అగ్రరాజ్యం బోనులో అదానీ!

by Ravi |   ( Updated:2024-12-03 01:01:28.0  )
అగ్రరాజ్యం బోనులో అదానీ!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సెకి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రూ.1,750 కోట్లు ముడుపుల చెల్లింపు జరిగిందని ప్రముఖ బిలియనీర్ గౌతమ్ ఆదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగిందన్న వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ కలిసి ముడుపులు చెల్లించడం కానీ లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత సెకితో ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని అజూర్ ప్రతి నిధులకు అదానీ గ్రీన్ సమాచారం పంపించింది" అని పై కేసు పేర్కొంది.

లంచం సొమ్ము సుమారు 200 మిలియన్ డాలర్లుగా (రూ .1,750 కోట్లు) అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని (83. Shortly after Gautam Adani's meeting with Andhra Pradesh's Chief Minister, and the payment or promise to pay bribes, communications internal to Adani Green and Azure reflected that Andhra Pradesh has agreed to buy power from SECI"), అదానీ సూచనతో సెకి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం, సెకి ప్రతిపాదన మేరకు 7వేల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చకచకా ఆమోదం తెలపడం జరిగిందని ఆరోపిస్తూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌.ఇ‌.సి), ఎఫ్.బి.ఐ అమెరికా కోర్టులో చార్జిషీట్ వేసి "జ్యురీ ట్రయల్" కోరాయి. ఎఫ్. బి.‌ఐ రిపోర్టులో కూడా ఫారిన్ అఫీషియల్‌కు రూ.1,750 కోట్లు లంచాలు ఇవ్వచూపారని స్పష్టంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకి ఒప్పందంపై జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, అదానీ గ్రూపుతో ఉన్న ఒప్పందాలను అమెరికా కోర్టు తీర్పు వెలువరించేంతవరకు సస్పెండ్ చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపక్రమించాలి.

హిడెన్ ఎజెండాతో టెండర్ల రద్దు

2021లో కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) అనే కంపెనీని ఏర్పాటు చేసింది. సెకికి 12 గిగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేయడానికి అదానీ పవర్ గ్రూప్ ఒప్పందం చేసు కుంది. అదే సమయంలో 6.4 గిగావాట్ల సామ ర్ధ్యంతో సౌరవిద్యుత్ ఉత్పత్తికి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్ పిలిచింది. అదానీ, టాటా, టోరెంటో, షిర్డీసాయి టెండర్లకు వచ్చాయి. కానీ మధ్యలో టెండర్ల షరతుల మార్పుపై టాటా పవర్ అభ్యంతరం తెలపగా, కార్పొరేషన్ ఏకంగా టెండర్‌నే రద్దు చేసింది. దీనిపై టాటా కోర్టుకు వెళ్లగా హైకోర్టు సైతం టాటా కంపెనీ వాదనని సమర్ధించింది. అప్పటికే అదానీ రాజస్థాన్ సంస్థల విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొనడానికి రాష్ట్రాలు ముందుకురాని తరుణంలో, ఆ విద్యుత్తును కొను గోలు చేయాలనే హిడెన్ అజెండా‌తోనే టెండర్లు రద్దు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

సోలార్ విద్యుత్ ధర తగ్గుతున్నా..

ఆదానీతో సెకి పీపీఏ చేసుకోవాలంటే, ఆ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు డిస్కంలు సిద్ధపడాలి. కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి వారిని ఆకర్షించడం కోసమే అవినీతి మార్గాన్ని అనుసరించారని ఆరోపణ. దేశంలో గత పదేళ్లుగా సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతున్న సమయంలో ఏపీలో వై‌ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2021 డిసెంబర్ 1వ తేదీన యూనిట్ రూ.2.49 పైసలకు 25 ఏళ్లపాటు కొనుగోలు చేయడానికి సెకితో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అనేకమంది విద్యుత్ రంగ నిపుణులు ఆక్షేపించారు. ఒకప్పుడు యూనిట్ ధర రూ.18-19 ఉండేది. నేషనల్ సోలార్ మిషన్‌లో భాగంగా 2010లో విద్యుత్ ఒప్పందాలు చేసుకునే నాటికి యూనిట్ ధర రూ.12-16కి, 2021లో రూ.1.99కి తగ్గింది. 2010తో పోలిస్తే సోలార్ విద్యుత్ ధర దాదాపు 83 శాతం తగ్గింది. మరింత తగ్గే అవకాశం ఉంది.

