- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'అవాల్మీకం' ఆదిపురుష్
సాంకేతికతనే కథను నడిపిస్తే అటువంటి చిత్రానికి దర్శకుడు అవసరం పెద్దగా ఉండదు. అందుకు అనుగుణమైన సీన్స్ రాసుకొనే రైటర్ ఉంటే చాలు. దర్శక సృజన కన్నా సాంకేతికత మిన్న అయిన చిత్రాల్లో మానవ సంబంధాలు ఉండవని రవికాంత్ నగాయిచ్ నాలుగు దశాబ్దాల క్రితం చెప్పారు. ఇది ఈనాటి 'ఆది పురుష్'కు ఖచ్చితంగా సరిపోతుంది. అందరికీ తెలిసిన ‘రామాయణం’ కథ వనవాసం నుంచి ప్రారంభించి రావణ వధ వరకు సినిమా నడుస్తుంది. ప్రతి ఫ్రేమ్‌ను సాంకేతిక నిపుణులు అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఆ సెంటిమెంటును వ్యాపారంగా మార్చి
ఈ సినిమా ద్వారా నేటి తరానికి రామాయణం గొప్పతనం చెప్పాలనుకున్నారు చిత్ర బృందం. కానీ అది కుదరలేదు. కానీ విఎఫ్ఎక్స్ విభాగం చక్కటి పనితనాన్ని కనబరిచింది. రాముడు (ప్రభాస్), సీత ( కృతి సనన్) , శేషు( లక్ష్మణుడు- సన్నీ సింగ్)లు కలిసి సత్యం, ధర్మంల కోసం వనవాసం కొనసాగిస్తారు. శూర్పనఖ మాటలు విని లంకేష్( సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. క్లుప్తంగా ఆదిపురుష్ కథ ఇది. రామాయణం తెలియని భారతీయుడు లేడు. నాటి ‘సీతారామ జననం’ నుంచి నేటి ‘ఆదిపురుష్’ వరకు డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. ‘లవకుశ’, ’సంపూర్ణ రామాయణం’, ‘సీతా కళ్యాణం’, (బాల) రామాయణం వంటివి జనాదరణ పొంది అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాయి. ‘రామాయణం’లో మానవ సంబంధాలు, ఆత్మీయతలు, భావోద్వేగాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఆది పురుష్ చిత్రంలో లేవు. దర్శకుడు తనదైన బాణీలో సినిమా నిర్మించాడు. ఇందుకోసం ఓ యానిమేటెడ్ హిందీ రాముని సృష్టించుకున్నాడు. ఉత్తరాది వారి రామనామ సెంటిమెంట్‌ను లాభాలుగా మార్చుకోవాలని నిర్మాత, దర్శకులు అంచనాలు వేసినట్టున్నారు. ఒక సీటు ‘హనుమ’ కోసం థియేటర్లలో కేటాయిస్తామన్నారు. చాలా ప్రదేశాలలో రెండో రోజు నుంచే చాలా సీట్లు ఖాళీగా ఉంచేశారు. ప్రభాస్ నటించిన హిందీ చిత్రంగా దీనిని కొందరు అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. విపరీతమైన ప్రచారం, 500 కోట్ల ఖర్చుతో 'క్రేజ్'ను సొంతం చేసుకుని విడుదలైన ఈ చిత్రం ఏ విధంగా ముందుకు వెళుతుందో లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి.
