విద్యా విధ్వంసంపై..ఏబీవీపీ కదన భేరి

by Ravi |   ( Updated:2023-08-01 00:00:43.0  )
విద్యా విధ్వంసంపై..ఏబీవీపీ కదన భేరి
X

రాష్ట్రంలో రెండు దఫాల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసమై విద్యార్థుల భవిష్యత్ అంధకారమైంది. పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అడుగడుగునా ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో జరిగిన నష్టం సమీప భవిష్యత్తులో భర్తీ చేయలేనిది. ఈ దశాబ్ద కాలంలో ప్రభుత్వం విద్యారంగానికి అరకొర బడ్జెట్ కేటాయింపులు, బోధన, బోధనేతర నియామకాల భర్తీలో అలవిమాలిన అలసత్వం, మౌలిక వసతుల కొరత ఇలా పలు అంశాల్లో ప్రభుత్వ అలసత్వం తెలంగాణ విద్యార్థుల పట్ల శాపమైంది. ఉద్యమ సమయంలో నాణ్యమైన విద్యా అంటూ నినదించి, అధికార పీఠమెక్కాక.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించి, అందుకు పూర్తి విరుద్ధంగా కేజీ టూ పీజీ వరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ విద్యా రంగాన్ని కార్పొరేట్ వశం చేసి.. దేశంలోనే విద్యాసంస్థలకు తెలంగాణ లాభసాటిగా మార్చారు.

ఖాయిలా పడ్డ పరిశ్రమలుగా...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి హేతుబద్ధీకరణ పేరుతో 8000 పాఠశాలలను మూసి వేయగా నేడు సర్కారు పాఠశాలలు కేవలం 26,074కు పరిమితమయ్యాయి. ఈ పాఠశాలల్లో 17,873 ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 6,632 ఏకోపాధ్యాయ పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. దీంతో పాఠశాలల్లో అభ్యసనా ఫలితాలు దుర్భర స్థితిలో ఉండి.. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనికితోడు పాఠశాలలను పర్యవేక్షించే అధికారులు లేకపోవడం గమనిస్తే విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో అవగతమవుతుంది. మరోవైపు నిధులు లేక శిథిలావస్థకు చేరిన సర్కారు బడుల్లో కనీస సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరించడం దౌర్బాగ్యం. విద్యారంగంపై ప్రశ్నిస్తే 982 గురుకులాల ఏర్పాటును సమర్థించుకుంటున్నారు. అయితే వాటికి భవనాల కొరత, వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత గురించి మాత్రం పట్టించుకోరు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఢిల్లీ విద్యా వ్యవస్థను పొగుడుతారు. ఇది గమనిస్తే నిర్లక్ష్యంమో, సామర్థ్య లోపమో ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్కారు బడుల్ని పటిష్టపరుస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన మన ఊరు-మన బడి పథకం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతూ మొదటి దశలోని 9,145 బడులకు గానూ కేవలం 600 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయంటే సర్కారు బడులపై ప్రభుత్వ చిత్తశుద్ధి అవగతమవుతోంది. అలాగే పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌ను సకాలంలో అందించలేకపోతుంది. ఇలా సర్కారు బడులను పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది. ఫీజు నియంత్రణ చట్టం అమలు పరచి.. పాఠశాలలో ఏకీకృత ఫీజులు నిర్దేశించి అధిక ఫీజులు, డొనేషన్‌లకు కళ్లెం వేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు లేకపోవడంతో పేద మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.

వారిపై ఉక్కుపాదం మోపరా?

స్వరాష్ట్రంలోనైనా ఇక్కడి విద్య పరిస్థితి బాగుపడుతుందనుకుంటే నిరాశే ఎదురైంది. కొఠారీ కమిషన్ సిఫార్సు ప్రకారం బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం మొదటి బడ్జెట్‌లో 10.89 శాతం కేటాయించి క్రమంగా తగ్గించి ప్రస్తుతం 6.57 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. తొలుత నిధులు తద్వారా ప్రాధాన్యత తగ్గిస్తూ సర్కారు బడుల నుండి యూనివర్సిటీల వరకు నియామకాలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో విద్యా సంస్థలు ప్రభుత్వ నిరాదరణకు గురై ఖాయిలా పడ్డ పరిశ్రమలుగా మారాయి. ఇక రాష్ట్రంలో క్షీణించిన బడ్జెట్ కేటాయింపుల కారణంగా సంక్షేమ వసతి గృహాలు నరక కూపాలుగా మారాయి. వారికి నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు లేక అనారోగ్యం పాలవుతున్నారు.

