చంద్ర మండలంపై విక్రమించిన.. ఇస్రో మేధో ప్రజ్ఞానం

by Vinod kumar |   ( Updated:2023-08-23 23:45:24.0  )
చంద్ర మండలంపై విక్రమించిన.. ఇస్రో మేధో ప్రజ్ఞానం
X

“త్వం సోమం ప్రతికషో మనీషా త్వం, రజష్ఠ మనునేసి పంథాం” - రుగ్వేదం

'ఓ చంద్రుడా.. మేం మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం. మాకు దారిచూపు'. కోట్లాది మంది భారతీయుల ప్రార్దనలు, ఫలితం ఇస్రో శ్రాస్తవేత్తల మేధోమధనం అకుంఠిత దీక్ష, ఆంకితభావం వెరసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. 3,900 కేజీల బరువుతో పాటు కోట్లాది భారతీయుల ఆశలను మోసుకుని 3,84,400 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం పట్టు సడలకుండా విక్రం సజావుగా ల్యాండ్ అయ్యింది. చంద్రమండలంపై భారత మేధో ప్రజ్ఞానం మరిన్ని ప్రయోగాలకు కొత్త జాడవేసింది. ప్రయత్నం ఎప్పటికి వృధా పోదు.. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.. కొన్ని సార్లు చిన్న ప్రయత్నం. నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది ఇది గీత సారం.. దీనిని అన్వయించుకుంది భారత ఆంతరిక్ష పరిశోధనా సంస్ద ఇస్రో.

ఈరోజు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు మన దేశం వైపు చుస్తున్నాయంటే దానికి ఇస్రో శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే.. ఇస్రో ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.. తడబడుతూ మొదలు పెట్టిన భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం ఈరోజు ఖగోళం వైపు చూస్తోంది.. చందమామపై అడుగు పెట్టడానికి ఇస్రో చేసిన ప్రయత్నాలు, ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఏ మాత్రం వసతులు, పనిముట్లు లేకపోయినా.. భారత్ చందమామ కలలు కనడంపై నవ్వుకున్నాయి.. ఆ దేశాలే ఈరోజు ఇస్రో చేస్తోన్న ప్రయోగాలపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అకుంఠిత దీక్షతో సాగిన సుదీర్ఘ ప్రస్థానం..

భారత దేశానికి ఆంతరిక్ష ప్రయోగాలా! ఆని పెదవి విరిచిన పెద్ద దేశాలు సైతం తమ అంతరిక్ష కార్యకలాపాలకు, ఉపగ్రహల ప్రయోగానికి భారత వైపు చూస్తున్నాయి. హాలివుడ్ చిత్ర నిర్మాణ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఖచ్చిత్వంతో కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్ట గలిగే స్దాయికి ఇస్రో చేరుకుంది. అకుంఠిత దీక్షతో మేధో మధనంతో సాగిన సుదీర్ఘ ప్రస్దానం. భారత అంతరిక్ష సంస్ద రూకల్పనకు , కార్యచరణ విధివిధానాలను విక్రమ్ సారాభాయ్ రూపొందించారు. ఆ తర్వాత, ఎం జి కే మీనన్, సతీష్ ధావన్, యు.ఆర్. రావు, కే. కస్తూరి రంగన్, జి. మాధవన్ నాయర్, కే. రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఎ. ఎస్. కిరణ్ కుమార్, కె. శివన్ వేసిన పునాదులే నేడు మన దేశాన్ని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా ఎంతో ఎత్తున నిలిపాయి.


1960లో బుడిబుడి అడుగులతో చిన్న చర్చిలో మొదలు పెట్టి తిరువనంతపురం తుంబా రాకెట్ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రయోగాలకు ఆంతరిక్ష విజ్ఞాన కార్యకలాపాల రూప కల్పనతో అడుగు పెట్టిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అభివృద్ధి చెందుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ ప్రయోజనాలకు రోదసిని సద్వినియోగం చేసుకుంటూ,. సొంతంగా తయారు చేసిన ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టగలిగే ఆరు దేశాల్లో ఒకటిగా తలమానికమై నిలుస్తోంది. చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలవడంలో ఇస్రో పాత్ర అనన్య సామాన్యం.

