జాతీయ పునర్నిర్మాణమే.. ఏబీవీపీ లక్ష్యం

by Ravi |   ( Updated:2023-07-09 00:15:54.0  )
జాతీయ పునర్నిర్మాణమే.. ఏబీవీపీ లక్ష్యం
X

సాధారణ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలలో గౌరవప్రద దేశంగా భారత్‌ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న క్యాడర్ బెస్ట్ మాస్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. స్వాతంత్ర్యం వచ్చాక దేశ యువతలో బానిసత్వాన్ని తొలగించి వారిని చైతన్య పరిచేందుకు 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటైంది. ఇది నేటికి 73 వసంతాలు పూర్తి చేసుకొని 74 వసంతంలోకి అడుగుపెట్టింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంచుతూ జాతి ఫునర్ నిర్మాణమే లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్ నిర్మాణం అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు సాగుతోంది ఏబీవీపీ.

అతిపెద్ద విద్యార్థి సంఘం...!

మారుమూల గ్రామాల నుంచి మహా నగరాలు వరకు విస్తరిస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఏబీవీపీ ముందుండి పరిష్కరిస్తోంది. కాలేజీల్లో సౌలతులు, ఫీజు రియంబర్స్ మెంట్, హాస్టళ్లలో సమస్యలు, అకడమిక్ ఇబ్బందులు.. ఇలా విద్యార్థుల సమస్యలే కాదు, దేశాన్ని విఛ్ఛిన్నం చేసే సంఘటన ఎక్కడ జరిగినా అనుక్షణం స్పందిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అటక్ నుండి కటక్ వరకు విస్తరిస్తూ 35 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోంది. గడిచిన 73 ఏండ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరెన్నో విజయాలను చూసింది. ఏబీవీపీలో ఒకవైపు ధర్నాలు, రాస్తారోకోలు, పాఠశాలలు, కళాశాలలు బంద్‌లే కాకుండా నాణేనికి మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా 'సృజన' మెడికల్ విద్యార్థుల కోసం 'మెడివిషన్', మన దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు మన సంస్కృతి. సంప్రదాయాలను పరిచయం చేస్తూ WOSY, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం 'SEIL', గిరిజన విద్యార్థుల కోసం 'వనవాసి' పర్యావరణ పరిరక్షణ కోసం 'స్టూడెంట్ ఫర్ డెవలెప్‌మెంట్' విద్యార్థుల్లో సేవా భావం పెంచేందుకు స్టూడెంట్ ఫర్ సేవ', విద్యార్థి కళాకారులను ప్రోత్సహించేందుకు 'కళామంచ్', ఐఐటీ, నిట్ స్థాయి విద్యార్థుల కోసం 'థింక్ ఇండియా', లా విద్యార్థులకు లా ఫోరం, క్రీడలపై ఆసక్తి గల విద్యార్థుల కోసం ఖేల్...ఇలా అనేక రకాల కార్యక్రమాలతో విద్యార్థులకు లీడర్ షిప్‌ను అందిస్తూనే... దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఇలా జాతీయ పునర్ నిర్మాణం మహాయజ్ఞంలో పని చేసిన అనేక మంది నేడు ప్రధాని, ఉపరాష్ట్రపతి మొదలు ప్రజాప్రతినిధిగానూ, ఉన్నత ఉద్యోగస్తులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఇలా ప్రతి రంగంలోను ఏబీవీపీ నేర్పిన క్రమశిక్షణ, కార్యదీక్షతో ముందుకెళ్తున్నారు.

సిద్ధాంతం కోసం పని చేస్తూ...!

జాతీయవాద సిద్ధాంతం కోసం, కాలేజీ క్యాంపస్‌లలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి సంఘటనలు వింటేనే రక్తం మరుగుతుంది. ఆనాడు కాలేజీ క్యాంపస్‌లలో భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినదిస్తే చంపేస్తామని బెదిరించే విదేశీ సిద్ధాంతమైన కమ్యూనిస్టు, వాటి అనుబంధ సంఘాలు కాకతీయ యూనివర్సిటీ లాంటి క్యాంపస్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అప్పటి వీసీ జాతీయ జెండా ఎగురవేస్తున్న సందర్భంలో రాడికల్స్ రౌడీల్లా వచ్చి ఇది బూటకపు స్వాతంత్య్రమని జాతీయ జెండాను అవమానిస్తూ నల్ల జెండా ఎగురవేస్తున్న సమయంలో ఏబీవీపీ కార్యకర్త జగన్మోహన్ ఒక్కడే రాడికల్స్‌ను ఎదిరించి జాతీయ జెండాను ఎగురవేశారు... దీంతో రాడికల్స్ ఆయనను అతి కిరాతంగా హతమార్చారు. ఇదే మాదిరిగా ఓయూలో మేరెడ్డి చంద్రన్న, నల్గొండ జిల్లాలో ఏచూరి శ్రీనన్న. కరీంనగర్ జగిత్యాలలో రామన్న, గోపన్న ఇలా తెలంగాణ ప్రాంతంలో 40 మందికి పైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బలయ్యారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఏబీవీపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ..నేటి మా తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఫలితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేటి ఏబీవీపీ కార్యకర్తలు మీ రక్తం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు క్షణం క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణం, భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు.

సామాజిక సమస్యల పరిష్కార కేంద్రంగా..!

మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరి, కృష్ణమ్మలు మన ప్రాంతం దిక్కు మల్లాలి అంటూ జల చైతన్య యాత్రలు, బాసర నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర, నా రక్తం,నా తెలంగాణ, హరిత తెలంగాణ లాంటి నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్వహించింది. మలిదశ ఉద్యమంలో 2010 జనవరిలో భారత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను తీసుకొచ్చి లక్షమంది విద్యార్థులతో తెలంగాణ విద్యార్థి రణభేరి నిర్వహించి ఉద్యమం పట్ల దేశ ప్రజల దృష్టి కేంద్రీకరించేలా చేసింది. ఇప్పుడు ఏబీవీపీ విద్యార్థుల సంక్షేమం కోసం, సమకాలీన సమస్యల పరిష్కార కేంద్రంగా, విద్యారంగంలో రావలసిన సంస్కరణల కేంద్రంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్స్ డెవలప్మెంట్ కేంద్రంగా,పేద విద్యార్థులలో జాతీయ భావాలు నెలకొల్పేలా, అనే ఇక విద్యారంగ సమస్యలు పరిష్కార కేంద్రంగా ఏబీవీపీ కార్యకర్తల సొంతం. రాబోయే రోజుల్లో ఏబీవీపీ 75 వసంతాల సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినూత్న కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మహా ఉద్యమంలో విద్యార్థులంతా భాగస్వామ్యులై దేశ అభివృద్ధిలో పాలుపంచుకుందాం.

సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

90143 22572

Advertisement

Next Story