సాంకేతికత నిండిన 'ఆదిపురుష్'
‘రామాయణం’ ప్రతి భారతీయుల మదిలో ఓ ఆదర్శాల మూటగా దాగి ఉంది. తమ జీవితాలలో రామున్ని మమేకం చేసుకున్నారు. ఈ సెంటిమెంట్‌ను నిర్మాత, దర్శకులు తమ వ్యాపార సూత్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. యువత వారి ప్రధాన వ్యాపార వనరు. కావున వారికోసం 3D హంగులద్దారు. సేతు నిర్మాణం, సుదీర్ఘంగా చిత్రించిన రామ రావణ యుద్ధం, బంగారు లేడి, వనవాస సమయంలో ప్రకృతి దృశ్యాలు ఎలా ఒకటేమిటి మొత్తం సెల్యూలాయిడ్‌ను గ్రాఫిక్స్‌తో నింపేశారు. రాముడికి మీసాలు పెట్టారు. పది తలలు వరుసగా కాకుండా ఐదు ముందుకు, వాటి వెనుక మరో అయిదు తలలు ఉంచారు. (ఇది బహుశా ఓం రౌత్ ‘రామాయణం’ అనుకోవాలి) వాలి-సుగ్రీవుల యుద్ధం, సీతాపహరణం ('ఇదే రామాయణం'లో బహుశా 'ఆరుద్ర' గారు కూడా చెప్పలేదు అనుకుంటా) ఇలా ప్రతి సన్నివేశాన్ని ఓ మార్కెట్ సరుకుగా ట్రెండీగా చిత్రించారు. వాల్మీకి రామాయణానికి ప్రామాణికమైన అంశాలు తెలుసుకోవాలంటే పండితుల్ని సాహిత్యకారులని సంప్రదించమని సినిమాకి ముందే ఓ సలహా కూడా చెప్పారు. చిత్రంలో నటీనటుల నటనను ఆహార్యం, ఎఫెక్ట్స్ విభాగాలు మరుగున పడేసాయి.
యువతే ట్రోల్ చేసింది మరిచారా?
మొత్తం సినిమాలో అజయ్ - అతుల్ ద్వయం సంగీతం, సంచిత్, అంకిత్ జంట అందించిన నేపథ్య సంగీతం, విజువల్ మాయాజాలం, ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు అత్యుత్తమంగా పని చేశాయి. చిత్రాన్ని మూడు గంటలు కొన'సాగే' విధంగా తీశారు. సన్నీ సింగ్, కృతి సనన్ , సైఫ్ అలీ ఖాన్, దేవ దత్ తదితరులంతా హిందీ వారే. ప్రభాస్ తప్పా…! మరో విచిత్రం ఏమిటంటే హిందీ భాషా సంభాషణలకు తెలుగు సంభాషణలు సింక్ కాకపోవడం. రామాయణంలోని ప్రతి అంశం ఓ తాత్వికత, ధర్మ నిరతి, మానవ సంబంధాలలోని మృదువైన ఆత్మీయతల అల్లిక, భార్యాభర్తల మధ్య ఏకాంతమైన రహస్య శరీర భాష వంటివి ఉన్నాయి. ఇవి అత్యంత సున్నితమైనవిగా, లోతైన గాఢత కలిగిన భావోద్వేగాలతో వాల్మీకి చిత్రించిన విధానం రామాయణాన్ని చిరంజీవిగా నిలిపింది. వర్తమానంలో ఈ అంశాలన్నింటిలో ప్రతి ఒక్కరూ ఆర్థిక సంబంధాల దృష్టిని అన్వేషించడం సాధారణమైపోయింది. చిత్రసీమలో ఇది ఎక్కువగా ఉందని చెప్పేందుకు వచ్చిన ‘రామాయణ’ చిత్రాలు ఉదాహరణ. ‘ఆదిపురుష్’ దీనికి పరాకాష్ట. ఇకపైన గొప్ప సాంకేతిక నిపుణతతో మన ఇతిహాసాల్ని నాలుగైదు సంవత్సరాలు ఘనంగా చిత్రించి, కోట్లాది రూపాయలు వెచ్చించి, తెలుగు భాషను, తెలుగు నటులను నామమాత్రంగా ఉంచి ‘పాన్ ఇండియా’ చిత్రాలు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. అయితే వాటి 'ట్యాగ్' లైన్ ఏమిటంటే 'నేటి తరానికి వారికి నచ్చిన విధంగా' చిత్రం నిర్మించడం.
మరి నేటి తరం వారే… యువతే… ట్రోల్ చేస్తున్న విషయం మరిచిపోతే ఎలా. .? మన దేశంలోని యువతకు వారికి ఏమి కావాలో వారికి స్పష్టంగా తెలుసు. తామేమి గొప్ప 'మార్కెట్ సరుకులం' కాదని వారికి తెలుసు. కనుకనే 'బలగం', 'విమానం', '2018' వంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి 'స్టార్స్'ని నమ్ముకుని తీసిన చిత్రాలను యువత ఎంత మేరకు ఆదరించారో… అందరికీ తెలిసిందే..
-భమిడిపాటి గౌరీ శంకర్
94928 58395