అవసరమైన సామాగ్రి..

by Sumithra |   ( Updated:2023-07-01 20:30:39.0  )
అవసరమైన సామాగ్రి..
X

న్యాయవాద వృత్తి వదిలి 35 సంవత్సరాలు అవుతోంది. 1989 మే నెలలో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. ఎంతోమంది వ్యక్తుల కేసుల ఫైళ్లు నా దగ్గర ఉండేవి. విచారణలో వున్న కేసుల్ని మిత్రులకి ఇచ్చేశాను. విచారణ పూర్తి అయిన ఫైల్స్ అట్లాగే నా దగ్గరే ఉండిపోయాయి. అదేవిధంగా కొత్త ‘లా’ పుస్తకాలు మిత్రులకి ఇచ్చేశాను. పాతబడినవి అట్లాగే నా దగ్గర ఉండిపోయాయి.

న్యాయవాద వృత్తికి సంబంధించిన వస్తువులు, కాగితాలు, పాత టైప్‌రైటర్ ఇట్లా ఎన్నో ఉండిపోయాయి. వాటిని మా ఇంట్లో అట్లాగే ఉంచేశాను. మూడు నెలలకొకసారి మా ఊరు వెళ్లినప్పటికీ వాటిని ఎప్పుడూ సర్దే ప్రయత్నం సీరియస్‌గా చేయలేదు. మా ఊళ్లో రెండు మూడు రోజులకి మించి ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఆ పని చేయలేదు. ఈ మధ్య ఒక్కసారి వాటిని దులిపించి చూసే ప్రయత్నం చేశాను.

ఎన్నో కాగితాలు, లెక్కల పుస్తకాలు, క్లయింట్లు ఇచ్చిన డబ్బుల వివరాలు, వాళ్లు రాసిన కార్డు ముక్కలు, రసీదులు, ఇంటి కిరాయి బాపతు లెక్కలు, కేసు దాఖలు చేసేటప్పుడు ఉపయోగించే ఫారమ్స్. ఇట్లా ఎన్నో కన్పించాయి. పాత ‘లా’ పుస్తకాలు, అందులో రాసుకున్న నోట్స్, టైపిస్ట్‌కి రాసిచ్చిన చేతిరాత కాగితాలు, అప్పటి న్యాయవాద మిత్రులతో కలిసి దిగిన ఫొటోలు, ఇంక్ ప్యాడ్స్, బాటిల్స్ ఇట్లా ఎన్నో కన్పించాయి. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. జ్ఞాపకాలతో నిండిపోయింది.

స్వంత ఇంట్లో అవి ఉంచడం వల్ల వాటివైపు తిరిగి చూసే అవకాశం కన్పించలేదు. అదే కిరాయి ఇంట్లో అయితే పరిస్థితి వేరుగా ఉండేది. ఇల్లు ఖాళీ చేసినప్పుడు మనం వాడని వస్తువులని, అవసరం లేని వస్తువులని పారేసే అవకాశం ఉంటుంది. అవి రసీదులు కావొచ్చు. బట్టలు కావొచ్చు. కాగితాలు కావొచ్చు. వాడిన వస్తువులు కావొచ్చు.

జ్ఞాపకాని కోసం రకానికి ఒకటి రెండు ఉంచుకొని మిగతావి తీసివేశాను. పాత ‘లా’ పుస్తకాలని తీసివేశాను. సాహిత్య పుస్తకాలని స్కాన్ చేశాను. ఇల్లు కాస్త తేలికైంది. మనస్సు బరువెక్కింది. అవసరం లేని సామాగ్రిని తీసివేశాను. ఇంతకీ మనిషికి అవసరమైన సామాగ్రి ఏమిటి మనస్సులో ఈ ప్రశ్న ఉదయించింది.

మన జీవితానికి అర్థం ఇచ్చేది ఏదైనా అవసరమైన సామాగ్రే. ప్రేమించే మనస్సు, ఆనందించే హృదయం, కాస్త మంచితనం, తిరిగి ఆలోచించే గుణం, దయ కరుణ చూపించే మనస్తత్వం. ఇవి మనిషికి అవసరమైన సామాగ్రి. వీటిని కొనలేం. అమ్మలేం. పారేయలేం. వీటిని ఎంపిక చేసుకోగలం. సృష్టించగలం. ఇతరులకి ఇవ్వగలం. అంతే కానీ పారేయలేం. ఇవి ఎంత ఎక్కువైనా మనస్సు బరువెక్కదు. వీటిని సర్ది పారేయాల్సిన అవసరం ఉండదు.


మంగారి రాజేందర్

94404 83001

Advertisement

Next Story