- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజాం వెంకటేశంకు అలిశెట్టి పురస్కారం
తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా తరఫున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12 న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంను గత పది సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతోంది. 2023కి గాను ఈ పురస్కారాన్ని నిజాం వెంకటేశంకు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 12 న కరీంనగర్‌లో ఈ పురస్కారాన్ని సభాముఖ గౌరవాలతో అందించడం జరుగుతుంది. నిజానికి ఇదొక విషాదకర విచిత్ర సందర్భం. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి నిజాం వెంకటేశం ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన 2022 సెప్టెంబర్ 18న మరణించారు. ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన అలిశెట్టిది అకాల మరణమైతే నిజాంది అసాధారణ మరణం అనుకోవాలి. ఏ రుగ్మతలు బయటపడకుండానే అకస్మాత్తుగా ఒక పూట వ్యవధిలోనే ఆయన ప్రాణం వదిలారు. అనూహ్యంగా వెళ్ళిపోయి ఆయన కుటుంబానికి, బంధు మిత్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
వారిరువురి అనుబంధం
అలిశెట్టి ప్రభాకర్, నిజాం వెంకటేశంల మధ్యనున్న అనుబంధం చెప్పాలంటే గురుశిష్యులు, అన్నదమ్ములు అనే బంధాలను రెంటిని కలిపి చూడాలి. ప్రభాకర్‌కు సుమారు ఇరవయ్యేళ్ళ వయసులో జగిత్యాలలో మొదలైన వారి పరిచయం గాఢంగా మారి ప్రభాకర్ వెంట కరీంనగర్, హైదరాబాద్ దాకా సాగింది. ప్రభాకర్ కవిత్వాన్ని ఇష్టపడి ఆయనకు దగ్గరైన వెంకటేశం ప్రభాకర్ మరణానంతరం కూడా బాధ్యతగా ఆయన కుటుంబానికి చేదోడుగా ఉన్నారు. ప్రభాకర్ క్షయ వ్యాధితో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోచిన సాయం చేసేవాడు. ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితికి తీవ్రంగా చలించిన నిజాం 1988లో బలవంతంగా ఆయన్ని జగిత్యాలకు రప్పించారు. ప్రభాకర్‌ను డాక్టర్‌కు చూయించి, మందులు ఇప్పించి, పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించి, చేతిలో కొంత సొమ్ము పెట్టి 'ఆరోగ్యం బాగుపడింది అని డాక్టర్ ధృవీకరించాక ఎక్కడికైనా వెళ్ళు' అని చెప్పారు. అయితే సిటీలైఫ్ శీర్షిక ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో చెప్పాపెట్టకుండా ప్రభాకర్ హైదరాబాద్‌కు వచ్చేశాడు.
అయినా వెంకటేశం ఆయన వెంటపడడం మానలేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ప్రభాకర్‌ను కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవారు. అలిశెట్టికి ఆత్మాభిమానం జాస్తి. జేబు ఖాళీగా ఉన్నా ఒకరి సొమ్ము ఆశించేవాడు కాదు. తన భావజాలానికి విరుద్ధంగా ఉన్నవారిని పూర్తిగా దూరం పెట్టేవాడు. అయితే వెంకటేశం చేసే ఆర్థిక సాయానికి మాత్రం ప్రభాకర్ అడ్డు చెప్పేవాడు కాదు. ఆ చొరవ వారిద్దరి మధ్య మొదటి నుంచి ఉంది. వారిరువురి అనుబంధాన్ని ప్రస్తావిస్తూ అలిశెట్టి ఓ కవితలో- 'ఘల్లున గచ్చుమీద రూపాయి బిళ్ళ మోగినట్లు నిజాం వెంకటేశం వస్తాడు నన్నూ నా రోగాన్ని మందుల్నీ కవిత్వాన్నీ కవుల్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా కసితీరా తిట్టి మధ్యలో రూటు మార్చి మహాశ్వేతాదేవిని మెచ్చుకొని తరచుగా సాహిత్య సభల్లో పాల్గొనలేనందుకు నొచ్చుకొని నాకో వందిచ్చుకొని మరి నిష్క్రమిస్తాడు' అని అక్షర గురుదక్షిణ సమర్పించాడు.
ఆయన లేకున్నా మనమున్నామంటూ
పుట్టినరోజే అయిన జనవరి 12న 1993లో ప్రభాకర్ చనిపోయాడు. హైదరాబాద్‌కు మకాం మార్చిన నిజాం ప్రభాకర్ కుటుంబానికి అందుబాటులో ఉండేవారు. బతికున్న రోజుల్లో అలిశెట్టి అచ్చేయించిన ఆయన కవితా సంపుటాలతో పాటు విరసం వేసిన 'మరణం నా చివరి చరణం కాదు' సంపుటిని కలిపి ఒక సమగ్ర సంపుటిగా 2013లో 'అలిశెట్టి ప్రభాకర్ కవిత' సంపుటి తీసుకరావడంలోను వెంకటేశం ప్రధానపాత్ర పోషించాడు. కవిత్వం పట్ల అత్యంత ప్రేమతో 1980 దశకంలో వెంకటేశం 'దిక్సూచి' అనే కవితా సంచికలు వెలువరించారు. అలిశెట్టి దీర్ఘకవిత 'నిజరూపం' అందులోనే వచ్చింది. అలిశెట్టి కవితా చిత్రాలతో 'అక్షర నక్షత్రం మీద' అనే పుస్తకం ముద్రణ విషయంలో ఎంతో శ్రమించారు. ఆరేళ్లపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీలైఫ్ పేరిట ప్రభాకర్ రాసిన కవితా ఖండికలను విడిగా పుస్తకంగా తేవాలని ఆయన పదే పదే అనేవారు. అలిశెట్టి పేరిట ఏ పని చేయడానికైనా ముందుకొస్తూ 'ప్రభాకర్ లేదు, మనమున్నాం!' అనే వారు.ఇప్పుడు ఆయన కూడా లేకుండా పోయారు.
కరీంనగర్‌లో జరిగే అలిశెట్టి పురస్కార సభకు ప్రతి యేడు హుషారుగా వెళ్లి హాజరయ్యేవారు. ఇప్పుడు ఆయన లేని అదే వేదికపై ఆయన కుటుంబ సభ్యులు ఆయన కోసం ప్రకటించిన పురస్కారాన్ని అందుకుంటున్నారు. అలిశెట్టి పురస్కారానికి అన్ని విధాలా అర్హుడైన వెంకటేశం దానిని తాను భౌతికంగా లేకుండా అందుకోవడం ఒక శోక సన్నివేశం. ఒక ఉద్విగ్న సందర్భం. కవిగా అలిశెట్టికి , కవి పోషకుడిగా నిజాంకు సంయుక్తంగా అక్షర నివాళి.
-బి నర్సన్,
9440128169
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672