- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరస్పర సహకారానికి చిహ్నం రాఖీ
మన దేశంలో నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది. అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే.. ఆ మాసానికి ఆ నక్షత్రం పేరును పెట్టారు. అలా శ్రావణ నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం పేరు శ్రావణంగా మారింది. నక్షత్రాధిపతి అయిన చంద్రుడి మాసంలోని 15వ రోజున ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాడో ఆ రోజు శ్రావణ పౌర్ణమిగా పరిగణించబడుతుంది. ‘రాకా చంద్ర సమాన కాంతి వదనామ్’ ఈ వాక్యంలో' రాకా' అనే మాటకు తనకున్న పదిహేను కళలతో కూడిన చంద్రుడు ఉన్న పౌర్ణమి అని అర్థం.
ఈ పౌర్ణమి రోజున కట్టే రాకా సంబంధం ఉన్న తాడును ‘రాఖీ’ అని అంటారు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఉదయ కాలంలో స్నానమాచరించిన వ్యక్తి తానెవరికి రక్షణగా సంవత్సర కాలం పాటు ఉండదలచాడో వారి మణికట్టుకి కట్టి ముడివేసి దానిని పరమ పవిత్రంగా భావించి దానిపై అక్షతలను మనః పూర్వకంగా వేయాలని హేమ చంద్రీయం అనే గ్రంథంలో పేర్కొనబడిందని పండితుల విశ్లేషణ.
పురాణాల ప్రకారం..
శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందంటారు. అలాగే వృత్తాసురుడనే రాక్షసునితో ఇంద్రుడు యుద్ధం చేస్తుండగా ఓడిపోయే పరిస్థితి సంభవించినపుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టిందని దీనితో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించాడని అలా రాఖీ పౌర్ణమి ఆరంభమైందని కథనం. అలాగే చిత్తోర్ గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్ర నుంచి తమ రాజ్యాన్ని రక్షించవలసినదిగా కోరడం జరిగిందని కూడ కథనం. అలాగే విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీక్ యువరాజైన అలెగ్జాండర్ క్రీ.పూ 326 లో భారతదేశంపై దండెత్తి వచ్చినపుడు ఆ క్రమంలో బాక్ట్రియన్ యువరాణిని వివాహం చేసుకొని, ఈ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం- చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దీంతో పురుషోత్తముడి వీరత్వం తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా ఆయనను తన సోదరునిగా భావించి రాఖీ కట్టడం, ఆ యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ గనుక ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం వచ్చినప్పటికీ, పురుషోత్తముడు అతడిని చంపకుండా వదిలేయడం జరిగిందనే కథనం కూడా ఉంది.
రక్షణగా ఉంటానని..
రక్షను కట్టే ప్రతి సోదరి కూడా తన సోదరులు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీని కట్టి ఎల్లప్పుడు అన్నకు అండగా ఉంటానని, అదే విధంగా రాఖిని స్వీకరించిన అన్న కూడా తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండగ ద్వారా తెలియజేస్తారు. సోదరునికి రక్షను కట్టే ప్రతి సోదరి బొట్టు పెట్టి, హారతిని ఇచ్చి, స్వీట్స్ తినిపిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా సోదరుడు ఇచ్చేటువంటి ఏ కానుక అయినా సరే విలువైనదిగా, తీపి జ్ఞాపకంగా భావిస్తారు. సోదర సోదరిమణుల మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు ఈ రాఖీ పండగ అద్దం పడుతుంది. ఏ బంధం లేకున్నప్పటికీ సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరు రక్ష కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. అంతే కాకుండా మిత్రులు సైతం నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి రక్ష అని ఈ రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించుకునే సంస్కృతి..మన దేశ ఔన్నత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణలో భాగంగా సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా మంట గలువకుండా ఉందంటే కారణం మనం జరుపుకునే ఇటువంటి పండుగలే..ప్రధాన కారణం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, ఐకమత్యాలకు పరస్పర సహకారానికి చిహ్నంగా ఈ రక్షాబంధన్ పండగ నిలుస్తుంది.
నరేందర్ రాచమల్ల
99892 67462