కార్పొరేట్ శక్తుల చేతిలో విద్యను బందీ చేసి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరం. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల బహిరంగ ఫీజు దోపిడీపై కనీస నియంత్రణ కొరవడింది. ఏళ్లుగా వెళ్లునుకుపోయి వేల కోట్ల రూపాయలు వెనకేసుకొని ప్రభుత్వ అనుమతులు లేకపోయినా గల్లీకొక బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి అక్రమ అడ్మిషన్స్ చేపడుతున్నా ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం కార్పొరేట్ శక్తుల చేతి వాటాకు అలవాటుపడ్డ స్థితికి పరాకాష్ట. ఇందులో ఒత్తిడితో కూడిన బట్టీ చదువులతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యల పాలవుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంతటి ఆగడాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ శక్తులపై ఉక్కుపాదం మోపకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక మతలబేంటో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు అధ:పాతాళానికి నెట్టి వేయబడ్డాయి. వీటిల్లో గత తొమ్మిదేండ్లలో ఒక్క పోస్టు భర్తీచేయలేదు. స్వరాష్ట్రంలో యూనివర్సిటీలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దుతానన్న ప్రభుత్వాధినేత విశ్వ విద్యాలయల ఆస్తిత్వాన్ని ప్రశ్నార్థకంలోకి నెట్టారు.

దశాబ్దకాలంగా నిర్లక్ష్యం..

నాణ్యమైన విద్య అందని కారణంగా భవిష్యత్తులో తర తరాల వెనుకబాటు తథ్యం అవుతుంది. తీవ్రమైన ఆర్థిక, సామాజిక అసమానతలతో రాజ్యాంగ స్ఫూర్తి అయిన సామాజిక న్యాయం అందకుండా ప్రమాదకరమైన సామాజిక సమస్యలకు దారి తీస్తోంది. అదేవిధంగా రాబోయే తరాలు నాణ్యమైన విద్య పొందని కారణంగా నైపుణ్యత లేని అసంఘటిత కార్మికులుగా తక్కువ వేతనాలతో పేదరికంలో నెట్టడమే గాక దేశ ఆర్థిక ఉత్పాదకత తగ్గుతుంది. దశాబ్దకాలంగా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో విద్యా విధ్వంసానికి దారి తీసిందని జాతీయ స్థాయి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

35వ స్థానంలో తెలంగాణ

ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఫర్మామెన్స్ ఇండెక్స్ అభ్యసన ఫలితాలను చూస్తే తెలంగాణ 35వ స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అభ్యసన ఫలితాలు సహా ఇతర 5 ప్రామాణికమైన అంశాల పరిశీలన ప్రకారం తెలంగాణ 35 స్థానంలో ఉంది. దేశంలో ఒక్క మేఘాలయా మినహా మిగిలిన రాష్ట్రాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి అధ్వాన్న స్థితి నుండి పురోగతి దిశగా అడుగులు వేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి. అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలి. పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చెప్పడంతో పాటు బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి. జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించే దిశగా త్వరితగతిన సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ విద్యా రంగాన్ని, భవిష్యత్‌ను కాపాడేందుకు, నిరుద్యోగ వ్యతిరేక బీఆర్ఎస్ పాలనపై ఏబీవీపీ తలపెట్టిన విద్యార్థి కదన భేరి భారీ బహిరంగ సభ నేడు పరేడ్ గ్రౌండ్‌లో జరగనుంది. అందరూ కదలిరండి.

డా. కె.ప్రవీణ్ రెడ్డి

ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్

90104 05476

Advertisement

Next Story