- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చట్టం ముందు అందరూ సమానులేనా?
దేశంలోనే అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐ ఇటీవల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీబీఐని ఉద్దేశించి మాట్లాడుతూ, అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనప్పటికీ సీబీఐ అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సత్యానికి, న్యాయానికి సీబీఐని బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు. అవినీతిపరులు ఎవరూ తప్పించుకోకూడదని, దేశం, చట్టం, రాజ్యాంగం సీబీఐతో ఉంటాయని ప్రధాని భరోసా ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం సీబీఐ పని విధానం భిన్నంగా ఉంటోంది. టన్నుల కొద్దీ సాక్ష్యాలతో నేర తీవ్రత కళ్లకు కనపడుతున్నా.. విచారణ ఎందుకు ఏళ్ల తరబడి సాగుతోందన్నది పెద్ద ప్రశ్న.
హంతకులపై, అవినీతిపరులపై కేసులు విచారించేందుకు 1963 ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ఆవిర్భవించింది. రాష్ట్ర పోలీసులు నిగ్గు తేల్చలేనివి, అత్యంత కీలకమైన కేసుల విచారణ లక్ష్యంగా సీబీఐ ఏర్పడింది. సీబీఐ కేసుల్లో విచారణ జరుగుతున్న తీరు, జాప్యం, ఆ సంస్థలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం రానురాను సన్నగిల్లింది. సీబీఐ పంజరంలో చిలుకగా మారిందని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చాలాసార్లు రుజువవుతున్నాయి. చిల్లర దొంగలను, చిన్న చిన్న నేరస్థులను శిక్షించడంలో మన నేరవిచారణ సంస్థలకు ఉన్న శ్రద్ధ, వేల కోట్లు దోచిన రాజకీయ నాయకులు, హంతకులను శిక్షించడంలో ఎందుకు లేదు చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తి కొందరికే వర్తిస్తోంది. చిన్న చేపలకు పెద్ద శిక్షలు పడుతున్నాయి. తిమింగలాలు మాత్రం తప్పించుకు తిరుగుతున్నాయి. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారాయి.
నేరస్థులను నిగ్గుతేల్చి నేరస్థులను శిక్షించడానికి జవసత్వాలతో కూడిన వ్యవస్థలను రాజ్యాంగ నిర్మాతలు జాతికి అందించారు. ఆ వ్యవస్థలన్నీ చచ్చుబడటంతో నేరగాళ్లు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వేలకోట్లు ప్రజాధనం దోపిడీ చేసినా, అమాయకులను అంతమొందించినా సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడం ఏమిటి? చట్టబద్ధంగా ఎవరు ఎదిగినా, ఎంత సంపాదించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. జగన్ అవినీతి కేసుల విచారణ ఇంకెన్నాళ్లు సాగిస్తారు? అవినీతిలో జగన్ రెడ్డి కొత్త పుంతలు తొక్కిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనేది సాక్ష్యాధారాలతో సహా సీబీఐ బయటపెట్టింది. 11 సీబీఐ, 6 ఈడీ చార్జిషీట్లను నమోదు చేసింది. ప్రాథమిక విచారణలో రూ.43 వేల కోట్లు ప్రజాధనం దోపిడీ చేసినట్లు నిగ్గుతేల్చింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది. 16 నెలలు జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత సీబీఐ విచారణ కొనసాగిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.
జగన్ రెడ్డి స్థానంలో మరొకరు ఉండి ఉంటే.. విచారణ ఇలాగే జరిగేదా? జగన్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు బెయిలిస్తే దోపిడీకి లెసెన్స్ ఇచ్చినట్లేనని ఆనాడు న్యాయస్థానంలో సీబీఐ చేసిన వాదన. కానీ తర్వాత కాలంలో సాక్షాత్తు సీబీఐ... జగన్ రెడ్డి అవినీతికి లైసెన్స్ ఇచ్చి నిత్యం కాపాడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దేశ రాజకీయ చరిత్రలో ఇన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు మరొకరు లేరు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ తరహాలో అక్రమంగా సంపాదించిన రాజకీయ నాయకులను తన సర్వీసులో ఇప్పటివరకు చూడలేదని మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆర్థిక నేరస్థులను శిక్షించడంలో సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి?
ప్రతి ఏడాది సీబీఐ డజన్ల కొద్ది కేసులు విచారణ చేపడుతోంది. కానీ ఎన్ని నిక్కచ్చిగా, నిజాయతీగా విచారణ పూర్తయ్యాయో సీబీఐ ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఆలస్యానికి కారణమేంటో ఎవరికీ అంతుబట్టదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా దర్యాప్తు జరిగిన తీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. హత్య జరిగి నాలుగేళ్లు దాటింది. సీబీఐ విచారణ చేపట్టి మూడేళ్లు దాటింది. సూత్రధారులను, పాత్రధారులను గుర్తించినప్పటికీ దోషులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ విచారణను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసుల విచారణలో జాప్యం లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయతీగా దర్యాప్తు జరపాలి. ఆర్థిక నేరగాళ్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా, హంతకులు పార్లమెంట్ సభ్యులైనా వారిని శిక్షించకపోతే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుంది. విచారణ ఏళ్ల తరబడి సాగుతోంటే సాక్ష్యాలు తారుమారై, నిజాలు సమాధియై అసలు దోషులు తప్పించుకుంటారు. హంతకులను, ఆర్థిక నేరగాళ్లను నిగ్గుతేల్చి వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్
9949777727
- Tags
- law
- Are all equal