిందే రిజర్వేషన్ విధానం. నిజానికి రాజ్యాంగ రచనలోనే బీసీలకు అన్యా యం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్లు ఆనాడే లభించాల్సింది. అంబేద్కర్ ఆ ప్రయత్నం చేసినప్పటికీ అగ్ర కులాలతో నిండిన రాజ్యాంగ సభ ఆ ప్రయత్నాలను అడ్డు కుంది. అందుకే రాబోయే ప్రభుత్వాలు ఇతర వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం తగు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం పేర్కొంది. ఇందుకై 1950 నుంచి బీసీలు పోరాటం చేస్తే కాక కాళేశ్వర్ కమిషన్ వేసి, రిపోర్ట్స్‌ను కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. జనతా ప్రభుత్వం బీసీల స్థితిగతుల అధ్యాయనానికి మండల కమిషన్‌ను నియమించినప్పటికి రిపోర్టు ఇచ్చే నాటికి ప్రభుత్వం కూలిపోవడంతో ఆ రిపోర్టును అటకెక్కించారు. చివరకు వీపీ సింగ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే.. వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చి వేశారు. ఇలా 40 సంవత్సరాలు పోరాడితే గానీ బీసీలకు రిజర్వేషన్లు రాలేదు. ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుకుంటున్న సమయంలో.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం.

సూపర్ న్యూమరీ పోస్టులేవి..?

నాడు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఆ పార్టీయే ఏ రకమైన పోరాటం చెయ్యకపోయినా, కమిషన్ రిపోర్టు లేకపోయినా, ఏకపక్షంగా, మెజారిటీ ఉందని, రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకవచ్చి ఇప్పుడిప్పుడే ఓపెన్ కేటగిరిలో పోటీ పడుతున్న బీసీ బిడ్డల నోట్లో మట్టి కొట్టింది. తాన తందాన అన్నట్లు బీసీ కమిషన్లు సూచించిన విధంగా బీసీ రిజర్వేషన్స్ పెంచమంటే 50 శాతం సీలింగ్ విధించిన న్యాయశాఖ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ద్వారా 50 శాతం సీలింగ్ దాటిన రిజర్వేషన్లను సమర్ధించడం విస్మయానికి గురిచేసింది. ఈడబ్ల్యూఎస్ అమలుకై విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా 10 శాతం సీట్లను పెంచుతామని తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం జరగదని నమ్మబలికిన కేంద్రం ఎన్ని విద్యాసంస్థల్లో 10 శాతం సీట్లు పెంచింది? సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తాం అన్న కేంద్రం ఏ శాఖలో ఎన్ని పోస్టులు సృష్టించింది? ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రత్యేక సీట్లు, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించే అమలు చేస్తున్నాయా? మన రాష్ట్రంలో వైద్య విద్యాసంస్థలో ఏమి జరిగింది?

ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం!

ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఓసిలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా వర్తింపజేసిన కొంత న్యాయంగా అనిపించేది. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తిస్తే ఈడబ్ల్యూఎస్ వర్తించదని ప్రత్యేక నిబంధన పెట్టి ఓసి పక్షపాతాన్ని చాటుకుంది. ఓసిలకే ఈ డబ్ల్యూ ఎస్ అన్నప్పుడు ఓపెన్ కేటగిరీ 50శాతంలో నుంచే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం తీయాలి. కానీ మొత్తం 100%లో 10 శాతం తీయడం అంటే అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్టులని లాగేసుకుని ఓసీలకు ఇచ్చినట్లు కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక నిబంధన, అగ్ర వర్ణ కులాలకు ఒక నిబంధననా? ఉపకార వేతనాలు పొందాలంటే ఎస్సీలకు రెండు లక్షల ఆదాయం, ఎస్టీలకు రెండు లక్షల ఆదాయం, బీసీలకు 3 లక్షల ఆదాయం ఉండేట్లు మాత్రమే ఆదాయం సర్టిఫికెట్స్ ఉండాలంటారు. అప్పుడే ఆయా సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయంటారు. అగ్రవర్ణ కులాలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ కోసం ఎనిమిది లక్షల ఆదాయం వరకు ఎందుకు అనుమతించారు. ఇది ఏ న్యాయ సూత్రాల ప్రకారం సమంజసం. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదా?

నష్టాన్ని ఎలా నివారించాలి?

ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకొని నేటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో వారందరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను వెరిఫై చేయాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ టికెట్లు జారీ చేశారా లేదా? అని నిగ్గు తేల్చాలి. అక్రమంగా సర్టిఫికెట్ పొందిన వారిని ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నేటి వరకు వారు పొందిన జీతభత్యాలను రికవరీ చేయాలి. ఆయా స్థానాల్లో ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. బీసీ బిడ్డలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి లేదా ఈ రిజర్వేషన్లను 1 శాతానికి తగ్గించాలి. లేదా బీసీ రిజర్వేషన్లను పెంచాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్లను పెంచడం ద్వారా రిజర్వేషన్ల ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం చేసినట్లు అవుతుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలును నిలిపివేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలి.

జుర్రు నారాయణ యాదవ్

సామాజిక విశ్లేషకులు,

94940 19270

Advertisement

Next Story