నేర్చుకోవడంలో తొలి ప్రయత్నం..

ఫెయిల్ ఆంటే విఫలం కాదు.. ఫస్ట్ ఎటెంప్ట్ ఇన్ లెర్నింగ్ - నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని చెప్పిన ఆబ్దుల్ కలాం మాటలు మన ఇస్రో శాస్త్రవేత్తలకు స్పూర్తి మంత్రాలైనాయి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 రూపకల్పన, సాంకేతిక వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని, లోపాలను సరిదిద్ది అత్యున్నత ప్రమాణాలలో స్వయం నిర్ణయం తీసుకునే అల్గోరిథంని రూపొందించి కృతిమ మేధస్సుతో పనిచేసే విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ని రూపొందించింది ఇస్రో. చంద్రయాన్-1. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం.22 అక్టోబర్ 2008న చంద్రుడి వద్దకు చంద్రయాన్-1ను ప్రయోగించి విజయం సాధించింది. చంద్రయాన్ -1 జీవితకాలం 312 రోజులు. ఆగష్టు 29, 2009 నాటికి చంద్రుడిని 3400 సార్లు చుట్టేసింది. ఆ సమయంలో చంద్రమండలంలో ఆవిరి రూపంలో నీటి ఆనవాలను గుర్తించింది.

చంద్రయాన్ 1 కనుగొన్న అంశాలు..

చంద్రయాన్ -1 నీటి ఆనవాలను ఉత్తర ధృవ ప్రాంతంలో గుర్తించడంతో పాటు చంద్రుడిపై మెగ్నీషియం, అల్లూమినియం, సిలికాన్‌ వంటి ఖనిజాలను కూడా గుర్తించింది. దీంతో పాటు చంద్రుడి ఫోటోలు కూడా తీసి భూమికి పంపడం ఇస్రో సాధించిన మరో విజయం . చంద్రయాన్ -1 పంపిన సమాచారంతోనే 2014లో మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్)ను విజయవంతంగా ప్రయోగించగలిగారు మన ఇస్రో శ్రాస్త్రవేత్తలు.


చంద్రయాన్ 2 పనేంటంటే చంద్రుడి మీదకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రయోగం జరగని చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్‌ను దింపి రోవర్‌ను నడిపించాలని ప్లాన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. 2019 జులై 22న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమై క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటోందని శాస్త్రవేత్తలు భావించారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్‌లోని థ్రస్టర్ ఇంజిన్లు మండించి, ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో వ్యోమనౌక వేగాన్ని తగ్గించారు. కానీ ఉపరితలానికి 500 మీటర్ల దూరంలో అది నియంత్రణ తప్పి క్రాష్ అయ్యింది. అక్కడి ప్రతికూల వాతావరణమే దీనికి కారణం.

ప్రజ్ఞాన్ సజావుగా దిగటానికి ఇస్రో చేసిన కసరత్తు..

భారీ బండ రాళ్లు, గుంతలు, గడ్డకట్టిన మట్టితో చంద్రుని ఉపరితలంపై పరిస్థితులు ల్యాండింగ్‌కు ఏమాత్రం సహకరించవు. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలాన్ని పోలిన కృత్రిమ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఇస్రో పరీక్షలు చేసింది. తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టి చంద్రయాన్ -2లో ఉపయోగించిన సక్సెస్ డిజైన్‌కు బదులుగా చంద్రయాన్‌-3 ఫెయిల్ అండ్ సేఫ్ మోడల్‌కు రూపకల్పన చేశారు. జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి బయలుదేరిన చంద్రయాన్ 3... 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై సజావుగా దిగింది చంద్రయాన్ 3తో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, ఆ ఘనత సాధించిన తొలి దేశం భారత్‌.

చంద్రయాన్‌-3 ముఖ్య ఉద్దేశాలు..

జాబిల్లి ఉపరితలంపై వ్యోమనౌకను సురక్షితంగా దించడం. చంద్రుడిపై రోవర్‌ను నడపడం. అక్కడికక్కడే సహజ వాతావరణంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం. ఇప్పటివరకూ అమెరికా, చైనా, రష్యా మాత్రమే చందమామపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించాయి. జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ఇవి కూడా ఇంతవరకూ చేరుకోలేదు. మొత్తం బడ్జెట్‌ రూ. 600 కోట్లు

దక్షిణ ధ్రువం పైనే ఎందుకు..?