"ఐటమ్ నెం 15"గా సెకితో డీల్

సెకితో అప్పటికే కుదిరిన ఒప్పందాలు పరిశీలించి, ఒకవేళ యూనిట్ సౌర విద్యుత్ ధర రూ.2.49 కంటే తక్కువ ఉంటే అదే ధరకు రాష్ట్రం కూడా కొనుగోలు చేయాలని.. అన్ని పన్నులు, సుంకాలు, చార్జీలు కలిపి యూనిట్ సోలార్ విద్యుత్ ధర రూ.2.49కు మించకూడదని.. ఒకవేళ అదానీ ప్రాజెక్టులు ఆలస్యం అయితే, సెకి తనతో ఒప్పందం కుదుర్చుకున్న ఇతర సంస్థల నుండి విద్యుత్ సరఫరా చేయాలని, ఇతర సంస్థల విద్యుత్ ధర తక్కువగా ఉంటే.. దానినే చెల్లించాలని ఆర్ధిక శాఖ కీలకమైన సూచనలు చేసింది. కానీ 2021 అక్టోబర్ 28వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్ధిక శాఖ సూచనలు తిరస్కరిస్తూ "ఐటమ్ నెం 15"గా సెకితో ఒప్పందాన్ని జగన్ మంత్రివర్గం ఆమోదించింది. మార్కెట్లో రూ.1.99 నుండి రూ.2.17 పైసలకు విద్యుత్ కొనుగోలు జరుగుతున్న సమయంలో.. 2019లో టెండర్లు పిలిచినా దేశంలో ఎవరూ కొను గోలు చేయని విద్యుత్‌ను.. సుమారు 2000 కి.మీ దూరంలో పెట్టిన ప్లాంట్ నుండి.. 2024 సెప్టెంబరు నుండి సరఫరా చేస్తామని ఆ విద్యుత్ సంస్థలు చెబితే.. యూనిట్ రూ.2.49 పైసలకు కొనుగోలు చేయడానికి 2021లోనే ఏపీ ప్రభుత్వం సెకితో ఒప్పందం చేసుకోవడం నిజంగా విచిత్రమైన చరిత్రే.

పీపీఏల రద్దుతో భారీ పరిహారం!

ఎటువంటి పీపీఏలు, ప్రభుత్వం నుండి దీర్ఘకాలిక హామీలు లేకుండానే 5వేల మె.వా విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నా రంటూ.. వాస్తవాలు పరిశీలించకుండా.. పర్యవసానాలు ఆలోచించకుండా అంతకుముందు టీడీపీ ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేసి.. యూనిట్ కరెంటు తీసుకోకుండా రూ.4,500 కోట్లు విద్యుత్ కంపెనీలకు పరిహారం చెల్లించింది జగన్ ప్రభుత్వం. అటువంటప్పుడు స్వయంగా పవర్ కంపెనీల యజమానిగా, విద్యుత్ రంగంపై క్షుణ్ణమైన అవగాహన ఉన్న జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా సెకితో ఒప్పందం కుదుర్చుకోవడంలో స్వలాభం ఉందని విజ్ఞులు ఉద్దేశ్యపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆ ఒప్పందాన్ని సమర్ధించుకోవడం కోసం, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే వసూలు చేసే ఐ ఎస్‌టి‌ఎస్ (ప్రస్తుతం జనరల్ పవర్ యాక్సెస్, జీపీఏ) ఛార్జీలను ప్రత్యేక ప్రోత్సాహకం క్రింద ఇరవై ఐదేళ్ల పాటు రద్దు చేశారని పచ్చి అబద్దం ఆడారు. సెకి ఈ విధమైన మినహాయింపు ఇవ్వలేదని, సగటున యూనిట్‌కి రూ.1.70 వరకు ఐ‌ఎస్‌టి‌ఎస్ ఉండవచ్చని అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు.

అదానీతో డీల్‌ తక్షణ రద్దు

ఒకవ్యక్తి అవినీతి వల్ల ప్రజలపై లక్షల కోట్ల భారం పడటం భావ్యం కాదు. అమెరికా కోర్టులో కేసు నమో దైన వెంటనే అదానీ గ్రూపుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం ఒప్పందాలను పునఃపరిశీలన చేస్తు న్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూపుతో విమానాశ్రయ ఒప్పందాన్ని కెన్యా ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సెకి ఒప్పందంపై జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిం చి, అదానీ గ్రూపుతో ఉన్న ఒప్పందాలను అమెరికా కోర్టు తీర్పు వెలువరించేంతవరకు సస్పెండ్ చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపక్రమించాలి.

- లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Advertisement

Next Story

Most Viewed