వ్యవసాయంలో ఏఐ విప్లవం

by Ravi |   ( Updated:2024-04-28 00:45:48.0  )
వ్యవసాయంలో ఏఐ విప్లవం
X

ఈ మధ్య జరిగిన జాతీయ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనిముట్లు, పరికరాల ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయ ఉద్యాన సాగు పరికరాలు, అనుబంధ పశు పోషణకు సంబంధించిన యంత్ర పరికరాలను విరివిగా ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న ఆధునిక మార్పులను గమనిస్తే భవిష్యత్తులో బతుకు బంగారు బాటలేసేది ఈ రంగమే ఆనడంలో సందేహమే లేదు.

టెక్నాలజీని ఉపయోగించి భూసార పరీక్ష మొదలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో చేసే ప్రయోగాలు అగ్రిటెక్‌లో విజయవంతమవుతున్నాయి, టెక్నాలజీ ద్వారా నీటి వృధా కాకుండా అతివృష్టి, అనావృష్టిలను అరికట్టి పంట నష్టాన్ని నివారించవచ్చు. వానాకాలం వార్తలను ఏఐతో ముందుగానే పసిగట్టి కాలానికి తగు పంటల్ని వేయచ్చని ప్రయోగాలు చెబుతున్న మాట. ఇలా టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో సాగు వల్ల నీరు, మందుల ఖర్చు తగ్గడమే కాకుండా 25 శాతం దిగుబడి పెరుగుతుందని సందర్శకుల మాట.

వ్యవసాయంలో డ్రోన్ విప్లవం

మారుతున్న కాలంతో పాటు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్‌ల వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం. డ్రోన్‌ అనేది వినేందుకు కొత్తగా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్‌లకు ఉండే అధునాతన సెన్సర్లు, డిజిటల్‌ ఇమేజ్‌ ద్వారా తమ పొలం చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. పైగా డ్రోన్ల సహయంతో పిచికారి చేస్తే రైతు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఒక డ్రోన్‌ పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లగలదు. అందుకే కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్‌లని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకం. కానీ దురదృష్టవశాత్తు, ఆర్ధికాభివృద్ధి లోటును మహిళలను విస్మరించడం జరుగుతున్నది. ఓ మహిళా రైతు మధ్యప్రదేశ్‌లో డ్రోన్‌ని ఉపయోగించి పంట తెగుళ్లను నివారించే మందులతో పిచికారి చేయడం వలన సగటున నెలకు యాభై వేల రూపాయలు సంపాదించగల్గుతోంది అంటే టెక్నాలజీతో ఆదాయానికి రెండింతలు చేయవచ్చు.

మార్కెట్ డిమాండ్ పసిగట్టవచ్చు

పలానా పంటకు మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు ఈ కృత్రిమ మేధతో ముందుగానే తెలుసుకుని ఆ తర్వాత సాగు చేయవచ్చు. పొలంలో వేర్వేరు చోట్ల కూలీలు పని చేస్తున్నప్పుడు వారిని పర్యవేక్షించవచ్చు. నాణ్యమైన విత్తనాల తయారీకి అవసరమైన పరిశోధన ఏఐతో పొందగలం కాబట్టి దిగుబడి సహజంగానే ఎక్కువగా వస్తుంది. ఏ పొలంలో ఏ పంట వేయొచ్చు అనేది వాతావరణ పరిస్థితులను పసిగట్టి బాగా దిగుబడిని ఇచ్చే పంటల్ని వేయొచ్చు. పశు పోషణ ఆవులు గొర్రెల, కోళ్ల తిండి ఆరోగ్యం పరిశుభ్రత పర్యవేక్షించవచ్చు. రియల్ టైంలో వాటి కదలికల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు వచ్చే హెచ్చరికలతో అనారోగ్య బాధలనుండి కాపాడొచ్చు. అంకుర పరిశ్రమలు మన దేశంలో వ్యవసాయం కోసమే దాదాపుగా 1500 వరకు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, విప్రో, రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే వేల ఎకరాల్లో స్మార్ట్ అగ్రికల్చర్ కొనసాగిస్తున్నారు.

రైతే రాజు

వ్యర్థాలు లేకుండా నేల సారం దెబ్బతినకుండా నీరు కలుషితం కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయ నిర్వహణ ఖర్చులు తగ్గించి ఆహార ఉత్పితిని రెట్టింపు చేసే సామర్థ్యం ఈ కృత్రిమ మేధ టెక్నాలజీతో సాధ్యమే. పెరిగే జనాభా కి సరిపడా ఆహారమే కాదు ఉద్యోగ భద్రత కల్పించడం, తదనంతరం ఉపాధి అవకాశాలు పొందడం నిరుద్యోగిగా సమస్యను నివారించడం ఈ-వ్యవసాయానికి సాధ్యమే అంటున్నారు అగ్రి సైంటిస్టులు. అందువలన రైతును రాజుగా పిలవడం భవిష్యత్తులో ఖాయమే.

డా. కృష్ణ సామల్ల

ప్రొఫెసర్ & ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

97058 90045

Advertisement

Next Story