సౌర కుటుంబంలో భూమికి అతి దగ్గరగా ఉన్న ఖగోళం చంద్రుడే. అందుకే చంద్రుడి మీద ప్రయోగాలు చేసేందుకు భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. దీనివల్ల ధ్రువాల దగ్గర ఆరు నెలలు పగలు, ఆరు నెలలు చీకటి ఉంటుంది. కానీ చంద్రుడి అక్షం దాదాపుగా సూర్యుడికి లంబకోణంలోనే ఉంటుంది. శాస్త్రవేత్తల లెక్కలప్రకారం ప్రకారం.. చంద్రుడి అక్షం 88.5 డిగ్రీలు నిటారుగా ఉంటుంది. అంటే కేవలం ఒకటిన్నర డిగ్రీలు మాత్రమే వంపు తిరిగి ఉంటుంది. అంటే చంద్రుడి ధ్రువ ప్రాంతాలను సూర్య కిరణాలు తాకినపప్పటికీ, అక్కడున్న క్రేటర్ల లోతుల్లోకి సూర్య కిరణాలు చేరుకోలేవు. ఇలా చంద్రుడి ధ్రువ ప్రాంతంలోని క్రేటర్లు సుమారు రెండు బిలియన్ ఏళ్లుగా సూర్యరశ్మి చేరకుండా అతి శీతల స్థితిలోనే ఉండిపోయాయి. ఇలా చంద్రుడి మీద సూర్యరశ్మి చేరని ప్రాంతాలను పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్స్ అంటారు. అలాంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ల్యాండవ్వడం, సాంకేతిక ప్రయోగాలు చేయడం వంటివి చాలా కష్టం.


చంద్రుడి మీద ఉండే క్రేటర్లు చాలా విశాలంగా ఉంటాయి. వాటిలో కొన్ని క్రేటర్లు వందల కిలోమీటర్ల వ్యాసంతో ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు, కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువానికి దగ్గర్లో 70వ అక్షాంశం దగ్గర చంద్రయాన్ 3 ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. చంద్రయాన్ 3 దక్షిణ ధృవంలో గడ్డకట్టిన మట్టిలో నీటి జాడల్ని గుర్తిస్తే..అది భవిష్యత్ ప్రయోగాలకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. చంద్రుడి మీద నీటిని గుర్తించగలిగితే... దాని నుంచి ఆక్సిజన్ కూడా తయారు చేసుకోవచ్చు. అది అక్కడ మానవ నివాసానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. అంతే కాదు.. చంద్రుడి మీదనే అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రయోగాలు చేసేందుకు అవసరమైన ప్రొపెల్లంట్‌గా కూడా ఆక్సిజన్ ఉపయోగించుకోవచ్చు.

సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్..

చంద్రయాన్-3, 900 కేజీలు బరువుతో పాటు కోట్లాది భారతీయుల ఆశలను మోసుకుని 3,84,400 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి 5 దశలలో కక్ష్యను మార్చుకుంటూ వేగాన్ని అదుపు చేసుకుంటూ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్ ’అయ్యింది విక్రం చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం కోసం అక్కడి మట్టి నమూనాలను సేకరించడం కోసం నీటి జాడ కనిపెట్టడం కోసం, అలాగే సౌరకుటుంబ అవిర్బావ రహస్యాలు తదితర విషయాలను 14 రోజుల పాటు అధ్య ప్రజ్ఞానంతో అధ్యయనం చేసి ఆ వివరాలను భూమికి పంపుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. ఇస్రో మొదటి నుంచి చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఆన్వేషించాలనే పూనికతో అకుఠిత దీక్షతో అంకిత భావంతో సమిష్టిగా శ్రమించింది, విజయాన్ని సాధించింది. ఆచంద్ర తారార్కం గుర్తుండేలా విక్రమానికి గుర్తుగా జాతీయ చిహ్నాన్ని, ప్రజ్ఞకు గుర్తుగా ఇస్రో ముద్రను చంద్రునిపై ముద్రించి సగర్వంగా వినువీధిలో మన గౌరవాన్ని చాటింది. జయహో ఇస్రో..


- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed